వంశీ కారు డ్రైవ్ చేస్తున్నాడు కానీ అతని కళ్లు రోడ్డు మీద ఉన్నా, ఆలోచనలు మాత్రం శ్రావణి గదిలోనే ఉండిపోయాయి.
ఆమె కళ్లలోని ఆ భయం, రాములు అనే పేరు వినగానే ఆమె వణికిపోయిన తీరు వంశీని కలచివేస్తోంది. సరిగ్గా అప్పుడే సరస్వతి గారి నుండి ఫోన్ వచ్చింది.
వంశీ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి నాన్న.. ఇంట్లో పూజ పెట్టుకుని అంత హడావిడిగా వెళ్ళిపోయావు? ఈరోజుకు లీవ్ పెట్టుకోమన్నాను కదా..
అసలు ఎక్కడికి వెళ్లావు నువ్వు అని ఆవిడ గొంతులో అసహనం, ఆవేదన వినిపించాయి.
వంశీ సర్దుకుంటూ, అమ్మ ఆఫీస్ నుంచి అర్జంటుగా ఫోన్ కాల్ వచ్చిందమ్మా.. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అందుకే చెప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది.
నేను రావడానికి లేట్ అవుతుంది, నా కోసం చూడకు అని చెప్పాడు.కానీ సరస్వతి గారు వదలలేదు.