“బంగారం రా నా కోడలు” అన్నారు ఊర్మిళ గారు.
“అదే, అదే” అన్నాడు విక్కీ.
“సరే, నువ్వు కూడా ఎక్కువసేపు మేల్కొని ఉండకు. రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది” అని చెప్పడంతో,
“అలాగే అమ్మ” అని తినేసి, తను కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విక్కీ.
ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండటంతో ముందుగా ఊర్మిళ గారు తొందరగా లేచి, కోడల్ని, కొడుకుని కూడా నిద్రలేపి వాళ్లని రెడీ చేయడంలో పడిపోయారు.
వైదేహికి పూర్తిగా చీర కట్టుకోవడం రాకపోవడంతో ఆవిడే స్వయంగా కోడలికి చీర కట్టి, తనకి జడ వేసి, తలలో నిండుగా పూలు తురిమి, మెడలో బంగారు ఆభరణాలు వేయించారు. చేతులకి పెళ్లినాటి గాజులే నిండుగా ఉండటంతో ఇక వేరేవి వేయలేదు. చెవులకి కమ్మలు, చంపస్వరాలు, ముక్కుకి ముక్కెర పెట్టి, ఇలా కోడల్ని అందంగా తయారు చేసి మురిసిపోయారు ఊర్మిళ గారు.