శ్రావణి ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకు భయంతో, ఒంటరితనంతో నిండిన ఆ గదులు ఇప్పుడు సరస్వతి గారి మాతృత్వపు పరిమళంతో నిండిపోయాయి.
శ్రావణి గుండెల్లో గడ్డకట్టుకుపోయిన బాధ మెల్లమెల్లగా కరుగుతోంది.
సరస్వతి గారు సోఫాలో కూర్చుని శ్రావణిని దగ్గరకు తీసుకున్నారు. శ్రావణి కళ్లలో నీళ్లు తిరుగుతుండటం చూసి ఆవిడ మనసు తల్లడిల్లిపోయింది.
చూడు శ్రావణీ.. నువ్వు ఒంటరి దానివి అని ఎప్పుడూ అనుకోకు. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఈ ఆంటీ ఉందన్న విషయం మర్చిపోకు.
నీ కళ్లలో ఏదో దాచుకోలేని బాధ కనిపిస్తోంది తల్లి. అది ఏంటో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఆ బాధను భరిస్తూ నిన్ను నువ్వు శిక్షించుకోకు అని ఆవిడ ఎంతో ఆత్మీయంగా చెప్పారు.
శ్రావణికి తన తల్లి గుర్తొచ్చింది. సరస్వతి గారి ఒడిలో తల పెట్టుకుని ఒక్క నిమిషం కళ్లు మూసుకుంది.