రోబోట్రాన్ – 1
001 రోబోట్రాన్
ప్రపంచం మరో నవ శకంలోకి అడుగు పెడుతోంది. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టెక్నాలజీ విప్లవం సంభవిస్తోంది.
నిప్పును కనిపెట్టడం దగ్గర మొదలైన మానవ మేధస్సు ప్రస్థానం, చక్రం, ఆవిరి యంత్రం, విద్యుత్తు, ఇంటర్నెట్ వంటి మైలురాళ్లను దాటుకుంటూ నేడు ఒక అత్యంత కీలకమైన మలుపు వద్దకు చేరుకుంది.
ఆ మలుపు పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ – AI). ఏఐ రాకతో టెక్నాలజీ ప్రపంచం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు మనిషి ఆదేశాల కోసం ఎదురుచూసిన యంత్రాలు, నేడు సొంతంగా ఆలోచించే స్థాయికి ఎదిగాయి.
ఒకప్పుడు ఒక కార్యాలయంలో ఇరవై మంది ఉద్యోగులు రోజుల తరబడి కష్టపడి చేయాల్సిన పనిని, నేడు ఏఐ బాట్లు కేవలం చిటికెలో పూర్తి చేస్తున్నాయి. కోడింగ్ రాయడం నుంచి కవిత్వం అల్లడం వరకు, వైద్య నివేదికలను విశ్లేషించడం నుంచి న్యాయ సలహాలు ఇవ్వడం వరకు ప్రతి రంగంలోనూ ఏఐ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.
అందుకే ప్రపంచంలోని బడా మల్టీనేషనల్ కంపెనీలన్నీ తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుని, ఏఐ టెక్నాలజీ అభివృద్ధి పైనే వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి.
మానవ వనరుల స్థానంలో ‘హ్యూమన్-లెస్’ (మానవ రహిత) వ్యవస్థలను తీసుకురావడానికి కార్పొరేట్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒక్కటే—ఖర్చు తగ్గించుకోవడం, లాభాలను పెంచుకోవడం.
మనిషికి జీతాలు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, అలసట వస్తుంది, తప్పులు జరుగుతాయి. కానీ ఏఐ బాట్లకు ఆకలి లేదు, నిద్ర లేదు, విశ్రాంతి అవసరం లేదు. 24 గంటలూ అవి అలుపెరగకుండా పనిచేస్తాయి.
నిజానికి, ఏఐ భవిష్యత్తుపై మనిషికి లోలోపల ఎన్నో భయాలు, సందేహాలు ఉన్నాయి. ఏఐ తమ ఉద్యోగాలను మింగేస్తుందని లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు.
కానీ, “కొత్త వింత.. పాత రోత” అనే సామెత ఉండనే ఉంది కదా! మనిషి సహజంగానే కొత్తదనానికి ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణలో పడి భవిష్యత్ ప్రమాదాలను విస్మరిస్తాడు.
కేవలం భారీ డేటా సెంటర్లపై, అల్గారిథమ్స్‌పై ఆధారపడి నడిచే ఈ ఏఐ టెక్నాలజీని నేడు మనిషి అత్యంత వింతగా, ఒక రకంగా చెప్పాలంటే బానిసలా వాడుకుంటున్నాడు.
ప్రతి చిన్న విషయానికి ఏఐపై ఆధారపడటం వల్ల మనిషి తన సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, విచక్షణా జ్ఞానాన్ని క్రమంగా కోల్పోతున్నాడు. ఈ పరిణామంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ, ఈ వెర్రి ప్రపంచం నిపుణుల హెచ్చరికలను అస్సలు పట్టించుకోవడం లేదు. పరిణామ క్రమంలో ఆసక్తికరమైన నిజం ఒకటి ఉంది. ఆదిమానవుడికి తోక ఉండేది. చెట్లపై నివసించేటప్పుడు సమతుల్యత కోసం ఆ తోక ఉపయోగపడేది.
కానీ మనిషి నేలపై నడవడం మొదలుపెట్టి, ఆ తోకను వినియోగించకపోవడంతో.. కొన్ని లక్షల ఏళ్ల తర్వాత క్రమంగా ఆ తోక మాయమైపోయిందని జీవశాస్త్ర, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ప్రకృతి నియమం ప్రకారం, మనం ఏ అవయవాన్ని అయితే వాడకుండా వదిలేస్తామో, అది క్రమంగా నిర్వీర్యమైపోతుంది. ఇప్పుడు ఏఐ రాకతో మనిషి తన మెదడుకు పని చెప్పడం మానేశాడు.
చిన్న లెక్క చేయాలన్నా, ఒక ఉత్తరం రాయాలన్నా, ఆఖరికి ఏం తినాలో నిర్ణయించుకోవాలన్నా ఏఐని అడుగుతున్నాడు. ఇలాగే జరిగితే, భవిష్యత్తులో మనిషి తన బుర్రను ఉపయోగించకపోతే.. బహుశా కొన్ని తరాల తర్వాత మనిషి తలకాయలో ఆ ‘మెదడు’ కూడా కనుమరుగైపోతుందేమో అన్న భయం కలుగుతోంది!
