Mounanga Modhalaina Prema – 1
కొంతమంది మన జీవితంలోకి ఎలా వస్తారో మనకు తెలియదు. కానీ వాళ్లు వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా మనం ఊహించలేం.
అది కూడా ఒక చిన్న పరిచయంతోనే మొదలవుతుంది.
హైదరాబాద్ | ఉదయం 9:00 గంటలు
“చందూ… ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే? కాలేజీకి టైమ్ అవుతుంది!” అంటూ అరిచింది సిరి.
“వస్తున్నానే… రెండు నిమిషాలు!” అంటూ తన బ్యాగ్ తీసుకుంది చందు.
చందు B. Sc చదువుతోంది. చూడటానికి చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. కొత్తవాళ్లతో పరిచయాలు చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా వచ్చి మాట్లాడితే సమాధానం చెప్తుంది తప్ప, తనంతట తాను వెళ్లి మాట్లాడటం చాలా అరుదు.
తనకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సిరి, మేఘన.
ముగ్గురూ ఒకే కాలేజీలో వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో చదువుతున్నారు. ఒకే రూమ్‌లో ఉండటంతో మంచి స్నేహితులయ్యారు.
“చందూ! నువ్వు అసలు మారవా? ఎప్పుడూ మాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడవు!” అంది మేఘన.
“నాకు మీరున్నారు కదా!” అంటూ నవ్వింది చందు.
“అదే నీ ప్రాబ్లమ్!” అంటూ ముగ్గురూ నవ్వుకున్నారు.
కానీ చందుకి కాలేజీలో ఉన్న ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కాకుండా, తన జీవితంలో ఇంకొక ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు.
అతనే విక్కీ.
రాత్రి 9:30 | చందు హాస్టల్ రూమ్
భోజనం ముగించుకుని బెడ్ మీద కూర్చున్న చందు ఫోన్ తీసుకుంది. అప్పటికే విక్కీకి మెసేజ్ పెట్టింది.
కొద్దిసేపటికే విక్కీ నుంచి కాల్ వచ్చింది.
“హలో విక్కీ!”
“ఏంటే చందూ! ఎలా ఉన్నావ్?”
“బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్?”
“నేను కూడా బాగున్నాను. ఈరోజు ఏం చేశావ్?”
అలా మొదలైన వాళ్ల సంభాషణ రోజూ గంటల తరబడి కొనసాగేది.
ఎనిమిదో తరగతిలో మొదలైన వాళ్ల పరిచయం ఇప్పటికీ కొనసాగుతోంది. చందు తన మనసులోని చాలా విషయాలను విక్కీతో మాత్రమే చెప్పుకునేది. తనకు ఎవరితోనూ అంతగా మాట్లాడటం రాకపోయినా, విక్కీతో మాత్రం ఏదైనా మాట్లాడగలిగేది.
ఒకరోజు విక్కీ తన ఫోన్‌లో ఒక అమ్మాయి ఫోటో పంపించాడు.
విక్కీ: చందూ… ఈమె నా గర్ల్‌ఫ్రెండ్.
చందు: ఓహో! గర్ల్‌ఫ్రెండా? ఎప్పుడూ చెప్పలేదేంటి?
విక్కీ: ఇప్పుడు చెప్తున్నానుగా!
చందు: సరే సరే… బాగుంది. తనని బాగా చూసుకో. చిన్న చిన్న విషయాలకి గొడవపడకు. తనని బాధపెట్టకు.
విక్కీ: అబ్బా! నువ్వు చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాలే.
చందు: హ్మ్మ్… మంచిది!
ఆ తర్వాత కొద్దిరోజులకు విక్కీ కాల్స్ తగ్గించాడు. ముందు ప్రతిరోజూ మాట్లాడేవాడు. ఇప్పుడు ఒక్కోసారి వారం రోజులకు, ఇంకోసారి రెండు వారాలకు ఫోన్ చేసేవాడు.
చందు కూడా తన చదువు, కాలేజీ పనుల్లో బిజీగా ఉండిపోయింది.
కానీ తన రూమ్‌మేట్స్‌తో ఉన్నా వాళ్ల ఫ్రెండ్స్‌తో అంతగా కలిసిపోయేది కాదు. వాళ్లందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే చందు మాత్రం ఎక్కువగా వింటూ ఉండేది.
