“సంతోషం! నేను, యశోద కలిసి పంతులుగారిని అడిగి ముహూర్తం తెలుసుకుని వస్తాం” అంటూ రమేష్ గారు లేచారు.
“యశోదా… రా, వెళ్లి ముహూర్తం తెలుసుకుని వద్దాం” అంటూ ఆమెను కూడా పిలిచారు.
యశోద గారు కూడా లేచి ఆయనతో పాటు బయటకు నడిచారు. వాళ్లిద్దరూ అలా వెళ్లిపోవడంతో హాల్లో ఉన్నవాళ్లు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఆరు మాత్రం అక్కడే ఉండకుండా, బుడ్డోడిని జాగ్రత్తగా ఎత్తుకుని మళ్లీ వేద గది వైపు నడిచింది. ఆ గదిలోకి అడుగుపెట్టగానే తనకు తెలియకుండానే మనసు భారంగా మారింది. గదిలో ఉన్న ప్రతి వస్తువులోనూ వేద జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి.
బుడ్డోడిని తీసుకుని మంచం మీద కూర్చుని, వాడిని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. వాడు కూడా హాయిగా ఆమె ఒడిలో ఒదిగిపోయాడు.
ఆరు వచ్చిన దాదాపు పది నిమిషాల తర్వాత యష్ కూడా వేద గదిలోకి వచ్చాడు.