Love me again ❤️ – 2
బస్టాప్ – కొద్ది క్షణాల తర్వాత]
బస్సు వేగంగా దూసుకువెళ్ళిపోయింది. ఆ బస్సు వెళ్తున్న వైపే శీను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. జానకి ముఖంలో తను ఎప్పుడూ చూడని ఆ ఆనందం… ఆ బావతో ఆమె గడిపే క్షణాలు… ఇవన్నీ శీనుకు ఒక చేదు నిజాన్ని స్పష్టం చేశాయి. జానకి ప్రపంచంలో తనకంటూ ఏ చిన్న చోటూ లేదని, తను కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమేనని అతనికి అర్థమైంది.
అతని గుండెలో మౌనమైన వేదన మొదలైంది. ఒక్క మాట కూడా మాట్లాడాలని అనిపించలేదు, ఎవరినీ నిందించాలని లేదు. తన స్థితిని, తన స్థాయిని తనే గుర్తుచేసుకున్నాడు. జానకికి తను ఎవరో కూడా సరిగ్గా తెలియదు, అలాంటిది ఆమె తనను గుర్తుంచుకోవాలని ఆశించడం అత్యాశే అవుతుందని అనిపించింది.
శీను మెల్లగా అక్కడి నుండి వెనక్కి తిరిగాడు.
ఆకాశం నుండి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. శీను దగ్గర గొడుగు లేదు, అయినా ఆ వర్షపు చినుకులు తన ఒంటికి తగులుతుంటే.. అవి తన కళ్ళలో ఉన్న నీటిని కడిగేస్తున్నట్టుగా అనిపించాయి. తడిసిన బట్టలతో, తలదించుకుని అడుగులు వేయడం మొదలుపెట్టాడు.
దారిలో వెళ్తుంటే ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. జానకి బస్సులోంచి చూసినట్టుగా, బయట ప్రపంచాన్ని తను చూడటం లేదు. కేవలం తనలో తాను మథనపడుతూ, “ఆకాశాన్ని అందుకోవాలని చూడటం నా పొరపాటే… భూమిపై ఉన్న వాడికి ఆకాశం కేవలం అందనంత ఎత్తులో ఉండే అందం మాత్రమే” అని తనలో తాను గొణుక్కున్నాడు.
అతను నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ నిశ్శబ్ద రాత్రి.. అతని ఒంటరితనానికి తోడుగా నిలిచింది. ఆ రోజు తర్వాత శీను మళ్ళీ ఆ బస్టాప్ వైపు వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన జ్ఞాపకాలను, తన ఆశలను ఆ బస్టాప్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతున్నాడు.
[బస్టాప్ – అదే సమయం]
శ్రావణి ఫోన్ రిసీవర్ని (STD బూత్ ఫోన్) కట్టి, తిరిగింది. ఒకపక్క జానకి తన బావతో ఏదో జోక్ చెబుతూ మురిసిపోతోంది. జానకి ముఖంలో ఉన్న ఆ కాంతి, ఆమె కళ్ళలో ఉన్న ఆనందం శ్రావణికి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, అక్కడే ఉన్న శీను… శ్రావణి పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు.
శీను కళ్ళు నేలకేసి చూస్తున్నాయి. అతని నడకలో వేగం లేదు, బాధ్యత లేని ఓడిపోయిన వాడిలా అడుగులు వేస్తున్నాడు. శ్రావణి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. శీను ముఖంలో కనిపించిన ఆ నిస్సహాయత, ఆ బాధ ఆమె గుండెను పిండేసింది. అతను కేవలం నడుచుకుంటూ వెళ్ళడం లేదు, తన కలలన్నింటినీ వెనుక వదిలేసి వెళ్తున్నాడని శ్రావణికి అర్థమైపోయింది.
శీను ఆమె పక్కనే వెళ్తున్నప్పుడు, ఇద్దరి చూపులు ఒక క్షణం కలిశాయి. శీను కళ్ళలో ఉన్నది కోపం కాదు, కేవలం ఒక లోతైన వేదన. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అలాగే తల దించుకుని ముందుకు సాగిపోయాడు.
