New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love me again ❤️ – 3

Love me again ❤️ – 3

[కాలేజీ క్యాంటీన్ – కొన్ని రోజుల తర్వాత]

 

 

మధ్యాహ్నం క్లాసులు అయ్యాక, జానకి, శ్రావణి క్యాంటీన్‌లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. శ్రావణి మనసులో ఆ విషయం అలాగే తొలుస్తోంది. నిన్న మొన్న బస్టాప్‌లో శీనుని చూశాక, అతని పరిస్థితి శ్రావణిని బాగా కలచివేసింది.

 

 

శ్రావణి: “జానూ, నీతో ఒక మాట చెప్పాలి. ఆ బస్టాప్‌లో ఆ అబ్బాయి (శీను) ప్రతిరోజూ నీకోసం వస్తున్నాడు. వాడు నిన్ను చూసే చూపుల్లో ప్రేమ తప్ప వేరే ఉద్దేశ్యం లేదనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే, వాడు ఏదో పిచ్చివాడిలా తయారవుతున్నాడని నా భయం. కనీసం ఒక్క మాట… వాడితో మాట్లాడి ‘నాకు నీ మీద ఇష్టం లేదు, దయచేసి ఇక రాకు’ అని చెబితే వాడికి ఒక క్లారిటీ వస్తుంది కదా! పాపం, ఆశతో బ్రతకడం కంటే నిజాన్ని తెలుసుకోవడం మంచిది కదా!”

 

 

జానకి తన కాఫీ కప్పును టేబుల్ మీద గట్టిగా పెట్టింది. ఆమె కళ్ళలో శ్రావణి ఎప్పుడూ చూడని క్రూరత్వం, గర్వం ఒక్కసారిగా బయటపడ్డాయి. జానకి నవ్వుతూ, చాలా కటువుగా సమాధానమిచ్చింది.

 

 

జానకి: “ఎందుకు చెప్పాలి శ్రావణీ? వాడెవడు? వాడి స్థాయి ఏంటి? నాకోసం టైం వేస్ట్ చేసుకుంటూ తిరిగే వాడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? అసలు వాడికి నా హోదా తెలుసా?”

 

 

శ్రావణి: “కానీ జానూ, మనిషిగా…”

 

 

జానకి: (శ్రావణిని అడ్డుకుంటూ, మరింత కఠినంగా) “నిజం మాట్లాడుకుందాం… ఇలాంటి వాళ్ళు నాకోసం పడి చావాలి తప్ప, నేను వాడి గురించి ఆలోచించడం ఏంటి? వాడసలు నా దృష్టిలో ఒక ‘రంగ్-లెస్ ఫెలో’ (Rangeless fellow)! వాడి స్థాయికి, నా స్థాయికి అసలు సంబంధమే లేదు. అలాంటి వాడికి నా ‘నో’ కూడా చాలా ఎక్కువ. వాడి గురించి మళ్ళీ నా దగ్గర ప్రస్తావించకు.”

 

 

ఆ మాటలకు శ్రావణి ఒక్కసారిగా షాక్ అయ్యింది. జానకి ఇంత కఠినంగా, అహంకారంతో మాట్లాడుతుందని శ్రావణి అస్సలు ఊహించలేదు. శీను పట్ల జానకిలో ఉన్నది కేవలం నిర్లక్ష్యం కాదు, ఒక రకమైన ద్వేషం అని శ్రావణికి అప్పుడు అర్థమైంది.

 

 

జానకి తన ఫోన్ తీసుకుని, మళ్ళీ తన బావతో మెసేజ్‌లు చేసుకోవడంలో బిజీ అయిపోయింది. శ్రావణి మాత్రం అవాక్కై, జానకి వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెకు అర్థమైంది జానకి మనసులో శీనుకు ఎప్పటికీ చోటు దక్కదని, పైగా ఈ అవమానం శీనుకు తెలిస్తే అతను ఎలా తట్టుకుంటాడోనని శ్రావణి ఆందోళన చెందింది.

 

……

 

[బస్టాప్ – మరుసటి రోజు ఉదయం]

 

 

జానకి అన్న మాటలు శ్రావణి మనసులో గాయంలా మిగిలిపోయాయి. “వాడు నాకోసం పడి చావాలి” అన్న ఆ అహంకారపూరితమైన మాట శ్రావణిని ఒక నిర్ణయానికి వచ్చేలా చేసింది. జానకికి తెలియకుండా శీనుకి ఓదార్పునివ్వాలని, అతను ఒంటరి కాదని తెలియజేయాలని శ్రావణి నిశ్చయించుకుంది.

