మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 3
పీఏ తలదించుకున్నాడు.
అసహనంగా చూస్తూ, “నువ్వు సార్ చెప్పిన అడ్రస్‌లో అజయ్‌ని డ్రాప్ చేసి, అతనితో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకో. ప్రతి ఐదు నిమిషాలకోసారి నాకు అప్‌డేట్ ఇవ్వు. అర్థమైందా?” అని చెప్పాడు అర్జున్.
తలదించుకున్న పీఏ ఒక్కసారిగా తలెత్తి, “సార్?!” అన్నాడు అర్థంకానట్టుగా.
కిచెన్‌లో నుంచి వస్తున్న అజయ్ వైపు కనుసైగతో చూపిస్తూ, “అజయ్ సార్‌తో పాటే ఉండు!” అని నొక్కి చెప్పాడు అర్జున్.
వస్తున్న అజయ్‌కి ఆ మాటలు వినిపించాయి.
‘నేను అర్జున్‌కి ఎలా కనిపిస్తున్నాను? నాపై అంత అనుమానం ఏంటి?’ అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు.
అజయ్ నవ్వుతూ పీఏ వైపు చూస్తున్నాడు. కానీ పీఏ ముఖంలో ఒకరకమైన గిల్టీ ఫీలింగ్ కనిపిస్తోంది. అజయ్‌ని నేరుగా చూడలేకపోతున్నాడు.
“మీరు చెప్పినట్టే చేస్తాను సార్!” అన్నాడు పీఏ.
నవ్వాడు అజయ్.
“గుడ్! నేను చెప్పినట్టు చేయకపోతే నీ ప్లేస్‌లో వేరేవాడు వస్తాడు!” అని బాస్ వాయిస్‌తో వార్నింగ్ ఇస్తున్న అర్జున్‌ని చూస్తున్నాడు అజయ్.
‘పని చేయించుకోవడం ఒక కళ. అలాంటి కళ అర్జున్‌కి లేకపోగా, అందరినీ బెదిరిస్తున్నాడు చూడు! నాతోనే అనుకున్నాను. అందరితోనూ ఇలాగే ఉంటాడా?’ అనుకున్నాడు అజయ్.
అది వార్నింగ్ అని అర్థం చేసుకున్న పీఏ జాగ్రత్తగా, “పని చేస్తాను సార్!” అన్నాడు.
“ముందు ఈ చెత్త తీసుకెళ్లు!” అని చెప్పేసి పైకి వెళ్లిపోయాడు అర్జున్.
పీఏ గుండెల నిండా గాలి పీల్చుకుని, టేబుల్ మీదున్న ఫైల్స్‌ని ఒక్కొక్కటిగా సర్దుతున్నాడు.
అది చూస్తున్న అజయ్ సాయం చేయాలని ఫైల్స్ పట్టుకోబోయాడు.
“సార్! మీరెందుకు ఇవన్నీ చేయడం? నేను ఉన్నాను కదా!” అంటూ ఫైల్స్ అన్నీ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు అజయ్.
ఇబ్బందిగా నవ్వి, “సార్… ఎవరిని అంటున్నారు మీరు?” అన్నాడు పీఏ. అర్థంకాక ముందుకు నడుస్తున్న అతన్ని చూసి.
“మిమ్మల్నే సార్! పొద్దుపొద్దున్నే భలేగా ఆడుకున్నారు నాతో!” అన్నాడు నవ్వుతూ పీఏ.
తాను ఎవరో, ఈ బంగ్లాలో ఎందుకు ఉంటున్నాడో పీఏకి చెప్పాలని అనుకున్నాడు అజయ్. కానీ అగ్రిమెంట్ విషయం చెప్పకూడదని గుర్తొచ్చింది. తన గురించి ఆయనకు అనవసరం అనుకుని మౌనంగా ఉండిపోయాడు.
‘అర్జున్‌కి కావాల్సిన వ్యక్తిని అనుకుంటున్నారు. అదే మంచిది. అర్జున్‌కి, నాకు కూడా!’ అని ఆలోచించాడు.
