Oka bathuku – 2
ఒక బతుకు
మట్టిలో మిగిలిన జీవితాలు
రెండో ఎపిసోడ్ – చదువా… పనియా?
2026 – ప్రస్తుతం
చింటూ: నాయనమ్మా…
నాయనమ్మ: ఏందిరా బిడ్డా?
చింటూ: నిన్న మా తాత గురించి చెప్తూ ఆపేశావు కదా. తర్వాత ఏమైంది?
నాయనమ్మ: ఏం చెప్పాలిరా… అప్పట్లో మా బతుకులు అలా ఉండేవి. మీ తాత ఎంత కష్టపడినా ఇంట్లో పరిస్థితులు మాత్రం మారేవి కావు.
చింటూ: మరి మా నాన్న, అనురాధ అత్తయ్య ఏం చేసేవాళ్లు?
నాయనమ్మ: మీ నాన్న వెంకట్, మీ అత్త అనురాధ ఇద్దరూ ఊర్లోని ప్రభుత్వ బడికి వెళ్లేవాళ్లు.
చింటూ: వాళ్లు బాగా చదువుకునేవారా?
నాయనమ్మ: అనురాధకు చదువంటే చాలా ఇష్టం రా. మీ నాన్న కూడా బాగానే చదివేవాడు. కానీ మా ఇంటి పరిస్థితులు వాళ్ల చదువుకు అడ్డొచ్చేవి.
చింటూ: ఎందుకు నాయనమ్మా?
నాయనమ్మ: చెప్తాను విను.
1990 – పల్లెటూరు
తెల్లవారుజామున పద్మ ఇంటి ముందు చీపురుతో ఊడుస్తోంది. ఇంట్లో అనురాధ, వెంకట్ స్కూలుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
అనురాధ: అమ్మా… నా పుస్తకాలు ఎక్కడ పెట్టావు?
పద్మ: అక్కడ పెట్టానమ్మా. సంచిలో చూసుకో.
వెంకట్: అమ్మా… నా పలక కనిపిస్తలేదు.
పద్మ: నిన్న ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటది. కాసేపు వెతుకు.
వెంకట్: అక్కా… నా పలక ఎక్కడైనా చూశావా?
అనురాధ: నీ పుస్తకాల కింద చూడు.
వెంకట్: దొరికింది అక్కా!
పద్మ: ఇద్దరూ త్వరగా వెళ్లండి. బడికి ఆలస్యమైతది.
అనురాధ: అమ్మా… మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా?
పద్మ: ఏం వద్దమ్మా. మీరు బాగా చదువుకోండి చాలు.
ఇద్దరూ పుస్తకాల సంచులు వేసుకుని బడికి బయలుదేరారు.
మధ్యాహ్నం – పొలం దగ్గర
రాజయ్య పొలంలో పని కోసం ఎదురుచూస్తున్నాడు.
రాజయ్య: అన్నా… ఈరోజు ఏమైనా పని ఉందా?
పొలం యజమాని: ఈరోజు లేదు రాజయ్యా. రేపు రా.
రాజయ్య: నిన్న కూడా రేపు రమ్మన్నావు అన్నా.
యజమాని: ఏం చేయమంటావు? పొలంలో పని లేదు. పని ఉన్నప్పుడు పిలుస్తా.
రాజయ్య: సరే అన్నా.
రాజయ్య అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
అప్పటికే మధ్యాహ్నం కావస్తోంది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. అయినా ఇంటికి వెళ్లకుండా మరో పొలం దగ్గర పని కోసం అడిగాడు.
అక్కడ కూడా పని దొరకలేదు.
మధ్యాహ్నం – ఇంట్లో
పద్మ వంట చేస్తోంది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతో అన్నం వండింది.
అనురాధ, వెంకట్ బడి నుంచి వచ్చారు.
వెంకట్: అమ్మా… ఆకలేస్తుంది.
పద్మ: రండి నాన్నా. అన్నం పెడతాను.
అనురాధ: అమ్మా… నాన్న ఇంకా రాలేదా?
పద్మ: ఇంకా రాలేదమ్మా. పని దగ్గరే ఉండుంటాడు.
అనురాధ: నాన్నకు కూడా అన్నం ఉంచావా?
పద్మ: ఉంచానమ్మా. మీరు తినండి.
వెంకట్: అమ్మా… నాన్న ఎప్పుడు వస్తాడు?
పద్మ: వస్తాడురా. ముందు నువ్వు తిను.
సాయంత్రం
రాజయ్య ఇంటికి వచ్చాడు.
