స్వయంసిద్ధ – 15వ భాగం
సాయంత్రం అయిదు గంటల సమయంలో ప్రజావాణి డిజిటల్ కార్యాలయంలో తన కంప్యూటర్ ముందు కూర్చున్న జాహ్నవి, సౌమ్య కేసుకు సంబంధించిన వివరాలను మరోసారి పరిశీలిస్తోంది.
ఆమె ముందు ఒకవైపు పోలీస్ కేసు ఫైల్, మరో వైపు సౌమ్య కుటుంబం ఇచ్చిన పత్రాలు, ఇంకోవైపు స్వప్న చెప్పిన వివరాలు ఉన్నాయి.
ఇప్పటివరకు ఆమెకు తెలిసిన విషయాలన్నింటినీ ఒక క్రమంలో పెట్టుకుంటోంది.
సౌమ్య కనిపించకుండా పోవడం, కుటుంబం ఫిర్యాదు చేయడం, పోలీసులు విచారణ జరపడం, కొంత కాలానికి ఆమె మృతదేహం లభించడం, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రమాదవశాత్తు మరణించినట్లు నిర్ధారించి కేసును ముగించారు.
కానీ సౌమ్యను ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టిన ప్రశాంత్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అప్పుడే జాహ్నవి ఫోన్ కి ఒక ఫోటో వచ్చింది! ఆ తరువాత స్వప్న నుండి కాల్ వచ్చింది!
“హలో స్వప్న!”
“మీకు నేను ప్రశాంత్ ఫోటో పంపించాను!”
“అతని గురించి ఇంకేమైనా తెలుసా?”
“అతనితో నాకు పెద్దగా పరిచయం లేదు. ఆ ఫోటో కూడా ఒకప్పుడు సౌమ్య నాకు పంపింది ఆ అబ్బాయి ప్రపోస్ చేసినప్పుడు!”
“అతని స్నేహితులు ఎవరైనా మీకు తెలుసా?”