చిరునవ్వుతో, “నన్ను అజయ్ అని పిలవచ్చు సార్!” అన్నాడు.
కారు వెనుక డిక్కీలో ఫైల్స్ పెడుతున్న అజయ్‌తో, “ఓకే అజయ్ సార్!” అన్నాడు పీఏ నవ్వుతూ.
“తెలియక చేస్తే తప్పు అవుతుంది. తెలిసి చేస్తే అది నేరం అవుతుంది అజయ్ సార్! క్షమించాలి. నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే!” అన్నాడు గిల్టీ ఫీలింగ్‌తో.
“అయ్యో సార్! మీరు పెద్దవారు. నన్ను క్షమాపణ అడుగుతున్నారు! అయినా ఒక కాఫీ తాగినందుకే తప్పు, నేరం అంటున్నారు!” అన్నాడు నవ్వుతూ.
పీఏ కూడా నవ్వి కారు డోర్ తీస్తుండగా బంగ్లా బాల్కనీలో నుంచి వారిద్దరినీ గమనిస్తున్న అర్జున్ కనిపించాడు. అది చూసి పీఏ ముఖం చిన్నబోయింది.
తనతో నవ్వుతూ మాట్లాడుతున్న పీఏ ఒక్కసారిగా సైలెంట్ అవడంతో, అతను ఎటువైపు చూస్తున్నాడా? అని అనుకున్నాడు అజయ్.
బాల్కనీలో గోడకు ఆనుకుని తదేకంగా చూస్తున్న అర్జున్‌ని చూసి, అప్రయత్నంగానే ‘బై’ అన్నట్టుగా చేయి ఊపాడు అజయ్ నవ్వుతూ.
అర్జున్ కూడా బై అన్నట్టుగా చేయి ఊపాడు.
అజయ్ కారులో కూర్చున్నాడు. తాను డ్రైవర్ సీట్లో కూర్చోవడానికి ముందు అర్జున్‌ని మరోసారి పలకరించి వచ్చి కూర్చున్నాడు పీఏ.
“మీ పేరు ఏంటి?” అని కారు స్టార్ట్ చేస్తున్న పీఏని చూసి అడిగాడు అజయ్.
“నా పేరు రామకృష్ణ సార్!” అన్నాడు స్టీరింగ్ తిప్పుతూ.
పేరు వినగానే ఏదో గుర్తొచ్చినట్టుగా, “నిన్న రాత్రి నా అకౌంట్‌లో డబ్బులు వేసింది మీరే కదా?” అని ప్రశ్నించాడు అజయ్.
రామకృష్ణ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి కాలేజ్ ఫీజుకు సరిపడా డబ్బు తన అకౌంట్‌లో జమ అయిన విషయం నిన్న రాత్రే చూశాడు కదా!
“అర్జున్ సార్ నిన్న కాల్ చేసి, ఫలానా నంబర్‌కి అర్జెంటుగా అమౌంట్ సెండ్ చేయాలి. అరేంజ్ చేసి పంపించు అన్నారు సార్!” అన్నాడు రామకృష్ణ.
“అరేంజ్ చేయడం ఏంటి! అర్జున్ కుటుంబం రిచ్ కదా?” అన్నాడు కనుబొమ్మలు ముడివేస్తూ.
“తన కుటుంబానికి సంపద అమ్మలాంటిది అయితే, అర్జున్ సార్‌కి మాత్రం సవతి తల్లి వంటిది సార్!” అన్నాడు కారు నడుపుతూ.
“అంటే?” అని ప్రశ్నార్థకంగా చూశాడు అజయ్.
“అర్జున్ సార్‌కి కుటుంబ సంపద నుంచి ఒక్క రూపాయి కూడా రాదు సార్! అర్జున్ సార్ తన ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడరు. ఒకరకంగా చెప్పాలంటే తన ఫ్యామిలీతో కలిసి ఉండటం లేదు!” అన్నాడు రామకృష్ణ.