పద్మ: ఏవండీ… ఈరోజు పని దొరికిందా?
రాజయ్య: లేదు పద్మా. ఎక్కడ అడిగినా పని లేదంటున్నారు.
పద్మ: మరి రేపైనా దొరుకుతుందంటారా?
రాజయ్య: ఏమో తెలీదు. వానలు పడితేనే మళ్లీ పనులు పెరుగుతాయి.
పద్మ: ఇంట్లో బియ్యం కూడా కొంచెమే ఉన్నాయి.
రాజయ్య: ఏం చేద్దాం పద్మా? చేతిలో డబ్బులు లేవు.
పద్మ: రోజూ ఇలాగే ఉంటే ఎట్లా బతకాలి?
రాజయ్య: నాకు మాత్రం బతకాలని లేదా? ఉదయం నుంచి పని కోసం తిరుగుతూనే ఉన్నాను.
పద్మ: మీ కష్టం నాకు తెలియదా ఏంది? కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. వాళ్ల కడుపు కూడా చూడాలి కదా.
రాజయ్య ఏమీ మాట్లాడకుండా బయట కూర్చున్నాడు.
కొద్దిసేపటి తర్వాత
వెంకట్: నాయనా…
రాజయ్య: ఏందిరా?
వెంకట్: రేపు మా బడికి రావాలని మాస్టారు చెప్పారు.
రాజయ్య: ఎందుకురా?
వెంకట్: అందరి తల్లిదండ్రులతో మాట్లాడతారంట.
రాజయ్య: సరే. పని ఉంటే వస్తాను.
అనురాధ కూడా అక్కడికి వచ్చింది.
అనురాధ: నాయనా… మాస్టారు నన్ను బాగా చదువుకుంటున్నావని చెప్పారు.
రాజయ్య: మంచిదమ్మా. బాగా చదువుకో.
అనురాధ: నేను పెద్దయ్యాక ఉద్యోగం చేస్తాను నాయనా. అప్పుడు నీకు, అమ్మకు కష్టాలు లేకుండా చూసుకుంటాను.
రాజయ్య కూతురి మాటలు విని చిన్నగా నవ్వాడు.
రాజయ్య: సరే తల్లీ. నువ్వు బాగా చదువుకుంటే అదే చాలు.
మరుసటి రోజు – పొలం దగ్గర
రాజయ్యతో పాటు కొంతమంది కూలీలు చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఒక కూలీ: రాజయ్యా… నీ పిల్లలు ఇద్దరూ బడికి పోతున్నారట కదా?
రాజయ్య: అవునురా.
మరో కూలీ: ఇద్దరినీ చదివించాలంటే చాలా ఖర్చు అవుతది కదా?
రాజయ్య: ప్రభుత్వ బడే కదా. అయినా పుస్తకాలు, బట్టలు, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా.
కూలీ: మా పిల్లలైతే పొలం పనికి వస్తున్నారు. రోజుకు నాలుగు డబ్బులు వస్తున్నాయి. ఇంటికి కొంత సాయమవుతోంది.
రాజయ్య: పిల్లల్ని బడికి పంపించాలనే ఉంది నాకు.
కూలీ: నీ ఇష్టం రాజయ్యా. కానీ మనలాంటి వాళ్లకు పిల్లలు కూడా సంపాదిస్తేనే ఇల్లు గడుస్తది.
ఆ మాటలు రాజయ్య మనసులో ఉండిపోయాయి.
సాయంత్రం – ఇంట్లో
అనురాధ పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. వెంకట్ బయట ఆడుకుంటున్నాడు.
పద్మ వంట చేస్తోంది.
రాజయ్య ఇంటికి వచ్చాడు.
పద్మ: ఏవండీ… ఈరోజైనా పని దొరికిందా?
రాజయ్య: దొరికింది. కానీ సగం రోజే పని.
పద్మ: సరేలే. ఏదో కొంత డబ్బులొస్తాయి.
రాజయ్య: పద్మా… ఒక మాట చెప్పాలి.
పద్మ: ఏంటండి?
రాజయ్య: పిల్లలిద్దరినీ రోజూ బడికి పంపడం కంటే, కొన్నిరోజులు మనతో పాటు పనికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది?
పద్మ: అదేంటండి? పిల్లల్ని పనికి పంపిస్తారా?
రాజయ్య: పంపించాలని కాదు పద్మా. మన పరిస్థితి చూడు. మనిద్దరం ఎంత కష్టపడినా సరిపోవడం లేదు. వాళ్లు కూడా కొంచెం సాయం చేస్తే ఇంటికి నాలుగు పైసలు వస్తాయి.
