రోజా – 4
“వస్తున్నా అత్తయ్య..”అని పరుగున ఒక చేతిలో కాఫీ కప్పు ఇంకో చేతిలో నీళ్ళమగ్గు పట్టుకొని వచ్చింది రోజా.
“టిఫిన్ పెట్టు,చేయి కడుక్కోడానికి నీళ్లు ఇవ్వు అని ప్రతిసారి పిలవాలా నీ దరిద్రం మొఖం చూడడానికి..అన్ని ముందే ఇక్కడ తెచ్చి పెట్టలేవా..” అని కసురుకుంది చిరాకుగా ముఖం పెట్టి పద్మ.
“పొయ్యి మీద కాఫీ మరిగిపోతాయని అక్కడ ఉండాల్సి వచ్చింది అత్తయ్య, ఇంకోసారి ఇలా జరగదు..” అని భయంగా నీళ్ళ మగ్గులో ఉన్న నీళ్లని టిఫిన్ ప్లేట్ లో ఉన్న పద్మ చెయ్యి మీద పోసింది చెయ్యి కడుక్కోమన్నట్టుగా రోజా.
చెయ్యి కడుక్కొని చేతిని చూపించింది దేనితో తుడుచుకోవాలి అన్నట్టుగా పద్మ.
తన భుజం మీద ఉన్న టవల్ పద్మ చేతికి ఇచ్చింది రోజా తుడుచుకోమన్నట్టుగా.
చెయ్యి తుడుచుకొని టవల్ ని రోజాకి ఇచ్చింది పద్మ.. తన ఇంకో చేతిలో ఉన్న కాఫీ కప్పు పద్మ చేతికి ఇచ్చి ప్లేట్ వాటర్ మగ్గు అన్ని తీసుకొని వెళ్ళిపోయింది గబగబా రోజా అక్కడ నుంచి.
స్నానం చేసి వచ్చి..”రోజా టిఫిన్ పెట్టమ్మా..” అని అన్నాడు సురేష్.
ప్లేట్లో దోశలు పెట్టుకొని వచ్చి సురేష్ చేతికి ఇచ్చింది రోజా.
కాఫీ తాగి కప్పు అక్కడ పెట్టి పైకి లేచింది పద్మ.
“ఈరోజు పనివాళ్ళు వస్తున్నారు..సాయంత్రం ఒక 50 కైకిల్లకి డబ్బులు కావాలి.” అని అన్నాడు సురేష్ పద్మవైపు చూస్తూ.
“50 మంది ఎందుకు నాట్లు అయిపోయాయి అప్పుడే.” అని అంది పద్మ సురేష్ వైపు చూస్తూ.
“కలుపు తీయడానికి.”అని అన్నాడు సురేష్.
“వచ్చేది పొలం మీద కాసింత దానిని కూడా కలుపుకి దానికి దీనికి అంటూ పని వాళ్ళకే సరిపోతుంది.. పొలంలో కలుపేగా ఇంట్లో ఉన్న కలుపు మొక్కను తీసుకువెళ్లి పని పూర్తి చేసుకుని రా ఎలాగో మధ్యాహ్నం ఉట్టిగానే ఉంటుంది అది.”అని అక్కడ నుంచి కదిలింది పద్మ.
“అత్తయ్య ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ ఉంది.” అని అంది కిచెన్లోంచి అడుగు బయటపెట్టి భయం భయంగా రోజా.
“స్టేజ్ మీద డాన్సులు వేసుకునే దానికి చదువు,పరీక్షలు ఎందుకే,అనవసరంగా బుక్కులకి పెట్టే డబ్బులు దండగ పొలంలో పనిచేస్తే కనీసం పని వాళ్ళకి ఇచ్చే పైసలైన మిగులుతాయి.” అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది పద్మ.
మౌనంగా చూసింది రోజా సురేష్ వైపు.. భార్యని ఏమీ అనలేక నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు సురేష్.