 

 

శీను రోజూ వచ్చి కూర్చునే ఆ పాత సిమెంటు బెంచ్ దగ్గరకు శ్రావణి కాస్త ముందుగానే వెళ్ళింది. జానకి ఇంకా రాలేదు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి, శ్రావణి తను రాసుకున్న ఒక చిన్న పేపర్ ముక్కను, ఆ బెంచ్ పక్కన ఉన్న చిన్న రంధ్రంలో పెట్టింది.

 

 

ఆ పేపర్‌పై ఇలా ఉంది: “ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించని వారి కోసం మన జీవితాన్ని వృథా చేసుకోవడం తప్పే. మీలో ఏదో గొప్ప ఆశయం ఉంది, దాన్ని గెలవడానికి ప్రయత్నించండి. మీరు ఒంటరి వారు కాదు.”

 

 

శ్రావణి కొంచెం దూరంగా ఒక స్తంభం చాటున దాక్కుని ఉంది. కొద్దిసేపటికి శీను అక్కడికి వచ్చాడు. ముఖంలో ఆ నిరాశ, కళ్ళలో ఆ నీరు అలాగే ఉన్నాయి. అతను కూర్చుని, ఏదో ఆలోచనలో బెంచ్ పక్కన ఉన్న చిన్న రంధ్రాన్ని గమనించాడు. అందులో ఏదో కాగితం కనిపించడంతో, దాన్ని తీసి చదివాడు.

 

 

ఆ కాగితం చదువుతుంటే శీను ముఖంలో ఆశ్చర్యం, కొంచెం ఆశాభావం కనిపించాయి. అతను చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. ఆ చిన్న కాగితం ముక్క అతనిలో ఏదో తెలియని ధైర్యాన్ని నింపింది. ఎవరో ఒక అపరిచిత వ్యక్తి తనకు ధైర్యం చెబుతున్నారనే భావన అతన్ని కుదుటపరిచింది.

 

 

శ్రావణికి దూరం నుంచి అతని ముఖంలో కనిపిస్తున్న మార్పు చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను నవ్వుతాడు అని తను ఆశించలేదు, కానీ కనీసం ఆ నిరాశ కాస్త తగ్గినా తన ప్రయత్నం ఫలించినట్టేనని ఆమెకు అనిపించింది.

 

 

మరుసటి రోజు నుంచి ఇది ఒక అలవాటుగా మారింది. శ్రావణి ప్రతిరోజూ ఏదో ఒక చిన్న సందేశాన్ని, ఒక్కోసారి ఒక చిన్న చాక్లెట్ బాక్స్‌ను లేదా ఒక పుస్తకాన్ని అక్కడ వదిలి వెళ్ళడం మొదలుపెట్టింది. శీను కూడా ఆ ‘అపరిచిత మిత్రుడు’ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. 

 

 

తన మనసులోని బాధను, ఆశలను తన డైరీలో రాసి, అదే బెంచ్ రంధ్రంలో పెట్టేవాడు.

శ్రావణి వాటిని రహస్యంగా చదివి, తను కూడా తన ఆలోచనలను రాసేది. శీనుకు తెలియకుండానే శ్రావణి అతని జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ రహస్య స్నేహం, అతన్ని జానకి వల్ల కలిగిన గాయం నుంచి మెల్లగా బయటకు తీసుకువస్తోంది.

 

 

…….

 

[బస్టాప్ – 3 నెలల తర్వాత]

 

 

మూడు నెలలు గడిచిపోయాయి. ఆ రహస్య ఉత్తరాలు, చిన్న చిన్న బహుమతులు శీనును కొత్త మనిషిని చేశాయి. అతను ఇప్పుడు చాలా ప్రశాంతంగా, తన కెరీర్ మీద దృష్టి పెడుతున్నాడు. శ్రావణికి అనిపించింది… శీను జానకిని పూర్తిగా మర్చిపోయాడు, తను రాసిన మాటలు అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చాయని.

 

 

ఈరోజు శ్రావణి తన మనసులోని మాటను చెప్పేయాలని నిర్ణయించుకుంది. అతను తన ‘అపరిచిత మిత్రుడి’ని కలుసుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అతనికి తెలియదు, తను రోజూ వెతుకుతున్న ఆ మిత్రుడు ఎవరో… ఈరోజు చెప్పేయాలి!

 

 

అంతలో, బస్టాప్‌లో ఎవరో వ్యక్తులు మాట్లాడుకోవడం వినిపించింది.

 

 

“రేపు జానకి పెళ్లి కదా… విజయవాడలో పెద్ద సెలబ్రేషన్ జరగబోతోంది!”

 

 

ఆ మాట వినగానే శీను కదలక లేకుండా అక్కడే నిలబడిపోయాడు. అతని కళ్ళలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. గడచిన మూడు నెలలుగా తను దాచుకున్న గాయం మళ్ళీ పచ్చిగా మారింది. చేతిలో ఉన్న పుస్తకాన్ని గట్టిగా నలిపేశాడు.

