“అది… అది… మీకు నేను చదువుకోవడం ఎందుకు ఇష్టం లేదు?” అడిగింది వైదేహి భయంగా.
ఆ మాటకి ఒక్కసారిగా విక్కీ ఫేస్‌లో ఉన్న నవ్వు మాయమైపోయింది.
విక్కీ ఏం చెప్తాడో, లేదంటే కోపం పడతాడేమో అని భయంతో కళ్లను గట్టిగా మూసేసుకుంది వైదేహి.
“ఇప్పుడు నేనేమైనా చేతకాని వాడిని అని నువ్వు అనుకుంటున్నావా వైదేహి? నేను రెండు చేతులా సంపాదిస్తున్నాను. నువ్వు మళ్లీ చదువుకొని ఇవన్నీ చేయడం ఎందుకు? అయినా ఇప్పుడు నువ్వు ఎందుకు చదువుకోవాలి అనుకుంటున్నావ్?” అడిగాడు విక్కీ.
“అంటే నాకు చదువుకోవడం ఇష్టం,” అంది వైదేహి.
“ఇదిగో, ఎవడైనా ఎందుకు చదువుకుంటాడు? ఉద్యోగం చేయడం కోసం చదువుకుంటాడు. కానీ నేను ఇక్కడ రెండు చేతులా సంపాదిస్తున్నాను. పోనీ, నీ చదువు ఏమైనా ఒకటి రెండు సంవత్సరాలతో ఆగిపోతుందా? అసలు ఆగదు. టెన్త్, ఇంకా నువ్వు ఇది అయిన తర్వాత ఇంటర్, డిగ్రీ… ఇలా చాలా ఉంటుంది. అంతకాలం మనం దూరంగా ఉండాలి అంటే నా వల్ల కాదు. అంతకాలం పిల్లలు పుట్టకుండా ఉండాలి అంటే అందరూ నన్ను చేతకానివాడు అనుకుంటారు. నాకు అలాంటి ఒక ట్యాగ్‌లైన్ వద్దు వైదేహి,” అన్నాడు విక్కీ.