“మీకు కూడా ఒక కూతురు ఉంది. తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా? కనీసం చైత్ర మిమ్మల్ని ఎందుకంత అసహ్యించుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కన్న కూతురి దగ్గర ఒక తల్లిగా ప్రేమను సంపాదించుకోలేని మీరు, ఒక ఆడదానిగా ఎందుకు పనికిరారు?” అని అంటాడు రామ్.
రామ్ పక్కనే ఆదమరిచి నిద్రపోతున్న సీతను జాగ్రత్తగా ఎత్తుకుని వాళ్ల రూమ్‌లోకి తీసుకెళ్తాడు.
రాగిణి గారు రామ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.
“నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను ? వాడెవడికో భయపడి అనవసరంగా సీతను ఇబ్బంది పెడుతున్నాను. రామ్ అంటున్నదాంట్లో తప్పేమీ లేదు. నా కూతురే నన్ను ఇంతగా అసహ్యించుకుంటుంది. కానీ సీత ఏ రోజు నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. నా మాటకు ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పలేదు. అలాంటి దాన్ని నేను ఇన్ని రోజులు ఇంత కష్టపెట్టానా?” అంటూ కుమిలిపోతారు.
“నిజంగా నేను ఇంత పెద్ద తప్పు చేశాను. అసలు నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు” అని తనలో తానే నిందించుకుంటూ, ఏడుస్తూ ఆ రాత్రంతా గడిపేస్తారు రాగిణి.
రామ్ సీతను జాగ్రత్తగా పడుకోబెట్టి, తన పక్కనే పడుకుంటాడు. సీత మెడ ఒంపులో తల పెట్టుకుని, ఆమె ముఖం చూస్తూ…