జానకి ఇంకా బావతో నవ్వుతూనే ఉంది. శ్రావణి జానకిని పిలవబోయి, మళ్ళీ ఆగిపోయింది. ‘ఈ క్షణంలో జానకికి ఈ విషయం చెబితే ఆమె సంతోషం పాడవుతుందా? అసలు ఈ అబ్బాయి ఎవరు? వీడి బాధ ఏంటి?’ అన్న ప్రశ్నలు శ్రావణి మనసులో మెదిలాయి.
శ్రావణి జానకి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది, కానీ ఆమె మనసంతా శీను వెళ్తున్న వైపే ఉంది.
జానకి: “ఏంటి శ్రావణీ, అంత ఆలోచనలో ఉన్నావు? ఫోన్ కాల్ ఎవరితో? ఇంతసేపు ఏం చేస్తున్నావు?”
శ్రావణి: (ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి, శీను వెళ్ళిన వైపు చూస్తూ) “ఏమీ లేదు జానూ… ఊరికే. ఎవరిదో జీవితం, ఎవరిదో వేదన.. అన్నీ చూస్తుంటే ఏదోలా అనిపిస్తోంది.”
జానకి తన బావ వైపు చూసి నవ్వుతూ, “అవన్నీ వదిలేయ్! మనం వెళ్దాం పద, చాలా లేట్ అయింది” అంది.
శ్రావణి జానకిని అనుసరిస్తూ బస్సు ఎక్కింది, కానీ కిటికీలోంచి బయట వర్షంలో తడుస్తూ ఒంటరిగా వెళ్తున్న శీనునే చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తెలుసు… ఆ బస్టాప్‌లో ఆ రోజు ఏం జరిగిందో, జానకికి తెలిసే అవకాశం అస్సలు లేదని.
[బస్సులో – ప్రయాణం]
బస్సులో జానకి తన బావ పక్కన కూర్చుని, ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతోంది. తన బావ చేసిన చిన్న చిన్న అల్లరి పనులకు, మాటలకు జానకి పకపకా నవ్వుతోంది. ఆ నవ్వులో ఒక విధమైన భద్రత, ఆనందం కనిపిస్తున్నాయి. అప్పుడే జానకి బావ, తన వైపు కూర్చున్న శ్రావణి వైపు తిరిగి, నవ్వుతూ ఇలా అన్నాడు.
బావ: “శ్రావణీ, జానకి చెప్పిందా? వచ్చే వారం మా పెళ్లి! నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి. నీకు ఇన్విటేషన్ ఇవ్వడానికే ఈరోజు స్పెషల్‌గా వచ్చాను.”
ఆ మాట వినగానే జానకి సిగ్గుపడుతూ కిటికీ వైపు తల తిప్పుకుంది. ఆమె ముఖంలో విరిసిన ఆ ఆనందం చూస్తుంటే, ఒక అమ్మాయి జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో అర్థమవుతోంది.
కానీ, శ్రావణి మనసు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క క్షణం క్రితం బస్టాప్‌లో శీను ఆ వర్షంలో, ఆ ఒంటరితనంతో, తడిసిన బట్టలతో తలదించుకుని వెళ్ళిపోవడం ఆమె కళ్ళముందు కదలాడింది. జానకి పెళ్లి వార్త వింటే… ఆ అబ్బాయి (శీను) ఎంతలా కుప్పకూలిపోతాడో, వాడి ఆశలు ఎలా ఆవిరైపోతాయో అని శ్రావణికి ఒకటే ఆవేదనగా ఉంది.
శ్రావణి: (నవ్వలేక, నవ్వుతున్నట్టు నటిస్తూ) “ఖచ్చితంగా … పెళ్ళికి జానకి కంటే ముందే ఉంటాను. మీరు చాలా బాగుంటారు జంటగా!”
ఆమె అంటున్న మాటలు బయటకు బాగున్నాయని అనిపించినా, లోపల ఏదో తెలియని భారం. జానకికి తన బావంటే ప్రాణం అని, తను ఎంతో ప్రేమగా పెళ్లి చేసుకుంటోందని శ్రావణికి తెలుసు. కానీ, ఆ బస్టాప్‌లో శీను కళ్ళలో ఉన్న ఆరాటం, ఆ ప్రేమ… అవన్నీ నిష్ప్రయోజనమని తెలిసి, శ్రావణి మనసులో శీను పట్ల ఒక తెలియని జాలి మొదలైంది.