‘హో! అందుకేనా ఇంటికి ఎవరూ రారు! తనతో ఉన్న ఫ్యామిలీ ఫోటో కూడా లేదు!’ అనుకున్నాడు అజయ్.
“అర్జున్ సార్‌కి సిబ్లింగ్స్ ఉన్నారా? వాళ్లేం చేస్తారు?” అని మరింత తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగాడు.
“అర్జున్ సార్‌కి ఒక బ్రదర్ ఉన్నారు. అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు!” అన్నాడు రామకృష్ణ.
“వాళ్ల బ్రదర్‌తో రిలేషన్ బాగుంటుందా?” అని అడిగాడు అజయ్.
ఎందుకంటే బంగ్లాకి వాళ్ల బ్రదర్ రావడం లేదు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేసినట్టు లేదు.
“చైర్మన్ సార్ అర్జున్ సార్‌తో మాట్లాడటం నేను చూడలేదు సార్!” అన్నాడు ఆలోచిస్తూ రామకృష్ణ.
‘అంటే వాళ్ల బ్రదర్‌తో కూడా రిలేషన్ బాగోలేదన్నమాట! అసలు ఎందుకు ఫ్యామిలీతో కలిసి ఉండటం లేదు? ఏం జరిగి ఉంటుంది?’ అని ఆలోచిస్తున్న అజయ్‌కి తన మీద తనకే ఆశ్చర్యంగా అనిపించింది.
‘నేనెందుకు అర్జున్ గురించి అడిగి మరీ ఆలోచిస్తున్నాను? మనకెందుకులే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్!’ అనుకుని సైలెంట్ అయిపోయాడు.
అజయ్ ఇంకేమీ మాట్లాడకపోవడంతో రామకృష్ణ కూడా మౌనంగా డ్రైవింగ్ చేస్తున్నాడు.
‘అర్జున్ ఏం చేస్తుంటాడు? నాకు తెలిసి ఒకచోట కాళ్లు నిలకడగా ఉండవు. ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతుంటాడు!’ అనుకుని నవ్వుకున్నాడు అజయ్.
ఏమీ తోచకపోతే కాలు కాలిన పిల్లిలా తిరిగే అలవాటున్న అర్జున్ గుర్తొచ్చాడు అతనికి.
పీఏ అజయ్ ఏం చేస్తున్నాడో ఓరగా చూశాడు.
కారు విండోలోంచి బయటకు చూస్తూ ఆలోచిస్తున్న అజయ్‌ని గమనించాడు రామకృష్ణ.
డ్రైవింగ్ చేస్తూనే కారు వేగాన్ని తగ్గించి, ఫోన్‌లో ప్రస్తుత లొకేషన్‌ను అర్జున్‌కి పంపించి మళ్లీ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టాడు.
***
మీటింగ్‌లో ఉన్న అర్జున్ ఫోన్‌కి మెసేజ్ రావడంతో ఆతృతగా చూశాడు.
పీఏ నుంచి అప్‌డేట్ రావడంతో తెలియకుండానే పెదాలపై చిరునవ్వు చేరింది అర్జున్‌కి.
***
యూనివర్సిటీలోకి కారును పోనించాడు రామకృష్ణ.
యూనివర్సిటీ రిచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసి మరోసారి మంత్రముగ్ధుడయ్యాడు అజయ్!
రామకృష్ణ కారు పార్కింగ్ చేసి అజయ్‌తో పాటే ముందుకు నడుస్తున్నాడు.
యూనివర్సిటీ అంతా చూస్తున్న అజయ్, ‘విజ్జుకి మంచి యూనివర్సిటీలోనే సీటు ఇప్పించాడు!’ అనుకుంటూ నడుస్తున్నాడు.
కొన్ని నిమిషాలు నడిచిన తర్వాత ఆఫీస్ రూమ్‌లోకి వెళ్తున్న అజయ్, అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయి అలానే ఉండిపోయాడు.
రామకృష్ణకి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. కాసేపటికి తేరుకుని అర్జున్ పక్కనే నిల్చున్నాడు.
