అనంత లోకాలు – 5
కార్తీక్ చూపు రాజు కుడి చేతి మణికట్టు మీదే ఆగిపోయింది.
ఆ చిన్న నక్షత్రం గుర్తును చూస్తున్న కొద్దీ అతని మనసులో ఏదో తెలియని భయం మొదలైంది.
‘ఈ గుర్తు… ఎక్కడో చూశాను. అవును! అనంత లోకాలు పుస్తకం మొదటి పేజీలో కూడా ఇదే గుర్తు ఉంది. అసలు ఈ గుర్తుకు, రాజుకు సంబంధం ఏమిటి?
రాజు చేతి మీద ఈ గుర్తు ఎలా వచ్చింది? అతనికి దీని గురించి తెలుసా? లేక తెలియనట్టుగా నటిస్తున్నాడా?
ముఖ్యంగా… రాజును నమ్మకు అని ఆ కాగితంలో ఎందుకు రాశారు? రాజుకు కూడా గతం గుర్తుందని దాని అర్థమా?
ముందు ఈ గుర్తు గురించి తెలుసుకోవాలి. రాజును అడగాలా? అడిగితే నిజం చెబుతాడా?
కానీ అంతకంటే ముందు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.
1998లో అసలు ఏం జరిగింది?
ఆ రిజిస్టర్‌లో నా పేరు ఎలా వచ్చింది? ఆ సంతకం అచ్చం నాలాగే ఉంది. నా వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు. కానీ ఆ ఫొటోలో నాలాగే కనిపిస్తున్న వ్యక్తి దాదాపు నలభై ఏళ్ల వాడిలా ఉన్నాడు.
అసలు అతను నేనేనా? లేక నాలాగే కనిపించే ఇంకొక వ్యక్తి ఉన్నాడా?
మేఘన ఆ పుస్తకాన్ని ఎందుకు తిరిగి ఇచ్చింది? ఆ సమయంలో ఆమె ఎవరు? మేఘన నిజంగా ఉన్న అమ్మాయేనా? లేక నా మనసు సృష్టించుకున్న కల్పనా?
అలా అయితే ఆమెతో నేను మాట్లాడినట్లు ఎందుకు అనిపిస్తోంది? ఆమె పంపిన మెసేజ్‌లు ఎలా వచ్చాయి? ఆమె లేకుండా నా జీవితంలో ఒక్క సంఘటన కూడా జరగలేదని ఆ పుస్తకంలో ఎందుకు రాసి ఉంది?
అసలు మేఘనకు నాకు ఉన్న సంబంధం ఏమిటి?
మరి అనన్య ఎవరు?
గతంలో అనన్యకు ఏం జరిగింది? దానికి నేనే కారణమా? మేఘన కూడా కారణమని ఆ మెసేజ్‌లో ఎందుకు చెప్పారు? అనన్య నాతో ఏదైనా చెప్పాలనుకుంటోందా? లేక నా వెనుక ఇంకెవరైనా ఈ సంఘటనలన్నీ నడిపిస్తున్నారా?
సీసీటీవీలో కనిపించినప్పుడు నాకు ఏమీ గుర్తులేదు. కానీ ఆ వీడియోలో వినిపించిన గొంతు మాత్రం స్పష్టంగా ఉంది.
‘కార్తీక్… నన్ను మర్చిపోకు.’
ఆ గొంతు అనన్యదా? మేఘనదా? ఆ ఇద్దరిలో ఎవరు నాతో మాట్లాడుతున్నారు?
ఇప్పుడు నేను ముందుగా ఎవరిని వెతకాలి? మేఘన గురించా? అనన్య గురించా? లేక 1998లో జరిగిన వాస్తవం గురించి తెలుసుకోవాలా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? 1998లో నిజంగా ఏం జరిగిందో తెలిసిన వ్యక్తి ఎవరు?
కానీ ఇప్పుడే నాకు ఒక విషయం తెలుసుకోవాలి.
రాజు చేతి మీద ఉన్న ఈ నక్షత్రం గుర్తు వెనుక రహస్యం ఏమిటి?
రాజు… నువ్వు నిజంగా నా స్నేహితుడివేనా? లేక నాకు తెలియని గతంలో నువ్వు కూడా భాగమా?