జానకి ఆనందంగా బావతో మాట్లాడుతుంటే, శ్రావణి మళ్ళీ కిటికీలోంచి బయటకి చూసింది. వర్షం తగ్గుముఖం పట్టింది, కానీ ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన ‘ప్రేమలో గెలిచే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ, ఇలా తెలియకుండానే ఓడిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా!’
[బస్టాప్ – మరుసటి రోజు ఉదయం]
ఎండ తీవ్రంగా ఉంది. శీను అదే బస్టాప్ పిల్లర్ ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో రాత్రంతా నిద్రలేని అలసట, గుండెల్లో ఆ నిన్నటి సంఘటన తాలూకు గాయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడికి రాకూడదని, జానకిని చూడటం మానేయాలని నిన్న రాత్రంతా తనకు తాను చెప్పుకున్నాడు. కానీ, అలవాటులో పొరపాటో, లేక ఆశ చావని మనసో… అతని అడుగులు మళ్ళీ యంత్రంలా బస్టాప్ వైపే పడ్డాయి.
కొద్దిసేపటికే జానకి, శ్రావణి బస్టాప్‌కు వచ్చారు.
జానకి ముఖంలో నిన్నటి కంటే ఎక్కువ వెలుగు ఉంది. ఆమె కు తన బావ ఇచిన చిన్న నోకియా ఫోన్ తో
బావతో మెసేజ్‌లు చేసుకుంటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. ఆ నవ్వు, ఆ సంతోషం శీను గుండెల్లో బాకులా దిగుతోంది. ఆమెకు తెలియదు… పక్కనే, ఆ బస్టాప్ చివరన, తనను ప్రేమించే ఒక హృదయం ముక్కలైపోతోందని.
శ్రావణి బస్సు కోసం రోడ్డు వైపు చూస్తుండగా, ఆమె కళ్ళు అనుకోకుండా శీను మీద పడ్డాయి. నిన్న చూసిన బాధ కంటే, ఈరోజు అతని కళ్ళలో కనిపిస్తున్న ఆ శూన్యం శ్రావణిని మరింత కలచివేసింది. నిన్న తను పెళ్లి గురించి చెప్పిన మాటలు శీను విన్నాడో లేదో తెలియదు, కానీ అతని ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. ఈరోజు అతను జానకిని చూడటం లేదు, ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా, కింద ఉన్న నేలనే ఆశగా చూస్తున్నాడు.
జానకి, తన బావతో సంభాషణలో మునిగిపోయి, తన ప్రపంచంలో తను ఉంది. ఆ క్షణంలో శ్రావణికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది ఒకవైపు తన స్నేహితురాలి సంతోషం, మరోవైపు శీను పడుతున్న వేదన. శ్రావణి మెల్లగా జానకి భుజం తట్టి, “జానూ, బస్సు వచ్చేస్తోంది… ఫోన్ పక్కన పెట్టు” అంది.
బస్సు ఆగింది. జానకి నవ్వుతూ బస్సు ఎక్కడానికి అడుగులు వేసింది. ఆమె శీను పక్క నుంచే వెళ్ళింది. శీను గాలిలా పక్కకు తప్పుకున్నాడు. జానకి కనీసం అతని వైపు చూడలేదు. బస్సు మెట్ల మీద ఎక్కుతూ ఆమె తన బావకు కాల్ చేయబోయింది.
శీను అలాగే ఉండిపోయాడు. బస్సు కదులుతుంటే, జానకి తన సంతోషకరమైన భవిష్యత్తు వైపు వెళ్తోంది. శీను మాత్రం ఆ బస్టాప్ దగ్గరే ఉండిపోయాడు… తన గతాన్ని, తన ఆశను అక్కడే సమాధి చేస్తున్నట్టుగా.
శ్రావణి బస్సు కిటికీలోంచి చివరిసారి శీనుని చూసింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ‘పాపం, తను ప్రేమించిన అమ్మాయికి తన ఉనికి కూడా తెలియదు’ అన్న విషయం ఆమెకు ఆ క్షణంలో బరువుగా అనిపించింది.
ఆ తరువాత…
Swipe left/right or tap the sides to turn pages