గబగబా ఇంట్లో పని చేసుకొని వంట చేసి మధ్యాహ్నం కి సురేష్ కి తనకి బాక్స్ కట్టి సురేష్ పొలం కి వెళ్తూ ఉంటే పరుగున వచ్చింది రోజా.
రోజాని చూసి..”పరీక్ష రాయడానికి కావలసినవి కూడా తీసుకో అమ్మ.. పరీక్ష రాసి మధ్యాహ్నం నుంచి పొలంకి వద్దువులే నిన్ను ఎక్సమ్ హాల్ దగ్గర దిగబెట్టి నేను పొలం కి వెళ్తా.” అని అన్నాడు సురేష్.
“నేను పరీక్ష రాయడానికి వెళ్లాను అని అత్తయ్యకి తెలిస్తే గొడవ చేస్తుంది మావయ్య.” అని అంది భయంగా రోజా.
“ఇంటి వెనక వాళ్ళ అత్త కోడలు గొడవ పడుతుంటే ఇంకా దాంట్లో నిప్పు రాజేయడానికి వెళ్ళిందిలే మీ అత్త.. ఇంకో రెండు గంటల వరకు రాదు ఇంటికి నువ్వు ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని రా రోజా.” అని అన్నాడు సురేష్.
“నందు అత్తయ్యకి చెప్తుంది మావయ్య.” అని అంది కంగారుగా రోజా.
“నందు పది అయితే గాని నిద్ర లేగవదు నువ్వు ముందు తొందరగా వెళ్లి రా అమ్మ మళ్లీ ఎగ్జామ్ మొదలవుతుంది.” అని అన్నాడు 8:40 అవుతున్న సమయాన్ని చూసుకుంటూ సురేష్.
రోజా సంతోషంగా ఇంట్లోకి పరిగెత్తింది ఎక్సమ్ ప్యాడ్ తీసుకురావడానికి.. సురేష్ బండి స్టార్ట్ చేశాడు లంచ్ బాక్స్ లు పక్కనే ఉన్న హ్యాండిల్ కి తగిలిస్తూ.
ఎక్సమ్ ప్యాడ్,హాల్ టికెట్,పెన్నులు తీసుకొని బయలుదేరింది సంతోషంగా సురేష్ బండిమీద కూర్చుని రోజా.
బండి మీద వెళుతూ..”ఇంట్లో ఉన్న సమస్యలని మెదడులోకి ఎక్కించుకొని చదువుని అశ్రద్ధ చేయకు రోజా..
రేపటి రోజున నువ్వు బతకాలంటే ఎప్పుడు మావయ్య నీతోటే ఉండడుగా,నువ్వు చదువుకున్న చదివే నీకు రేపటి రోజున నాలుగు మెతుకులు పెడుతుంది అమ్మ.” అని అన్నాడు సురేష్.
ఇంట్లో జరిగినవి ఇంట్లోనే మర్చిపోతాను మావయ్య నేను.. అత్తయ్య ఏదైనా అని వెళ్ళగానే అత్తయ్య వెళ్లినంత సేపట్లోనే నా మెదడులో నుంచి అవన్నీ వెళ్ళిపోతాయి.” అని అంది స్మైలీ ఫేస్ తో రోజా.
“నువ్వు ఈ డిగ్రీ పూర్తి చేసి.. పీజీ కూడా చేసి ఏదైనా స్కూల్లో టీచర్ అమ్మగా కొలువు చేస్తే ఒక అయ్య చేతిలో నిన్ను పెట్టి నిశ్చింతగా ఉంటానమ్మా.” అని అన్నాడు సురేష్.
పెళ్లి మాట వచ్చేసరికి సహజంగానే ఆడపిల్లకి ఉండే సిగ్గు తొంగి చూసింది రోజా బుగ్గల్లో.
కాలేజ్ ముందు బండిని ఆపాడు సురేష్.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages