లక్ష్మీ తల్లి దండ్రులు ఎదురు తిరిగి మాట్లాడేసరికి.. రాము వాళ్ళ అమ్మ శాపనార్ధాలు, శోఖాండలు పెడుతూ.. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళు అంతా సంతోషంతో ఊపిరి తీసుకున్నారు. ఆ బుడ్డాగాడి ఊసులతో అందరూ రాము వాళ్ళ అమ్మ మాటలను పట్టించుకునే స్థితిలో లేరు..
***
మన బుడ్డాగాడు అందరితో సంతోషంగా ఉండటమే కాకుండా.. ఎవరు ఏది తినమని ఇచ్చినా కూడా తీసుకుని.. “మా చెల్లికి ఏది?” అని అడిగేవాడు.
“ఓరి బడవా! నీకు ఇచ్చిందే కాకుండా ఇప్పటి నుంచే నీ చెల్లి కి కూడా వాటా అడిగేస్తున్నావ్ రా!“ అని ఇంట్లో వాళ్ళు నవ్వుతూ అంటే..
వీడు బుంగమూతి పెట్టుకుంటూ.. “మరి మా అమ్మకో.. ఇంకా మా నాన్నాకో..” అని అడుగుతూ వాడి బుల్లి బుల్లి చేతులు చూపిస్తూ అడిగేవాడు.
అలా ఆ బుడ్డాగాడు తన చిలిపి మాటలతో… అటు నుంచి ఇటు తిరుగుతూ ఇంట్లో అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. ఇంట్లో చిన్నపాప ముద్దు నవ్వులు ఒకవైపు… ఈ బుడ్డాగాడి అల్లరి మాటలు మరోవైపు… ఇళ్ళంతా ఆనందంతో నిండిపోయింది.