మరుసటి రోజు ఉదయం నుంచే రామయ్య ఇంట్లో సందడి మొదలైంది. రాజేష్ వాళ్ల కుటుంబం పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకోవడానికి వస్తున్నారని లలితమ్మ ఇంటిని శుభ్రం చేయిస్తూ, వంటగదిలో పనులు చూసుకుంటోంది.
హారిక మాత్రం తన పనులు చేసుకుంటూనే మనసులో ఏదో ఆలోచిస్తోంది. నిన్న రాజేష్ తనతో మాట్లాడిన తీరు పదేపదే గుర్తుకొస్తోంది. తన చదువు గురించి అడగడం, పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చని చెప్పడం ఆమెకు కొంత ధైర్యాన్నిచ్చాయి.
ఇంతలో రామయ్య హారిక దగ్గరకు వచ్చాడు.
హారికా, నిన్న రాజేష్‌తో మాట్లాడిన తర్వాత నీకు ఏమైనా సందేహాలున్నాయా? పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకు. నీకు నిజంగా ఇష్టమైతేనే ముందుకు వెళ్దాం.
మామయ్యా, నాకు ఆయనతో మాట్లాడినప్పుడు బాగానే అనిపించింది. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నా చదువు గురించి కూడా ఆలోచించారు. నాకు ఈ సంబంధం ఇష్టమే.