ఆయుర్వేద పచ్చ రంగు రాత్రికి రాత్రే వదిలిపోతుందని శివ సబ్బులు, ఫేస్ వాష్‌లు మార్చి మార్చి ముఖం కడుక్కున్నాడు. కానీ, లక్ష్మి అత్తయ్య ఇచ్చిన ఆ పాత నాటు రంగు క్వాలిటీ మామూలుగా లేదు. తెల్లవారేసరికి రంగు కాస్త లైట్ అయింది కానీ, గడ్డం, మీసాలు ఇంకా పచ్చటి లాన్ లాగే మెరుస్తున్నాయి. శివ తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద మాస్క్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకొని ,కళ్ల జోడు పెట్టుకొని,ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాల్సి వచ్చింది.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. చుట్టూ జనాలు చాలా స్టైలిష్‌గా నడుస్తున్నారు. శివ మాత్రం తన పచ్చ మొహాన్ని దాచుకుంటూ సాహిత్య వెనుక లగేజీ పట్టుకుని నడుస్తున్నాడు. సాహిత్య జీన్స్, వైట్ షర్ట్ వేసుకుని చాలా హ్యాపీగా, సరదాగా నడుస్తోంది. తన మొగుడిని ఇంతలా ఆటపట్టించిన ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.