ఆరు తన ఇష్టాన్ని తెలియజేయడంతో యష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
“నాన్న… మా ఇద్దరికీ పెళ్లి చేయండి” అంటూ అరుణ్ గారిని పిలిచాడు.
అక్కడున్న పెద్దలందరూ ఒక్కసారిగా యష్ వైపు చూశారు. యష్ తన చేతుల్లో ఉన్న బాబుని జాగ్రత్తగా పట్టుకుని, వేద రాసిన లెటర్‌లో ఉన్న విషయాలన్నింటినీ క్లుప్తంగా వివరించాడు.
తన బిడ్డకు ఆరు, యష్‌లను తల్లిదండ్రులుగా ఉండమని కోరిందని, చివరిగా తన చితి మంటల సాక్షిగా యష్ ఆరు మెడలో తాళి కట్టాలని ఆశపడిందని చెప్పాడు.
ఆ మాటలు విన్న పెద్దలందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన చివరి కోరికలో కూడా స్నేహితుల జీవితాల గురించి ఆలోచించిన వేదను తలుచుకుని బాధపడ్డారు.
వేద కోరినట్టుగానే ఆ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు.