బుడ్డోడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, హెయిర్ స్టైలిస్ట్ తన జుట్టును సెట్ చేస్తుంటే అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కూర్చుంది ఆరు.
పెళ్లి చీరలో తనను తాను చూసుకుంటూ, అప్పుడప్పుడు చీర కొంగును సరిచేసుకుంటూ మురిసిపోతుంది. ఒడిలో ఉన్న బుడ్డోడు మాత్రం తన చిన్న చిన్న చేతులతో ఆరు చీరను పట్టుకొని ఆడుకుంటున్నాడు. వాడి అల్లరిని చూసి చిన్నగా నవ్వుకుంటూ, మరోవైపు హెయిర్ స్టైలిస్ట్ చెప్పినట్టుగా తలను కాస్త అటూ ఇటూ తిప్పుతోంది.
అప్పుడే గదిలోకి వచ్చిన రాధిక గారు కూతురిని అలా చూస్తూ ఒక్క క్షణం అక్కడే ఆగిపోయారు.
ఎప్పుడూ అల్లరి చేస్తూ, చిన్నపిల్లలా తిరిగే తన కూతురు ఈరోజు పెళ్లికూతురుగా తయారవడం చూసి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది.
“నా బంగారు తల్లి… ఎంత బాగుందో!” అంటూ ఆరు దగ్గరికి వచ్చారు.
“బయట ఎవరైనా చూస్తే ఇట్టే దిష్టి తగిలిపోయేలా ఉన్నావే!” అంటూ కూతురి బుగ్గలను మురిపెంగా చూస్తూ, ఆమె కళ్లకు పెట్టిన కాటుకను కొద్దిగా తీసి చెవి వెనుక చిన్నగా పెట్టారు.