Episode 05: స్నేహమంటే!?
గ్లాస్ కిందపడిన శబ్ధం వినిపించగానే ముగ్గురు వెనక్కి తిరిగి చూసారు. గుమ్మానికి అనుకుని నిలబడ్డాడు బాలా. అతను అంతా విన్నాడేమో అని భయంగా చూస్తున్నారు. వాళ్లు అనుకున్నట్లు బాలా మొహంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు.
బాలా వాలకం చూసి, “ఏమైంది బాలా! నిద్ర పోలేదా?” అని అడిగాడు కోటేష్.
“లేదు, నాన్న! నాకు నిద్రలో కూడా నితీష్ గుర్తుకు వస్తున్నాడు. నన్ను కాపాడబోయి వాడు కింద పడిపోయాడు. వాడిని చూస్తే కానీ నేను నిద్ర పోలేను” అని మారం చేస్తూ అన్నాడు.
ముకుందం నవ్వుతూ, “చూడు బాలా! నితీష్ కి ఏమి అవ్వలేదని ముందే చెప్పాను కదా! అయినా ఇంకో వారం రోజుల్లో నీ పరీక్షలు మొదలవ్వబోతున్నాయి. నీ లక్ష్యం మరిచిపోయావా? ఇలా నువ్వు మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే ఎలా?” అని అడిగాడు.
బాలా ఆలోచనలు ఎంత తొందరగా ఈ సంఘటన నుండి తప్పిస్తే అంతా మంచింది అనుకున్నాడు ముకుందం. అందుకు తగ్గట్లే బాలా ఆలోచనలు డైవర్ట్ చేయాలని చూసాడు.