అదే గనుక జరిగితే.. భూమిపై మానవాళి ఉనికికే ప్రమాదం, వినాశనం తప్పదు. అంతేకాదు, ఇప్పటివరకు యంత్రాలు మనిషి నియంత్రణలో ఉన్నాయి. కానీ, ఏఐ తన మేధస్సును తానే పెంచుకుంటూ (Self-learning), మనిషి ప్రమేయం లేకుండా స్వయం నిర్ణయాలు (Autonomous decisions) తీసుకోవడం మొదలుపెడితే.. దాన్ని అడ్డుకునేది ఎవరు?. స్విచ్ ఆఫ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి? అన్న ప్రశ్నకు ప్రస్తుత సమాజంలో సరైన సమాధానం చెప్పే వారే కనుమరుగైపోయారు.
టెక్నాలజీ పరుగు ముందు నైతిక విలువలు, భద్రతా ప్రమాణాలు వెనకబడిపోయాయి.
మరోవైపు, వ్యక్తిగత గోప్యత (Data Privacy) అనేది నేడు అతి పెద్ద సమస్యగా, ప్రశ్నార్థకంగా మారింది. ఏఐ చాట్బాట్లను మనం అడిగే ప్రతి ప్రశ్నను, మనం పంచుకునే ప్రతి సమాచారాన్ని అవి తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకుంటాయి.
మనం ఏం ఆలోచిస్తున్నామో, మన బలహీనతలు ఏమిటో, మన ఆర్థిక పరిస్థితి ఏమిటో ఆయా టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచుతున్నాయి. ఈ డేటా ప్రైవసీపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, సామాన్య జనం మాత్రం అవేమీ పట్టించుకోకుండా వెర్రిగా, గుడ్డిగా ఏఐ బాట్లను వాడేస్తున్నారు.
ఈ క్రమంలో సమాజంలో విచిత్రమైన, ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. ఏఐ బాట్లకు జనం పిచ్చిగా తమ రహస్యమైన వ్యక్తిగత వివరాలు చెబుతున్నారు. తమ మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు—ఇలా అన్నీ ఏఐతో పంచుకుంటున్నారు.
కన్నతల్లిని, తోబుట్టువైన చెల్లిని, ఆఖరికి కట్టుకున్న భార్యను కూడా నమ్మని మనిషి.. ప్రాణం లేని, కేవలం కోడ్‌తో నిర్మితమైన ఏఐతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు.
ఏఐని ఆప్తమిత్రుడిలా, సలహాదారుడిలా, చివరికి జీవిత భాగస్వామిలా భావిస్తున్నాడు. ఇలాంటి విచిత్రమైన మానసిక పోకడలు ఇప్పుడు సమాజంలో ఎక్కువ అయ్యాయి. ఇది మానవ సంబంధాలను బలహీనపరచడమే కాకుండా, మనిషిని ఒంటరితనం అనే చీకటి కూపంలోకి నెడుతోంది.
ఇదిలా ఉంచితే, అత్యంత ప్రమాదకరమైన పరిణామం ఏమిటంటే… ఏఐ నేడు యుద్ధరంగంలోకి ప్రవేశించింది. దీనితో యుద్ధతంత్రం, యుద్ధరంగం తీరుతెన్నులు సమూలంగా మారిపోయాయి.
చరిత్ర పుటలను తిరగేస్తే, పురాతన కాలంలో యుద్ధమంటే ముఖాముఖి పోరాటం. బరిసెలు, ఈటెలు, పదునైన కత్తులు, భారీ గదలు, విల్లంబులను ఉపయోగించి సైనికులు పోరాడేవారు.
అక్కడ సైనికుడి శారీరక బలం, ధైర్యం, యుద్ధ నైపుణ్యం ప్రధాన పాత్ర పోషించేవి. ఆ తర్వాత కాలక్రమంలో మందుగుండు (Gunpowder) కనిపెట్టారు. ఈ ఒక్క ఆవిష్కరణతో యుద్ధ రంగం స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
ఈ మందుగుండు సాంకేతికత కారణంగానే.. బ్రిటిషర్లు, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వంటి యూరోపియన్ వలసదారులు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలను సులభంగా ఓడించి, ప్రపంచాన్ని దశాబ్దాల పాటు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
ఆ మందుగుండుతోనే ఆధునిక తుపాకులను, శక్తివంతమైన బాంబులను, దూరపు లక్ష్యాలను ఛేదించే ఫిరంగులను తయారు చేశారు. ఫలితంగా కత్తులు, కటార్లు, గదలు, విల్లులు చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయాయి.
రాజుల కాలం నాటి అశ్వదళం, గజదళం వంటి సంప్రదాయ సైన్యాలు మాయమయ్యాయి. వాటి స్థానంలో భారీ యుద్ధ ట్యాంకర్లు, ఖండాంతర క్షిపణులు, శబ్దవేగంతో దూసుకెళ్లే యుద్ధ విమానాలు, సముద్రాలను శాసించే భారీ యుద్ధ నౌకలు వచ్చి చేరాయి.
ఆ తర్వాత ఇరవయ్యో శతాబ్దంలో, ఆధునిక ఆయుధాలు, తుపాకులతోనే యుద్ధాల్లో పోరాడే పరిస్థితి కొనసాగింది. కానీ, 2022 తర్వాత చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, టెక్నాలజీ మార్పులతో యుద్ధాల తీరు ఇప్పుడు పూర్తిగా డ్రోన్ల (Drones) వైపు మళ్లింది.
శత్రుదేశం వద్ద ఎంత భారీ సైన్యం ఉన్నా, ఎంత ఖరీదైన యుద్ధ విమానాలు ఉన్నా.. తక్కువ ఖర్చుతో తయారయ్యే చిన్నపాటి డ్రోన్ల ముందు ఆ బలవంతుడు సైతం మోకరిల్లాల్సిందేనని యుద్ధంలో ఇరాన్ డ్రోన్ టెక్నాలజీ ప్రపంచానికి నిరూపించింది.
2022 తర్వాత ఏఐ సాంకేతికత వేగంగా విస్తరించడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇప్పుడు ఏఐని కేవలం సమాచార సేకరణకే కాకుండా, నేరుగా ఆయుధాలకు అనుసంధానం చేస్తున్నారు.
డ్రోన్లకు, శత్రువుల దాడులను గాల్లోనే అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు, అత్యాధునిక యుద్ధ విమానాలకు, జలాంతర్గాములకు ఏఐని జోడిస్తున్నారు.
దీంతో యుద్ధంలో మనిషి ప్రమేయం నామమాత్రంగా మారింది. శత్రువు స్థానాన్ని, లక్ష్యాన్ని ముందే ఏఐకి చూపిస్తే చాలు.. ప్రయోగించిన మరుక్షణం నుంచే డ్రోన్లు, క్షిపణులు ఏఐ సహాయంతో వాతావరణ పరిస్థితులను, శత్రువుల కదలికలను స్వయంగా విశ్లేషించుకుంటూ ఖచ్చితత్వంతో లక్ష్యానికి చేరుకుని ఊహించని విధ్వంసం సృష్టిస్తున్నాయి.
మనిషి ఆదేశం లేకుండానే ఏఐ స్వయంగా లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే ‘కిల్లర్ రోబోలు’ (Lethal Autonomous Weapons) రంగంలోకి దిగుతున్నాయి. ఇది మానవ చరిత్రలో మరో మారణహోమానికి, మరో మహా వినాశనానికి శ్రీకారం అన్నమాట.
ఇప్పుడు ఈ టెక్నాలజీని మరో అడుగు ముందుకేసి, ఊహకందని స్థాయికి తీసుకెళ్లడానికి అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ శ్రీకారం చుట్టింది. ఆ కంపెనీ పేరు… ఎక్సోబాట్ (EXOBOT). కేవలం సాఫ్ట్వేర్ రూపంలో కాకుండా, మనిషిలాగే కదిలే, ఆలోచించే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోను సృష్టించి, దానికి అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధను అనుసంధానం చేయాలన్నది ఆ కంపెనీ లక్ష్యం.
ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, మనిషి సహాయం లేకుండానే స్వయంగా సమస్యలను విశ్లేషించి, పరిష్కరించేలా ఆ రోబోను రూపొందించాలన్నది ఎక్సోబాట్ శాస్త్రవేత్తల బృహత్తర ప్రయత్నం.
ఆ కంపెనీ అత్యంత గోప్యంగా, ఏళ్ల తరబడి శ్రమించి తయారు చేసిన ఆ తొలి తరం అద్భుత రోబో పేరు EXOFORCE-1. అత్యాధునిక సెన్సార్లు, కృత్రిమ కండరాలు, క్వాంటమ్ ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఏఐ మెదడుతో EXOFORCE-1ను పూర్తిగా సిద్ధం చేసిన కంపెనీ.. దాన్ని అత్యంత కఠినమైన వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించడానికి, అంటే ప్రయోగానికి సిద్ధమైంది.
అయితే.. ఇక్కడే అసలైన ఉత్కంఠ మొదలవుతుంది! ఎక్సోబాట్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ EXOFORCE-1 ప్రయోగం అసలు సక్సెస్ అవుతుందా?. లేక సాంకేతిక లోపాలతో విఫలమవుతుందా?.
ఒకవేళ ఆ రోబో స్వయంగా ఆలోచించడం మొదలుపెట్టి, తన సృష్టికర్తల ఆదేశాలనే ధిక్కరిస్తే ఏం జరిగుతుంది? ఇలాంటి అత్యంత శక్తివంతమైన, స్వయం నిర్ణయాలు తీసుకునే ఏఐ రోబోలతో భవిష్యత్తులో మనుషులకు ప్రాణాపాయం, పెను ప్రమాదం తప్పదా?
(ఇంకా ఉంది)
సిల్వర్ లయన్ రోరింగ్…
Swipe left/right or tap the sides to turn pages