స్వయంసిద్ధ – 8వ భాగం
ఉదయం తొమ్మిది గంటలకు జాహ్నవి తన ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఉంది. టేబుల్ మీద ఒకవైపు నోట్‌బుక్, మరోవైపు తండ్రి తెచ్చిన వార్తాపత్రిక ఉన్నాయి.
కిటికీ లోంచి వస్తున్న వెలుతురు టేబుల్ మీద సగం వరకు పరుచుకుంది. ఎదురింటి బాల్కనీలో ఓ చిన్నారి స్కూల్ షూస్ వేసుకోవడానికి ప్రయత్నిస్తూ తల్లితో గొడవపడుతుంది.
“నాకు ఈ షూస్ వద్దు!”
“మరి ఏవి వేసుకుంటావు? స్కూల్‌కి చెప్పులు వేసుకుని వెళ్తావా?”
“నాకు నచ్చడం లేదు!”
వాళ్ల మాటలు విని జాహ్నవి నవ్వుకుంది. పిల్లలకు తమకు నచ్చినదే కావాలి. పెద్దయ్యాక మాత్రం మనం వాళ్లకు ఏది మంచిదో నిర్ణయించి, వాళ్లకు నచ్చకపోయినా అదే చేయమంటాం. కొన్నిసార్లు అది అవసరమే కావచ్చు. కానీ ప్రతి విషయంలోనూ మన నిర్ణయమే సరైనదని అనుకోవడం మాత్రం ప్రమాదకరం.
ఆమె మళ్లీ కంప్యూటర్ వైపు తిరిగింది.
నిన్న మున్సిపల్ కార్యాలయంలో తెలుసుకున్న విషయాలను క్రమబద్ధీకరించింది. సంబంధిత శాఖను గుర్తించాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న రికార్డుల కోసం సరైన విధానంలో దరఖాస్తు చేయాలి. అంతవరకు రోడ్డు మరమ్మతుల విషయంలో ఎవరినీ తప్పుపట్టకూడదు.
ఆ పని కోసం ప్రత్యేకమైన గుర్తింపు అవసరం లేదు. కానీ ఓర్పు మాత్రం చాలా అవసరం. ఆ ఆలోచనలలో ఉంది జాహ్నవి! అప్పుడే తండ్రి గదిలోకి వచ్చారు.
“ఏమ్మా! నేను బయటకు వెళుతున్నాను! ఏమైనా తీసుకురంమంటావా?”