పద్మ: పిల్లలు చదువుకుంటేనే కదా వాళ్ల బతుకులు మారేది.
రాజయ్య: నాకు మాత్రం వాళ్లు చదువుకోకూడదని ఉందా? కానీ మన ఇంట్లో పరిస్థితులు కూడా చూడాలి కదా.
పద్మ: కష్టం వచ్చినప్పుడల్లా పిల్లల చదువు ఆపేస్తే వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది?
రాజయ్య: ఏం చేయమంటావు? పని దొరకని రోజుల్లో ఇంట్లోకి డబ్బులు రావడం లేదు.
పద్మ: ఏదో ఒక దారి చూసుకుందాం. పిల్లల్ని మాత్రం బడి మాన్పించకండి.
రాజయ్య: సరే. ఇప్పుడేం మాట్లాడకు.
వాళ్లిద్దరి మాటలు అనురాధ వింటోంది.
ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని నెమ్మదిగా మూసి పక్కన పెట్టింది.
రాత్రి
అనురాధ: అమ్మా…
పద్మ: ఏందమ్మా?
అనురాధ: నాన్నకు మన ఇంటి పరిస్థితుల వల్ల చాలా బాధగా ఉందా?
పద్మ: ఎందుకమ్మా అలా అడుగుతున్నావు?
అనురాధ: నేను కూడా పనికి పోతే నాన్నకు కొంచెం సాయమవుతుంది కదా.
పద్మ: నువ్వెందుకమ్మా ఆ మాటలు మాట్లాడుతున్నావు?
అనురాధ: మన ఇంట్లో డబ్బులు లేవని నాన్న బాధపడుతున్నాడు కదా అమ్మా.
పద్మ: నువ్వు చదువుకోవాలి తల్లీ. ఆ బాధ్యత మాది.
అనురాధ: కానీ అమ్మా… నాన్న ఒక్కరే ఎంత కష్టపడతాడు?
పద్మ కూతురి తల నిమిరింది. ఏమీ మాట్లాడలేకపోయింది.
మరుసటి రోజు ఉదయం
రాజయ్య బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
అనురాధ తన పుస్తకాల సంచిని తీసుకొచ్చి తండ్రి ముందు పెట్టింది.
రాజయ్య: ఏందమ్మా? బడికి వెళ్లవా?
అనురాధ: నాయనా… ఈరోజు నేను కూడా నీతో పొలానికి వస్తాను.
రాజయ్య: నువ్వెందుకమ్మా?
అనురాధ: నేను కూడా పని చేస్తే మన ఇంటికి నాలుగు పైసలు వస్తాయి కదా నాయనా.
రాజయ్య కూతురి వైపు చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.
పద్మ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది.
పద్మ: అనురాధా… నువ్వు బడికి పోవాలి. పనికి కాదు.
అనురాధ: అమ్మా… నాన్నకు కష్టం తగ్గితే చాలు.
రాజయ్య కూతురి చేతిలోని పుస్తకాల సంచిని తీసుకుని మళ్లీ ఆమె చేతికే ఇచ్చాడు.
రాజయ్య: ఈ సంచి నువ్వు మోయాల్సిందే తల్లీ. నా కష్టాలు నేను చూసుకుంటా.
అనురాధ కళ్లలో నీళ్లు తిరిగాయి.
2026 – ప్రస్తుతం
చింటూ: నాయనమ్మా…
నాయనమ్మ: ఏందిరా బిడ్డా?
చింటూ: మరి అనురాధ అత్తయ్య పనికి వెళ్లిందా? చదువుకుందా?
నాయనమ్మ: అదే రా బిడ్డా… ఆ రోజు మీ తాత ఏం నిర్ణయం తీసుకున్నాడో చెప్తాను. కానీ మా జీవితంలో అప్పటినుంచి మరో కష్టం మొదలైంది.
చింటూ: ఏంటి నాయనమ్మా?
నాయనమ్మ: ఆ రోజు మీ తాతకు పని దొరికింది. కానీ ఆ పని వల్ల మా కుటుంబంలో ఒక పెద్ద మార్పు వచ్చింది.
చింటూ: ఏం జరిగిందో చెప్పు నాయనమ్మా!
నాయనమ్మ: చెప్తాను రా… రేపు చెప్తాను.
కొనసాగుతుంది…
Swipe left/right or tap the sides to turn pages