యూనివర్సిటీ హెడ్‌తో మాట్లాడుతున్న అర్జున్, ఆగిపోయిన అజయ్‌ని గమనించి…
“రా అజయ్! చెప్పాను కదా సార్, అజయ్ ఇతనే. ఇతని బ్రదర్ మన యూనివర్సిటీలోనే చదువుతున్నాడు!” అంటూ పరిచయం చేశాడు అర్జున్.
“విజయ్ వాళ్ల బ్రదరా! రండి సార్!” అన్నాడు హెడ్.
అజయ్ తేరుకున్నాడు.
‘అయినా అర్జున్ ఇక్కడికి రాకపోతేనే ఆశ్చర్యంగా అనిపించాలి. వచ్చినప్పుడు ఎందుకు ఆశ్చర్యపడటం?’ అనుకుని…
“నమస్కారం సార్!” అంటూ కుర్చీలో కూర్చున్నాడు.
“అజయ్ సార్! అర్జున్ సార్ అన్నీ చెప్పారు. ఇక నుంచి ఫీజు కట్టడానికి మీరు రావాల్సిన అవసరం లేదు. అర్జున్ సారే అన్నీ చూసుకుంటారు!” అన్నాడు నింపాదిగా హెడ్.
అజయ్ ఇబ్బందిగా నవ్వి ఊరుకున్నాడు.
“మనకి బాగా కావాల్సిన వాళ్లు సార్! విజయ్ మీద స్పెషల్ కేర్ తీసుకోండి ఇక నుంచి. విజయ్‌కి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి!” అన్నాడు బాస్ వాయిస్‌తో అర్జున్.
“కచ్చితంగా సార్! స్పెషల్ కేర్ గురించి మీరు మరీ చెప్పాలా సార్!” అన్నాడు నవ్వుతూ హెడ్.
నవ్వాడు అర్జున్.
“ఓకే సార్!” అంటూ అర్జున్ లేవగానే అజయ్ కూడా లేచాడు.
ఫీజు కట్టేసి ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చేశారు.
“అజయ్ సార్! విజయ్ గారి క్లాస్ నంబర్…” అంటూ చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ చెప్పబోయాడు రామకృష్ణ.
“వద్దులే! విజ్జు ఇక్కడికే వస్తున్నాడు!” అని చెప్పి తనకు ఎదురుగా ఉత్సాహంగా వస్తున్న విజ్జుని చూపించాడు అజయ్.
తలెత్తి చూశాడు అర్జున్.
“హాయ్ అన్నయ్యా!” అంటూ ఎదురుగా వస్తున్న అజయ్‌ని చూసి పలకరించాడు విజ్జు.
“హాయ్ రా! ఎలా ఉన్నావ్?” అని బాగోగులు అడిగాడు అజయ్.
“ఇదిగో… ఇలానే ఉన్నాను అన్నయ్యా!” అన్నాడు నవ్వుతూ.
నవ్వాడు అజయ్.
చిన్నపిల్లాడిలా అజయ్ చేతులు పట్టుకుని ఊపుతున్నాడు విజ్జు. ఇంకా పసితనాన్ని వెంటపెట్టుకుని తిరుగుతున్న విజ్జుని చూసి నవ్వుకున్నాడు అజయ్.
“బాగా తింటున్నావా విజ్జు?” అని కుశలం అడిగాడు.
“మ్! తింటున్నాను అన్నయ్యా! ఫీజు మొత్తం కట్టేశావా?” అన్నాడు విజ్జు.
“హా! మొత్తం కట్టేశాను. సో… నువ్వింకా చదువుకోవడమే బ్యాలెన్స్!” అన్నాడు అజయ్ తమ్ముడి తలమీద ప్రేమగా చేయి వేస్తూ.
“అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావ్ అన్నయ్యా?” అని అడిగాడు అర్థంకాక.
ఓ క్షణం ఆలోచించి, “అది… అది… మా బాస్ ఇచ్చారులే!” అన్నాడు తడబడుతూ.
“మీ బాస్ రియల్లీ గ్రేట్ అన్నయ్యా! వర్కర్స్‌ని కూడా ఫ్యామిలీలా చూసుకుంటున్నారు!” అన్నాడు మెచ్చుకోలుగా విజ్జు.
