“రాబర్ట్… ఈ వెధవకి అన్నంలో ఉప్పు, కారం ఎక్కువగా ఉన్న నీళ్లు కలిపి తినడానికి ఇవ్వు. తినకపోతే నీకు తెలుసు కదా… నోట్లో కుక్కి కుక్కి తినిపించాలి. ఈ మొత్తం బాక్స్ ఖాళీ అవ్వాలి,” అని పెద్ద బాక్స్ చూపించి చెప్పిన తారక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తన బాస్ మాటలకు సరే అన్నట్టుగా తల ఊపిన రాబర్ట్, కారంగా ఉన్న అన్నాన్ని విక్టర్‌కి తినడానికి ఇచ్చాడు.
ఇక కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటి వైపు బయలుదేరిన తారక్ చాలా సంతోషంగా ఉన్నాడు.
తన ఏరియాలోకి రాగానే, ఆ రాత్రి సమయంలో కూడా పూలు అమ్ముకుంటూ కూర్చున్న ఒక అమ్మాయి, తారక్ కారు కనిపించగానే పరుగెత్తుకుంటూ వచ్చింది.
తారక్ కారు ఆపి, కారు అద్దం దించి, “ఏంటి?” అన్నట్టుగా కళ్లతోనే అడిగాడు.
“అన్నా… అన్నా… పూలు తీసుకోండి అన్నా. చివరగా కొద్దిగా పూలే ఉన్నాయి. నాలుగు గులాబీ పూలతో పాటు మల్లెపూలు కూడా ఉన్నాయి. ఇంట్లో మీ భార్యకు ఇవ్వండి… సంతోషిస్తారు.
మీరు తీసుకుంటే నేను కూడా చదువుకోవడానికి ఇంటికి వెళ్లొచ్చు. తీసుకోండి అన్నా,” అని ఆ అమ్మాయి అడిగింది.
“ఎందుకు? మీ ఇంట్లో మీ నాన్న, అమ్మ ఎవరూ లేరా? నువ్వెందుకు ఈ రాత్రి ఇలా పని చేయడానికి వస్తున్నావు? ఇలా రాత్రి సమయంలో బయటకు రావడం తప్పు,” అని చెప్పిన తారక్, కారు దిగి తన జేబులో ఉన్న రెండు వేల రూపాయల నాలుగు నోట్లు ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు.
ఆ తర్వాత గులాబీ పూలు, మల్లెపూలు తీసుకుని వాటినే చూస్తూ అక్కడే నిలబడ్డాడు.
“మా ఇంట్లో నాన్న లేరు అన్నా. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఇంతకుముందు ఆమే పని చేసేది. ఇప్పుడు ఒకటి రెండు నెలల నుంచి నేనే చేస్తున్నాను. నాకు భయం లేదు అన్నా.
అదిగో… పక్కనే కనిపిస్తుందిగా ఇల్లు, అదే మా ఇల్లు.