పసిఫిక్ మహా సముద్రం నడిబొడ్డున ‘ది రాయల్ పసిఫిక్’ నౌక అగ్ని గోళంలా మారుతోంది. కింద అంతస్తులలో విక్రమ్ అమర్చిన థెర్మైట్ బాంబుల టైమర్ కౌంట్ డౌన్ మృత్యుఘంటికల్లా వినిపిస్తోంది.
02:30… 02:29… 02:28…
నౌక పైభాగంలో సముద్రపు తుఫాను గాలి భయంకరంగా వీస్తోంది. ఆకాశంలో నల్లటి మేఘాలు, కింద ఎగసి పడుతున్న రాక్షస అలల మధ్య హెలికాప్టర్ రెక్కల చప్పుడు మార్మోగుతోంది. ఆలివర్ గాయ పడిన చేత్తో డివైజ్ బ్యాగ్‌ను గట్టిగా పట్టుకుని, హెలికాప్టర్ ఎక్కి తప్పించుకోవడానికి రన్నింగ్ చేస్తున్నాడు.
“ఆగు ఆలివర్!”
వెనుక నుండి సింహంలా గర్జించిన జ్వాల వాయిస్ వినిపించింది. సఫైర్ బ్లూ గౌన్ పై రక్తం మరకలు, చేతిలో గన్, నుదుట చెమట చుక్కలతో జ్వాల ఒక రౌద్ర కాళికలా నిలబడి ఉంది. ఆలివర్ వెనక్కి తిరిగి చూశాడు. వాడి కళ్లల్లో మొదటిసారి చావు భయం స్పష్టంగా కనిపించింది. ఐదేళ్ల క్రితం ఇండియాలో ఒక సాదాసీదా మహిళగా ఉన్న ఈ జ్వాల, ఈరోజు తన మొత్తం అంతర్జాతీయ మాఫియా కూటమినే సముద్రంలో ముంచేసే స్థాయికి ఎదుగుతుందని వాడు ఊహించలేదు.
జ్వాలా! నన్ను చంపితే ఈ డివైజ్ సముద్రంలో పడిపోతుంది. నీ జేఎస్ సామ్రాజ్యం నాశనమైపోతుంది” అని ఆలివర్ బెదిరించాడు.
“నా సామ్రాజ్యం నా భర్త శ్వాస ఆలివర్! దాన్ని దొంగిలించే మొగాడు మొనగాడు ఈ భూమి పై ఇంకా పుట్టలేదు!” అంటూ జ్వాల మెరుపు వేగంతో ముందుకు దూకింది.
ఆలివర్ తన గన్ తీసి ట్రిగ్గర్ నొక్కబోయాడు, కానీ జ్వాల అంతకంటే ముందే వాడి మణికట్టును గురిచూసి కాల్చింది. బుల్లెట్ దూసుకెళ్లి వాడి చేతిని చీల్చింది. వాడి చేతిలో గన్ కింద పడిపోయింది. జ్వాల పరిగెత్తుకెళ్లి ఒక పవర్‌ఫుల్ కిక్ తో ఆలివర్ ని హెలికాప్టర్ రన్‌వేపై పడేసింది. వాడి చేతిలోని బ్యాగ్‌ను లాక్కుని సురక్షితంగా తన భుజానికి తగిలించుకుంది.
సమయం కేవలం 00:45 సెకన్లు మాత్రమే ఉంది. నౌక కింది భాగంలో పేలుళ్లు ప్రారంభమయ్యాయి. షిప్ ఒక పక్కకు వంగిపోతోంది.
ఆలివర్ రక్తం కక్కుకుంటూ కింద పడి నవ్వుతూ అన్నాడు, “జ్వాలా.. నువ్వు డివైజ్ లాక్కున్నావు.. కానీ ఈ షిప్ ఇంకో ముప్పై సెకన్లలో పేలిపోతుంది. నువ్వు, నీ మొగుడు శక్తి, ఆ విక్రమ్ అందరూ నాతో పాటు ఈ పసిఫిక్ సముద్రంలో సమాధి అవ్వాల్సిందే!”