కార్తీక్ చూపు ఇంకా రాజు చేతి మీదే ఉంది.
అతని మనసులో ఒక్కటే ఆలోచన…
‘ముందు రాజు చేతి మీద ఉన్న ఈ గుర్తు రహస్యం తెలుసుకోవాలి.’
కార్తీక్ చూపు రాజు కుడిచేతి మణికట్టు మీద ఉన్న నక్షత్రం గుర్తు దగ్గరే ఆగిపోయింది.
కార్తీక్:
రాజు… నీ చేతి మీద ఈ నక్షత్రం గుర్తు ఎక్కడిది రా?
రాజు తన చేతిని చూసుకుని నవ్వాడు.
రాజు:
ఏంట్రా? మళ్లీ మొదలుపెట్టావా?
కార్తీక్:
నిజం చెప్పరా… ఈ గుర్తు నీకు ఎలా వచ్చింది?
రాజు:
అరేయ్! ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ రా? నువ్వే కదరా నాకు వేయించింది!
కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు.
కార్తీక్:
నేనా? ఎప్పుడు?
రాజు:
అదేంట్రా! అంతా మర్చిపోయావా? ఆరోజు నేను ఎంత మొత్తుకున్నానో తెలుసా? వద్దురా… వద్దురా… నాకు టాటూ వద్దురా అని! అయినా నువ్వు వినకుండా నన్ను తీసుకెళ్లి వేయించావు.
కార్తీక్:
నేను నీకు టాటూ వేయించానా?
రాజు:
అవును రా బాబూ! పైగా నువ్వే ఒక పేపర్ మీద ఈ నక్షత్రం బొమ్మ గీసి, ఇదే గుర్తు వేయాలని టాటూ వేసే అతనికి ఇచ్చావు. నేను వద్దన్నా వినలేదు. ఇప్పుడు మళ్లీ ఏదో కొత్తగా అడుగుతున్నావ్!
కార్తీక్:
నేను నీకు ఈ గుర్తు ఎందుకు వేయించాలి?
రాజు:
అది నాకేం తెలుసురా! నీకు నచ్చింది, నాకు తగిలింది. నా చేతి మీద టాటూ… నీకు మాత్రం జ్ఞాపకం కూడా లేదు. బాగుంది రా నీ న్యాయం!
రాజు తన చేతిని చూపిస్తూ నవ్వాడు.
రాజు:
పోనీ, ఇప్పుడు ఈ టాటూ తీసేయడానికి డబ్బులు ఇస్తావా? కనీసం ఆ పుణ్యమైన పని అయినా చెయ్యి!
రాజు నవ్వుతున్నా కార్తీక్ మాత్రం ఆ గుర్తునే చూస్తున్నాడు.
నిజంగానే నేను రాజుకు ఈ గుర్తు వేయించానా? ఆ పేపర్ మీద బొమ్మ గీసింది నేనేనా? మరి ఆ పుస్తకంలో మొదటి పేజీ మీద కూడా ఇదే గుర్తు ఎందుకుంది?
కార్తీక్ ఆలోచనలో ఉండగానే రాజు అతని భుజం తట్టాడు.
రాజు:
ఏంట్రా? నా టాటూని చూస్తూ ఏదో పెద్ద పరిశోధన చేస్తున్నట్టు ఉన్నావ్!
కార్తీక్:
సరే… మేఘన గురించి నీకు ఏమైనా తెలుసా?
రాజు ముఖంలో నవ్వు అలాగే ఉంది. కానీ ఈసారి కొంచెం విసుగ్గా చూశాడు.
రాజు:
మళ్లీ ఆ పేరేనా రా?
కార్తీక్:
అవును. మేఘన… మన కాలేజీలో చదివేదట కదా?
రాజు:
అరేయ్ ఎన్నిసార్లు చెప్పాలి రా? మేఘన అనే పేరున్న అమ్మాయి మన కాలేజీలో లేదు. ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆ అమ్మాయిని చూడలేదు. నువ్వు కూడా ఈరోజే పదేపదే ఆ పేరు అడుగుతున్నావ్. ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా ఆ పేరు నా దగ్గర ప్రస్తావించావా?
కార్తీక్:
అంటే… నీకు అసలు మేఘన తెలియదా?
రాజు:
తెలియదురా బాబూ! ఇప్పుడు ఆ పేరుని వదిలేసి ఇంకేదైనా మాట్లాడు.
కార్తీక్ కొద్దిసేపు ఆగి మరో ప్రశ్న అడిగాడు.
కార్తీక్:
మరి అనన్య తెలుసా నీకు?
రాజు వెంటనే తల ఊపాడు.
రాజు:
అనన్యా? తెలుసు రా! మన పాత టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా!
కార్తీక్ ఒక్కసారిగా రాజు వైపు చూశాడు.
కార్తీక్:
టెన్త్ క్లాస్ ఫ్రెండా?
రాజు:
అవును రా! అప్పట్లో మనం ఇద్దరం కలిసి దాన్ని ఎంత ఏడిపించేవాళ్లమో గుర్తుందా? పాపం, మనల్ని చూస్తేనే భయపడేది. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. మన గ్రూప్ మెసేజ్‌లో కూడా ఈ మధ్య కనిపించడం లేదు.
కార్తీక్:
అది కాదురా… నేను అడుగుతున్నది వేరే విషయం.
రాజు:
మరి ఏమిట్రా ఆ వేరే విషయం? ఉదయం నుంచి చూస్తున్నా… ముందు మేఘన అంటావ్, తర్వాత అనన్య అంటావ్, మధ్యలో నా టాటూ గురించి అడుగుతావ్. అసలు నీకేమైంది రా?
కార్తీక్:
రాజు… నాకు కొన్ని విషయాలు గుర్తుకు రావడం లేదు. కానీ అవి నిజంగా జరిగినట్టే అనిపిస్తున్నాయి.
రాజు:
అయితే ముందు నువ్వు ఏం తిన్నావో గుర్తు తెచ్చుకో! ఉదయం నుంచి ఏదైనా తిన్నావా లేదా?
కార్తీక్ మాట్లాడలేదు.
రాజు:
చూడు రా… ఈరోజు నీతో మాట్లాడాలంటే నా వల్ల కావడం లేదు. ఈరోజు మందు కొట్టాల్సిందే!
కార్తీక్:
ఏంట్రా? ఇప్పుడు కూడా మందేనా?
రాజు:
అవునురా! లేకపోతే నీ ఈ పిచ్చి ప్రశ్నలతో ఇక్కడే నా ప్రాణం తీస్తావ్. కనీసం రెండు పెగ్గులు వేస్తే నీ ప్రశ్నలైనా తగ్గుతాయేమో చూద్దాం!
రాజు నవ్వుతూ కార్తీక్ భుజం మీద చేయి వేసి నడవసాగాడు.
కానీ కార్తీక్ మనసులో మాత్రం ప్రశ్నలు ఆగలేదు.
రాజుకు అనన్య తెలుసు… అది మన టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అని చెబుతున్నాడు. మరి నాకు గుర్తున్న అనన్య ఎవరు?
మేఘనను మాత్రం రాజు ఎప్పుడూ చూడలేదంటున్నాడు. కానీ నేను ఆమెతో మాట్లాడాను. ఆమెతో కలిసి కాంటీన్‌కు వెళ్లాను. మరి అదంతా ఏంటి?
ఇక ఈ నక్షత్రం గుర్తు… రాజు చెప్పినట్టు నేనే వేయించానా? అయితే ఆ గుర్తు ఉన్న పుస్తకం నాదగ్గరకు ఎలా వచ్చింది?
రాజు నిజం చెబుతున్నాడా? లేక అతనికి కూడా ఏదో గుర్తుండి నాతో దాస్తున్నాడా?
కార్తీక్ నడుస్తూనే రాజు చేతి వైపు మరోసారి చూశాడు.
రాజు మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
కానీ కార్తీక్ మనసులో ఒకే ఒక్క ప్రశ్న బలంగా మిగిలిపోయింది…
1998లో ఏం జరిగింది? ఆ గతానికి రాజుకు సంబంధం ఏమిటి?
Swipe left/right or tap the sides to turn pages