నీకు కనక ఇలా చేస్తున్నావు అని తెలిస్తే ఈ గదిలో కూడా పడుకోవేమో అని ప్రతిమని తలచుకుని చిన్నగా నవ్వుకుంటూ అలా ఆమె గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు అతను..
తెల్లారి యధావిధిగా త్వరగానే లేచిన ప్రణయ్ బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చేసరికి ప్రణయ్ లేవగానే మెలకువ వచ్చిన ప్రతిమా కూడా లేచి కూర్చుని కనిపిస్తుంది..
ఆమెను చూసిన ప్రణయ్ ఏంటి అప్పుడే లేచేసావు ఏంటి ప్రతిమ.. నీకు ఇంత ఉదయాన్నే నిద్రలేచా అలవాటు లేదు అనుకుంటా కదా.. నిద్ర పట్టడం లేదా అని చిన్నగా అడిగాడు..
అలా అని కాదండి ఎందుకో మెలకువ వచ్చేసింది.. అందుకే లేచి కూర్చున్నాను.. ఎలానో తెల్లవారిపోతుందిగా ఇంకెందుకులే పడుకోవడం అని పడుకోలేదు అని చెప్తుంది ప్రతిమ..
ఓహ్ సరే.. నీ ఇష్టం అని చెప్పి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోతాడు ప్రణయ్.. అతను వెళ్ళిపోయిన తర్వాత పైకి లేచి బాత్రూం లోకి వెళ్ళిన ప్రతిమ మొహం కడుక్కుని, పర్సనల్ పనులు కూడా పూర్తి చేసుకుని రూమ్ లోకి వచ్చాక ఒకేసారి స్నానం చేసి బయటకు వెళ్ళిపోదామా అన్న ఆలోచన కలుగుతుంది..
స్నానానికి బట్టలు తీసుకోబోయి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా రోజు పాపం అత్తయ్యే ఉదయాన్నే వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తుంది..