పద్మ వాళ్ళకి దగ్గర బంధువులకి విషయం చేరవేశారు అక్కడ ఉన్నవాళ్లు.. వచ్చేవాళ్ళు అందరూ గబగబా రాత్రికి వచ్చి చూస్తూ ఉన్నారు మళ్ళీ చివరిసారి ఆ తర్వాత సురేష్ ని చూడలేము అన్నట్టుగా.
వచ్చిన ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు ఫోన్లు చేసి మరి మాట్లాడుతూ ఉన్నారు.. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఒకటే మాట..’ఎప్పుడు ఎవరిని నొప్పించలేదు,ఎవరిని బాధ పెట్టలేదు,ఎవరిని మోసం చేయలేదు…వీలైతే సాయం చేశాడు లేదా వాళ్ళకి తోడుగా నిలబడ్డాడు..అంతేకానీ..! ఎప్పుడూ ఎవరికీ కీడు చేయలేదు అలాంటిది ఇంత తొందరగా వెళ్ళిపోవడమేంటి..’ అని.
రోజా ఆ రాత్రి మొత్తం సురేష్ తలని తన ఒడిలోనే పెట్టుకుంది.. సురేష్ తల దగ్గర దీపం పెట్టాలి అని చాలామంది అనుకున్నారు..కానీ..! రోజని అక్కడ నుంచి జరగమని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు.. ఎందుకంటే..! ఒక బిడ్డ దూరమైతే తల్లి ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆ క్షణం రోజా.