 

 

శ్రావణి దూరం నుండి వస్తూ ఈ దృశ్యాన్ని చూసింది. ఆమె గుండె ఆగిపోయినట్టయింది. శీను ముఖంలో కనిపిస్తున్న ఆ నిస్సహాయత, ఆ బాధ ఆమెను కలచివేసింది. తను చెప్పాలనుకున్న ప్రేమని, జానకి పెళ్లి వార్త ఒక్క క్షణంలో తుడిచిపెట్టేసింది.

 

 

 

శ్రావణి ధైర్యం చేసి శీను దగ్గరకు నడిచి వెళ్ళింది.

 

 

శీను కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను శ్రావణి వైపు చూడకుండా, దూరంగా చూస్తూ… “మూడు నెలలు గడిచాయి శ్రావణీ. నేను మర్చిపోయాను అనుకున్నాను. కానీ, ఆ వార్త వినగానే… మళ్ళీ అన్నీ వెనక్కి వచ్చేశాయి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటోంది, నేను ఇక్కడ అనాథలా మిగిలిపోయాను.”

 

 

శ్రావణికి భయం వేసింది. తను ఇప్పుడు తన ప్రేమను చెబితే, అది అతన్ని మరింత బాధపెడుతుందేమోనని సందేహం కలిగింది. అయినా, మౌనంగా ఉంటే అతను పూర్తిగా ఓడిపోతాడని ఆమె భావించింది.

 

 

శ్రావణి: (అతని భుజం పట్టుకుని, గంభీరంగా) “శీనూ! నువ్వు ఎవరికోసం అయితే బాధపడుతున్నావో, ఆమె నీ ఉనికిని కూడా గుర్తించలేదు. కానీ… నీ కన్నీళ్లను తుడిచిన మనిషి ఒకరున్నారు. 

 

 

నీ బాధను పంచుకున్న స్నేహితుడు ఒకరున్నారు… ఆ మిత్రుడు మరెవరో కాదు, !”

 

 

 

శ్రావణి కళ్ళలో నీళ్లతో, తన మనసుని మొత్తం అతనికి అంకితం చేస్తూ, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను శీనూ! నువ్వు నా ప్రాణం…” అని చెప్పబోతుండగా, ఒక్కసారిగా రోడ్డు మీద పెద్ద గందరగోళం.

 

 

దూరం నుండి వస్తున్న ఒక బస్సు, బ్రేకులు ఫెయిల్ అయ్యి, నియంత్రణ కోల్పోయి పిచ్చిగా దూసుకువస్తోంది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బస్సు ఆగడం లేదు. బస్టాప్ వైపుకి దూసుకువస్తున్న ఆ రాకాసి బస్సును గమనించే లోపే, అదంతా ఒక్క సెకనులో జరిగిపోయింది. శ్రావణి ఆ ప్రమాదాన్ని గమనించే స్థితిలో లేదు.

 

 

శీను ప్రమాదాన్ని క్షణాల్లో పసిగట్టాడు. బస్సు శ్రావణి వైపు దూసుకువస్తోంది! ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన శ్రావణిని కాపాడుకోవడమే తన చివరి లక్ష్యం అన్నట్టుగా, తన సర్వశక్తులూ ఒడ్డి ఆమెను గట్టిగా పక్కకు తోసేశాడు.

శ్రావణి పక్కకు పడి, తల ఏదో రాయికి తగిలి వెంటనే స్పృహ కోల్పోయింది. 

 

 

అప్పటికే ఆ బస్సు వేగం శీనుకి తగిలేలా ఉంది. శీను తన వైపు వస్తున్న మృత్యువుని చూసి, ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు, కానీ వెంటనే శ్రావణి క్షేమంగా పక్కన పడి ఉండటం చూసి తృప్తి చెందాడు.

 

 

ఆ తర్వాతి క్షణమే, ఆ బస్సు వేగంగా వచ్చి శీనుని బలంగా ఢీకొట్టింది. శీను గాలిలో ఎగిరి కింద పడ్డాడు. అతని ప్రాణం అక్కడికక్కడే ఆగిపోయింది.

 

 

ఆ బస్టాప్ అంతా రక్తసిక్తమైంది. ఆ నిశ్శబ్ద రాత్రి.. శీను మౌనానికి, శ్రావణి నిశ్శబ్దానికి వేదికైంది. జానకి కోసం బ్రతికిన శీను, తనను నిజంగా ప్రేమించిన శ్రావణిని కాపాడి, లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. మృత్యువు శీనుకు, జానకి జ్ఞాపకాల నుండి విముక్తిని, శ్రావణి ప్రేమకు శాశ్వత మౌనాన్ని మిగిల్చింది.

 

 

ఆ తరువాత.. ఏం జరిగింది…….