గతజన్మలో ఆది, మృణాళిని ప్రేమను ఉపయోగించుకుని రాజేంద్ర వర్మ తన కుట్రను ప్రారంభిస్తాడు. తాంత్రికుడికి మృణాళిని లాకెట్ లోని రహస్య గుర్తు కనిపించడంతో ప్రమాదం మరింత దగ్గరవుతుంది. ప్రస్తుత జన్మలో ఆద్వైత్ కు గతజన్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. అదే సమయంలో ఒక వృద్ధురాలి ఆత్మ ప్రత్యక్షమై, “ఈసారి కూడా అదే జరుగుతుంది” అంటూ వారిని హెచ్చరిస్తుంది.
ఆమె మృణాళినిని ఇంతకాలం కాపాడుతూ అక్కడే ఉండిపోయిందని చెప్పి అదృశ్యమవుతుంది. మరో వైపు రాజేంద్ర వర్మ, తాంత్రికుడితో కలిసి ఆ వృద్ధురాలి ఆత్మను అడ్డుకోవాలని, మృణాళినిని తమ అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆద్వైత్ కు మృణాళిని చిన్ననాటి జ్ఞాపకం మెరుస్తుంది.. వర్షం కురుస్తున్న రాత్రి ఒక చిన్న పాప అదే వెండి లాకెట్ తో బంగ్లాకు తీసుకురాబడుతుంది. రాజేంద్ర వర్మ ఆమెను తన కూతురిగా పెంచుకుంటానని చెబుతాడు. కానీ ఆ పాప అసలు ఎవరు? ఆమెను రాజేంద్ర వర్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అనే రహస్యం ఇంకా మిగిలే ఉంటుంది.
***
రాజేంద్ర వర్మ విషపు నవ్వు పులుముకుని మాట్లాడుతుంటే, ఆ చిన్న పాపకు మాత్రం ఏమీ అర్థం కాకుండా అతని వైపు చూస్తోంది.
రాజేంద్ర వర్మ ఆమెను ఎత్తుకుని…
“ఇక నుంచి నువ్వు నా మృణాళివి.. నా ప్రాణం నువ్వు”
అన్నాడు.