అద్వైత్తో కలిసి గడపబోయే ఈ రెండు రోజులు…. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఇంకాస్త కొత్తగా అర్థం చేసుకునేలా చేయబోతున్నాయి ఇద్దరికి తెలిస్తే ఇంకెంత ఆనందపడతారో ….
సాయంత్రం ఐదు గంటలు….
కాన్ఫరెన్స్ హాల్లో ఒక్కొక్క కాలేజ్‌కి సంబంధించిన టీమ్స్ అందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. హాల్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది. ఎక్కడ చూసినా కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి.
కొంతమంది తమ ప్రెజెంటేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటే…. మరికొంతమంది రేపు స్టేజ్ మీదకి వెళ్లాల్సిన టెన్షన్‌తో చివరి నిమిషంలో నోట్స్ చూస్తున్నారు. ఇంకొందరు మాత్రం చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు.
సహస్ర, నిహారిక కూడా ముందుగానే వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. సహస్ర మాత్రం తన చేతిలో ఉన్న ఫైల్ని మరోసారి ఓపెన్ చేసి చూస్తోంది. ఒక పాయింట్ చదివి…. మళ్లీ మొదటి పేజీకి వస్తోంది. మళ్లీ చివరి పేజీకి వెళ్లి…. ఏదైనా మిస్ అయ్యిందేమో అన్నట్టుగా చెక్ చేస్తోంది.
అది గమనించిన నిహారిక ఆమె వైపు చూసి నవ్వుతూ, “ఇంకెన్ని సార్లు చూస్తావే?” అని అడిగింది.