ఇంతకాలం “మాస్టారు” అని పిలిచిన అద్వైత్…. ఇక నుంచి తన జీవితంలో మరో కొత్త పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ చిన్న చిరునవ్వు…. ఆ కొత్త జీవితంపై ఉన్న నమ్మకానికి నిదర్శనంలా ఉంది.
పెళ్లి అయిన తర్వాత…. మొదటి ఉదయం…. సహస్రకి చాలా కొత్తగా అనిపిస్తోంది. కళ్లు తెరిచి నెమ్మదిగా చుట్టూ చూసింది…. నిన్నటి వరకు తన గది…. తన వస్తువులు…. తనకి అలవాటైన తన ప్రపంచం…. ఈరోజు మాత్రం అన్నీ మారిపోయాయి. పక్కనే అద్వైత్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు……
అతని వైపు చూస్తూ సహస్ర చిన్నగా నవ్వుకుంది. “నిజంగానే పెళ్లయిపోయిందా….” అని తనలో తానే అనుకుంది. నిన్నటి వరకు తనకి “మాస్టారు”గా కనిపించిన వ్యక్తి…. ఇప్పుడు తన జీవిత భాగస్వామిగా తన పక్కనే ఉన్నాడు. ఆ ఆలోచన రాగానే ఆమె ముఖంలో తెలియకుండానే సిగ్గుతో కూడిన చిరునవ్వు వచ్చింది.
అంతలో అద్వైత్ కళ్లను తెరిచి ఆమె వైపు చూస్తూ, “గుడ్ మార్నింగ్,” అన్నాడు. సహస్ర ఒక్కసారిగా తడబడుతూ, “గుడ్ మార్నింగ్….” అంది. అతను ఆమె ముఖం చూస్తూ నవ్వి, “ఏంటి…. ఇంత సిగ్గు?” అని అడిగాడు. “ఏం లేదు,” అంది సహస్ర. “మరి?” అని అతను మళ్లీ అడగడంతో సహస్ర కాసేపు ఆలోచించి, “కొత్తగా ఉంది,” అంది…..
“ఏది?” అని అద్వైత్ అడిగాడు. సహస్ర అతని వైపు చూసి, “ఇదంతా….” అంది. ఆమె చెప్పింది ఒక్క మాటే అయినా…. అందులో తన మనసులో ఉన్న భావాలన్నీ దాగి ఉన్నాయి. అద్వైత్ కూడా చిన్నగా నవ్వుతూ, “నాక్కూడా కొత్తగానే ఉంది,” అన్నాడు. ఆ మాటతో సహస్రకి కాస్త ధైర్యం వచ్చినట్టుగా అనిపించింది.