రోజులు గడిచేకొద్దీ తనకు ఒంటరిగా అనిపించడం మొదలైంది.
ఒకరోజు రాత్రి…
విక్కీ నుంచి కాల్ వచ్చింది.
“హలో విక్కీ!”
“ఏంటి చందూ! ఈ మధ్య నన్ను మర్చిపోయావా?”
“నేను మర్చిపోలేదు. నువ్వే కాల్ చేయడం లేదు!”
“సరేలే… చెప్పు. ఏం విశేషాలు?”
కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చందు సరదాగా ఒక మాట అంది.
చందు: విక్కీ… నాకు ఎవరైనా ఫ్రెండ్స్‌ని పరిచయం చేయవా?
విక్కీ: ఎందుకే? నేనున్నాను కదా!
చందు: నువ్వు ఎప్పుడూ మాట్లాడటం లేదు కదా! నాకు కూడా ఎవరితోనైనా మాట్లాడాలని ఉంటుంది.
విక్కీ: నా ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్లు కాదు. నీకు సెట్ అవ్వరు.
చందు: అందరూ అలానే ఉండరు కదా! నీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా మంచి వాళ్లు ఉంటే పరిచయం చెయ్. మాట్లాడతాను.
విక్కీ: సరే, పరిచయం చేస్తాను.
చందు: సరే అయితే!
అలా ఇద్దరూ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుని కాల్ కట్ చేశారు.
కొన్ని రోజుల తర్వాత…
కాలేజీకి హాలిడేస్ రావడంతో చందు ఇంటికి బయలుదేరింది. బస్సులో కిటికీ పక్కన కూర్చుని పాటలు వింటూ బయట చూస్తోంది.
ఇంతలో ఫోన్ మోగింది.
స్క్రీన్ మీద విక్కీ పేరు కనిపించడంతో కాల్ లిఫ్ట్ చేసింది.
చందు: హలో విక్కీ!
విక్కీ: ఏంటే! ఇంటికి వెళ్తున్నావా?
చందు: అవును. ఇప్పుడే బస్సు ఎక్కాను.
విక్కీ: సరే, ఒకటి చెప్పాలి. నీకు ఫ్రెండ్‌ని పరిచయం చేస్తానన్నాను కదా!
చందు: హా… గుర్తుంది. ఏంటి?
విక్కీ: నా ఫ్రెండ్ ఒకడున్నాడు. పేరు రామ్. చాలా మంచి అబ్బాయి. గుజరాత్‌లో B.Tech చేస్తున్నాడు. నీకు తనతో పరిచయం చేస్తాను. తన నంబర్ పంపిస్తాను. నువ్వు మెసేజ్ చెయ్.
చందు: అరే! నేను ఏదో సరదాగా అన్నాను విక్కీ!
విక్కీ: నువ్వు సరదాగా అన్నావేమో… కానీ నేను సీరియస్‌గా తీసుకున్నాను. నీకు కూడా కొత్త ఫ్రెండ్ ఉంటాడు కదా!
చందు: హ్మ్మ్… సరే, చూద్దాం.
విక్కీ: సరే. నంబర్ పంపిస్తాను. ఇంటికి జాగ్రత్తగా వెళ్లు.
చందు: సరే బై!
కాల్ కట్ చేసిన చందు మళ్లీ తన పాటలు వినడం మొదలుపెట్టింది.
కొద్దిసేపటికి విక్కీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.
విక్కీ: ఇదిగో రామ్ నంబర్. మెసేజ్ చెయ్.
చందు ఆ నంబర్ చూసి ఫోన్ పక్కన పెట్టేసింది.
ఇప్పుడే మెసేజ్ చేయాలా? ఇంటికి వెళ్లాక చేయాలా? అసలు ఏం మెసేజ్ చేయాలి? కొత్తవాళ్లతో మాట్లాడటమే రాని తనకు ఇదొక కొత్త సమస్యగా అనిపించింది.
చివరికి ఫోన్ పక్కన పెట్టి కిటికీలోంచి బయటకు చూడసాగింది.
తనకు తెలియదు…
విక్కీ పంపించిన ఆ నంబర్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోందని!
ఒక చిన్న మెసేజ్‌తో మొదలయ్యే పరిచయం… ఎక్కడివరకు వెళ్తుందో?
కొనసాగుతుంది…
Swipe left/right or tap the sides to turn pages