విజ్జు మాటలకు గర్వంగా చూశాడు అర్జున్.
‘అసలు విషయం తెలిస్తే ఇలా అనేవాడివా రా నువ్వు?’ అనుకున్నాడు అజయ్.
నిస్సహాయంగా నవ్వుతూ…
‘ఎదుటివాళ్ల కష్టాలను అలుసుగా తీసుకుని, తమ అవసరాలను తీర్చుకునేందుకు అగ్రిమెంట్ పత్రాలపై సంతకం చేయమని ఇచ్చినప్పుడు… మంటల్లో కాలిపోబోతున్న తన జీవితం కంటే, తన తమ్ముడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మాత్రమే ఆలోచించాడు.
కళ్లముందు కన్నీళ్లు కాదు… తన తమ్ముడి జీవితమే కనిపించేసరికి మౌనంగా సంతకం చేసేశాడు అజయ్!’
ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ…
‘నీ జీవితం నీకు నచ్చినట్టు బతకడానికి నా జీవితాన్ని దన్నుగా పెట్టానులే!’ అనుకున్నాడు.
అమాయకంగా చూస్తున్న విజ్జుని దగ్గరగా తీసుకున్నాడు అజయ్.
అన్నయ్య తనని దగ్గరగా తీసుకోవడంతో ఇంకేమీ మాట్లాడలేదు విజ్జు.
ఒక్కొక్కసారి మౌనం కూడా చాలా మాట్లాడుతుంది అనుకున్నాడు విజ్జు.
తన తమ్ముడి మాటలకు అజయ్ ఏం సమాధానం చెప్తాడా అన్నట్టుగా చూస్తున్నాడు అర్జున్.
సమాధానం చెప్పకుండా విజ్జుని సైడ్ హగ్ చేసుకున్న అజయ్‌ని చూస్తూనే ఉన్నాడు.
వారిద్దరినీ చూస్తుంటే సోదరుల బంధమే మాటలు నేర్చుకుని తనకు ఆ బంధం విలువను చెప్పేలా ఉందని అనుకోకుండా ఉండలేకపోయాడు అర్జున్.
స్కూల్ నుంచి వచ్చిన పదిహేనేళ్ల అర్జున్…
“అన్నయ్యా! అన్నయ్యా!” అంటూ ఓ రూమ్‌లోకి వెళ్లాడు.
అక్కడ తననే కోపంగా చూస్తున్న ఓ టీనేజ్ వ్యక్తి కనిపించాడు.
“నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా రూమ్‌లోకి రావద్దని!” అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆ వ్యక్తి.
అర్జున్ చేయి పట్టుకుని బయటకు గెంటేశాడు.
“బయటకు పో!” అంటూ తలుపు మూసేశాడు.
“తలుపు తియ్యి అన్నయ్యా! నీకో విషయం చెప్పాలి అన్నయ్యా! నాకు భయంగా ఉంది… అన్నయ్యా!” అంటూ తలుపును బాదుతున్న అర్జున్‌ని ఏమాత్రం కనికరించలేదు ఆ వ్యక్తి.
కళ్లముందు కనిపిస్తున్న ఆ గతాన్ని, తడిబారిన కళ్లతో మరోసారి గుర్తుచేసుకున్నాడు అర్జున్.
ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
రామకృష్ణ కూడా అర్జున్‌తో పాటే వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఉదయం “సార్‌తో పాటే ఉండు!” అని తనతో చెప్పిన విషయం గుర్తొచ్చి అక్కడే ఆగిపోయాడు.
“అన్నయ్యా!” అని పిలిచాడు విజ్జు.
“ఇతను ఎవరు?” అని అడిగాడు. తను వచ్చినప్పటి నుంచి వారిద్దరినే గమనిస్తున్న రామకృష్ణ వైపు చూస్తూ.
విజ్జు నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని ఊహించని అజయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
కంటిన్యూ ఉంది…
Swipe left/right or tap the sides to turn pages