తారిణి వేషంలో ఉన్న తారక్‌ని చూసిన మోనా షాక్‌కి గురై అతని వైపు చూస్తుంది. విక్టర్ కోటలో మోనాను చూసిన తారక్ కూడా అంతే షాక్ అవుతాడు.
ఇదిలా ఉండగా, గెస్ట్‌హౌస్‌లో ఇండియా నుంచి కజిన్స్‌గా యాక్ట్ చేయడానికి అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారనే విషయం తెలుసుకున్న విక్టర్, తన సహచరులతో కలిసి అక్కడికి వస్తాడు.
“ఇది… ఇది ఎవరు?” అని తారిణి వైపు చేయి చూపిస్తూ మోనా అడుగుతుంది.
ఆమెకు ఏదైనా అనుమానం వచ్చిందేమోనని అందరూ చెమటలు పట్టిపోతారు.
“మీరందరూ ఓకే… ఈమె ఎవరో చెప్పండి” అని మోనా అడుగుతూ తారిణి దగ్గరకు వెళ్లగానే, తల మొత్తం దుపట్టాతో కప్పుకున్న తారక్ వెనక్కి తిరిగిపోతాడు.
“మేడం… ఆమె మా తో పాటు వచ్చినవారు. శార్వరి మేడంకి మెహందీ వేయడం, చీర కట్టడం, ఇండియన్ పెళ్లి సంప్రదాయాలు… ఇవన్నీ ఈమెకు తెలుసు. అందుకే ఈమెను తీసుకొచ్చాం.
మునిరత్న సర్ కూడా ఈమెను తీసుకురమ్మని చెప్పారు. మీకు తెలియదా?” అని అక్కడున్న వారిలో కాస్త ధైర్యంగా ఉన్న శశాంక్, మోనా మరియు తారక్ మధ్య నిలబడి చెప్పాడు.
తారక్ వైపు అనుమానంగా చూసిన మోనా, చివరికి సరేనని తల ఊపి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆమె వెళ్లిపోయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
“అబ్బా… బతికిపోయాం. లేకపోతే ఈ నర్స్ చేతిలో చిక్కుకోవాల్సి వచ్చేది” అని వాళ్లంతా మాట్లాడుకుంటుంటే, తారక్ ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.
“ఈమె ఇక్కడ ఎందుకు ఉంది? అంటే విక్కీ కూడా ఈ వలలో పడ్డాడా? లేక ఈమె మాత్రమే వీళ్లతో చేతులు కలిపిందా? ఈమె ఇక్కడ ఉందంటే వివేక్ కూడా ఇక్కడే ఉండి ఉంటాడు…” అని తారక్ ఆలోచిస్తున్నాడు.