పెళ్లిచూపులు-83
“మరో గంటలో మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం రా, ఇంతకుముందు చెప్పాను కదా నీకు, మా ఫ్రెండ్ కూతురు నిన్ను ఫోటోలో చూసింది ఇష్టపడింది పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అని నీకు చెప్పాను కదా” అని అన్నది వరూధిని.
“వాట్ నాకు ఇప్పుడు పెళ్లి చూపులా” అని వైష్ణవ్ ఒక్కసారిగా గట్టిగా నోరు తెరిచేసాడు. విజయేంద్ర కూడా ఇప్పటివరకు ఆ విషయం తెలియక పోవడంతో అప్పటివరకు రిలాక్స్డ్ గా కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన పేపర్ వదిలేసి లేచి నిలబడ్డారు.
“అదేంట్రా అంతా ఆశ్చర్యంగా అడుగుతున్నావ్ నీకు పెళ్లి వయసు వచ్చింది ఇంతకు ముందు మీ నాన్న నువ్వు వద్దు అంటున్నా పెళ్లిచూపులుకు తీసుకొని వెళితే ఓకే చేసావు కదా, అలానే ఇది కూడా, కాకపోతే అక్కడ నువ్వు పెళ్లి వద్దు అన్నావ్, నేను నీ మాటకి ఓకే చెప్పాను కానీ ఇక్కడ అలా కుదరదు నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. మన స్టేటస్ కి తగ్గ అమ్మాయి నువ్వు తనని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేస్తావ్” అని చెప్పింది వరూధిని.
“ఏం మాట్లాడుతున్నావ్ వరుధిని ఇప్పుడు వీడికి పెళ్లి చూపులు ఏంటి..? అయినా ఆ అమ్మాయి తోనే పెళ్లి ఫిక్స్ అని ఎలా చెప్తున్నావ్ వాడికి నచ్చాలి కదా” అని అన్నారు విజయేంద్ర.
“వాడికి నచ్చేదేంటండి వాడికి మంచేదో చెడేదో అన్ని చూసుకోవాల్సిందే మనమే కదా, ఆ అమ్మాయి కూడా కచ్చితంగా నచ్చుతుంది నేను ఆల్రెడీ చెప్పేశాను మా అబ్బాయి వచ్చి చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు మనం వెంటనే ముహూర్తాలు పెట్టించేసుకుందాం. ఈ పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీ అని, వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. మీరు త్వరగా రెడీ అయితే బయలుదేరుదాం” అని అన్నది వరూధిని…