New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 19

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 19

చింతపల్లె అడవిలో స్మగ్లర్ కటారి అరెస్టుతో భార్గవ్ రామ్, రాజేంద్రల ఆఖరి వ్యూహం కూడా ముక్కలైపోయింది. తులసి పిల్లలను కిడ్నాప్ చేయించిన కేసులో దొరికిన పక్కా ఆధారాలతో  బినామీ కంపెనీల రహస్యాలు, విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇప్పుడు తులసి చేతిలో ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  మరియు సిబిఐ అధికారుల సహాయంతో పక్కా చార్జ్‌షీట్‌ను తులసి సిద్ధం చేసింది. రఘును క్వారీలో దారుణంగా చంపించిన కేసుతో పాటు, ఒక మహిళా అధికారిపై ప్రాణాపాయ దాడులు చేయించినందుకు, దేశద్రోహానికి పాల్పడినందుకు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.

 

ఆ రోజు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జనసందోహంతో నిండిపోయింది. మీడియా ప్రతినిధులు, సామాన్య ప్రజలు కోర్టు ప్రాంగణం వెలుపల భారీగా గుమిగూడారు. బోనులో మాజీ హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్, క్వారీ మాఫియా డాన్ రాజేంద్ర నిలబడి ఉన్నారు. ఒకప్పుడు అధికార బలంతో, డబ్బు మదంతో ఊగిన వారి ముఖాల్లో ఇప్పుడు చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. తమను కాపాడటానికి భార్గవ్ రామ్ దేశంలోనే పేరుగాంచిన సీనియర్ లాయర్లను రంగంలోకి దించినప్పటికీ, తులసి సమర్పించిన సాక్ష్యాల ముందు వారి వాదనలు ఒక్కొక్కటిగా వీగిపోయాయి.

 

తులసి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్  కోర్టు లో, పిల్లల కిడ్నాప్ గురించి చింతపల్లె అడవిలో దొరికిన ఆడియో రికార్డింగులను జడ్జి గారి ముందు ఉంచారు. జైల్లో ఉండి కూడా వీరు దేశ భద్రతకు విఘాతం కలిగిస్తూ, అక్రమ మైనింగ్ సామ్రాజ్యాన్ని నడిపారని, సాక్షులను దారుణంగా చంపించారని లాయర్ బలంగా వాదించారు. కోర్టు గదిలో ఒక మూల ఆనందరావు మాస్టారు చేతులు పట్టుకుని అక్షర, వివేక్ నిలబడి ఉన్నారు. తులసి కోర్టు ఫ్రంట్ బెంచ్‌లో కూర్చుని, జడ్జి గారి వైపు తీక్షణంగా చూస్తోంది. ఆమె కళ్లల్లో భయం లేదు.

 

సుదీర్ఘ వాదనల అనంతరం, మధ్యాహ్నం మూడు గంటలకు గౌరవనీయ న్యాయమూర్తి తన తీర్పును చదవడం ప్రారంభించారు. కోర్టు హాల్‌ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది.

“ఈ కేసులో లభించిన శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం… ముద్దాయిలైన భార్గవ్ రామ్ మరియు రాజేంద్రలు చేసిన నేరాలు క్షమించరానివి. అధికార దుర్వినియోగానికి పాల్పడి, జైలు నుండి కూడా ఒక మహిళా కలెక్టర్ కుటుంబాన్ని అంతం చేయడానికి కుట్ర పన్నారు. సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని నిరూపితమైంది. ఇది ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసుగా కోర్టు పరిగణిస్తోంది. కావున, భారత శిక్షాస్మృతి సెక్షన్ కింద ముద్దాయిలు ఇద్దరికీ ముందు కోర్టులో విధించిన శిక్ష రద్దు చేసి ఇప్పుడు’ఉరిశిక్ష’  విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తోంది. వారి ప్రాణాలు పోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తున్నాం” అంటూ జడ్జి గారు తీర్పు కాగితాలపై సంతకం చేసి, పెన్ నిబ్బును విరిచేశారు.

 

ఆ తీర్పు వినగానే కోర్టు హాల్‌లోనే కాకుండా బయట ఉన్న వేలాది మంది ప్రజల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. “ధర్మం గెలిచింది… కలెక్టర్ తులసి గారు వర్ధిల్లాలి” అంటూ నినాదాలు మిన్నంటాయి. బోనులో ఉన్న భార్గవ్ రామ్, రాజేంద్రల కాళ్లు వణకసాగాయి. వారి కళ్ల ముందే చీకటి కమ్మింది. పోలీసులు వారిద్దరికీ బేడీలు వేసి కఠిన కారాగారానికి తరలించారు.

తీర్పు వచ్చిన తర్వాత తులసి నెమ్మదిగా కోర్టు వెలుపలికి వచ్చింది. ఆమె కళ్ల నుండి ఆనందబాష్పాలు రాలాయి. ఆనందరావు మాస్టారు తులసి తలపై చేయి పెట్టి, “తులసీ… ఈ రోజు రఘు ఆత్మకు నిజమైన శాంతి చేకూరింది. నువ్వు అనుకున్నది సాధించావు” అన్నారు గర్వంగా. అక్షర, వివేక్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నారు.

కోర్టు హాల్ నుండి బయటకు వచ్చిన తులసి ని చూసి మీడియా కెమెరాలన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యాయి. ప్రతీకారం కోసం కాకుండా, కేవలం న్యాయం కోసం ఆమె చేసిన ఈ పోరాటం ఈరోజు ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఒక సామాన్య గృహిణి కలెక్టర్‌ గా మారడం  దగ్గర నుండి, తన భర్తను చంపిన క్రూరమైన శత్రువులను చట్టం ముందు మోకరిల్లించే వరకు ఆమె ప్రయాణం ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue