Episode 3
Episode 03 – అనుకొని సంఘటన
నిజంగా బాలా తన తండ్రిని చంపుకున్నాడా?
********
కుడి చెయ్యి కుడి కాలు పని చేయకుండా పోయాక తన పనులు కూడా చేసుకోలేని దుస్థితికి వచ్చాడు కోటేష్. ఎంతో ఓపిగ్గా ఇంటి పనులు, పొలం పనులతో తన పనులు కూడా చేస్తున్నా శాంతాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అతని కన్నీళ్లు పైట చెంగుతో తుడుస్తూ, “మీరిలా మాటి మాటికి ఏడుస్తూ నాకున్న ధైర్యాన్ని నీరు గారిస్తే ఎలా అండి!?” అని భర్తను అడిగింది శాంతా.
కోటేష్ దీనంగా మొహం వేళ్ళాడేసుకొని, “దేవుడు ఇంత నిర్దయగా నీ నుదుట బొట్టు కొంచెం కొంచెంగా తుడిచేస్తుంటే నీకేమి పట్టడం లేదా శాంతా? ఇలా ఎలా ఉండగలుగుతున్నావు శాంతా!? కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అని తేడా చూపించకుండా పసి పాపలా సాకుతున్నావు… ఇలా రోగిష్టిలా మంచనా పడిన నన్ను చూస్తే అసహ్యం వేయడం లేదా?” అని ఒక్కో మాట కూడదీసుకుని అడిగాడు.
శాంతా ఏ భావం చూపించకుండా, “పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్కరికీ తాము చనిపోతామని తెలిసి కూడా ఆనందంగా గడిపేస్తుంటారు. నిజానికి వాళ్ళ ఆనందానికి కారణం ఏంటో తెలుసా అండి! వాళ్ళ చావు ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు. అదే వాళ్ళ ఆనందానికి కారణం. ఇప్పుడు మీరు మంచంలో పడి చావు గురించి ఆలోచిస్తూ దాన్ని ఇంకా దగ్గర చేసుకుంటూనే ఉన్నారు. నా మరణం ఇలానే ఉంటుందని ఊహించుకుంటూ చేతిలో ఉన్న క్షణాలను కూడా వృధా చేసుకుంటున్నారు, అంతే గానీ వచ్చే చావుని మర్చిపోయి ఆనందంగా ఉండాలని చూడటం లేదు” అని అంది.
కోటేష్ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. ‘అవును, ఉన్న నాలుగు రోజులైనా ఆనందంగా గడపకుండా నేను బాధపడుతూ, వీళ్ళని బాధ పెట్టడం ఎంత వరకు కరెక్ట్? ఉహూ ఇలా ఉండకూడదు. నా కొడుక్కి నేను నా ఆలోచనలు మాత్రమే ఇస్తే సరిపోదు, ఆచరించి చూపించాలి. కదలలేక పోయినా సరే… మాటల ద్వారా అయినా ఆనందాన్ని ఇవ్వాలి..’ అనుకుంటూ శాంతా వైపు చూసాడు.
శాంతా తననే తదేకంగా చూస్తుంటే, “ఏంటి శాంతా! నేనెల్లి పోతానేమో అని భయపడుతున్నావా?” అని అడిగాడు.
“లేదండీ! బాలా పుట్టిన తర్వాత మరో బిడ్డ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదని నేను బాధ పడ్డాను గుర్తుందా! కానీ, ఏ దేవుడు నా మొర ఆలకించాడో! నా బాధను చూడలేక ఇలా మిమ్మల్ని ఇలాంటి స్థితిలోకి తెచ్చి, నాకు మరో కొడుకుని ఇచ్చాడేమో!” అని కోటేష్ నుదుటిన ముద్దు పెట్టుకుంటు అంది శాంతా.
ఆమె మాటల్లోని అంతరార్థం అర్థం అవగానే, హృదయం ద్రవించింది. అయినా బయటికి కనిపించకుండా, “నీ మాటలతోనే కడుపు నింపేస్తావా? ఇంతకీ ఏం కూర చేశావోయ్…” అని హుషారుగా అడిగాడు కోటేష్.
చాలా రోజుల తర్వాత హుషారుగా మాట్లాడుతున్న కోటేష్ ను చూసి, “మీకిష్టమైన ఆలు కుర్మా చేశాను. కంచంలో పెట్టుకుని తెస్తాను ఉండండి…” అని వడివడిగా వంట గదిలోకి వెళ్ళింది శాంతా.
కొన్ని నెలలుగా ఒక్క పని మీద ఆసక్తి చూపించకుండా తిరుగుతున్న శాంతాలో తాను మాట్లాడిన చిన్న మాటతో ఇంత మార్పు రావడం చూసిన కోటేష్ కి ఆనందంగా ఆనిపించింది. ఇంతకు ముందు పని మీద బయటికి వెళుతూ ఇలానే ఏం వండావ్ అని అడిగితే ఉరుకుల పరుగుల మీద కంచం పెట్టే ఆనాటి శాంతా గుర్తుకు వచ్చి, ఇక ముందు కూడా ఇలానే ఉషారుగా ఉండాలి అనుకున్నాడు.
కొటేష్ ను మంచంలోనే తలగడ ఆసరాతో కూర్చోబెట్టి, రొట్టె ముక్కను ఆలు కుర్మాతో అద్ధి తినిపించబోయింది.
అంతలోనే నలుగురు మనుషులు బాలను తీసుకొచ్చి పక్కనే ఉన్న సోఫాలో పడుకోబెట్టారు. ఒళ్లంతా చిన్న చిన్న గాయాలు, బ్యాండేజ్ లతో కనిపించాడు బాలా. వాటి నుండి ఇంకా పచ్చిగా రక్తం కారుతూ ఉంది. అది చూసి శాంతా భయపడి చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేసింది. కోటేష్ నోట మాట రానట్లు చూస్తుండి పోయాడు.
రామనాథం, కోటేష్ భుజం మీద చెయ్యేసి, “ఇదిగో కోటేషు… ఆటలకి స్కూల్ స్థలం సరిపోవడం లేదని రోడ్డుకి అవతల ఉన్న బంజరు భూమిలో ఆటలాడించారు టీచర్లు. మన బాలాతో పాటు మరికొంత మంది పిల్లలు కోకో ఆడుతున్నారు. అంతలోనే రోడ్డు మీద పోతున్న ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి పిల్లల మీదకి దూసుకు వచ్చింది. అదృష్టం బాగుండి మన వాడికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.. కంగారు పడకండి, ఒకటి రెండు రోజుల్లో కోలుకుంటాడు” అని ధైర్యం చెప్పాడు.
శాంత ఏడుస్తూ బాలా ఒళ్ళంతా తడిమి చూసింది. పెద్దగా దెబ్బలేమి తగలకపోయిన స్పృహలో లేని కొడుకుని చూసి, “మీరు చెప్పేది నిజమేనా? నా కొడుక్కి ఏమి కాలేదు కదా? మీకు దండం పెడతాను బాబాయ్… వాడేందుకు అలా ఉన్నాడు చెప్పండి” అని ఏడుస్తూ అడిగింది.
చివర్లో నిలబడిన ముకుందం ముందుకు వచ్చి, “శాంతా గారు… బాలాకి ఏమి అవ్వలేదు కానీ…” అంటూ నీళ్ళు నమిలాడు.
తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే చెలీ చెలీ నిన్నే కోరి వలచా.. నెక్స్ట్ ఎపిసోడ్ చదివేయండి
Swipe left/right or tap the sides to turn pages