సీత దుర్గ ను, వాళ్ళ అమ్మమ్మ ను తల్లిగా అనుకుని అమాయకంగా ఉంటున్న సమయంలో పక్కింటి నుంచి విషం చిమ్మడంతో తనలో కొత్త కొత్త అనుమానాలు కలిగి వాళ్ళ అమ్మమ్మను అడిగి ఏడ్చింది ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి తనకంత అర్థమయ్యేలా చెప్పేసరికి చివరగా తన అడిగిన ప్రశ్నకి అందరితోపాటు దుర్గ కూడా షాక్ అయింది.
***
దుర్గ చెప్పింది అంతా విన్న తర్వాత సీత నవ్వుతూ ఆమె గట్టిగా కౌగిలించుకుంది. కాసేపటి తర్వాత..
“మరి నీకు అక్కలు, చెల్లెళ్లు అన్నావు కదా వాళ్ళందరూ నాకేమవుతారు? ఇంకా అన్నయ్యలు అని చెప్తున్నావ్ వాళ్ళు ఎవరు? నీకు నేను ఒక్కదాన్నేనా ఇంకెవరూ లేరా?” అని అడిగింది సీత.
“నాకు అక్కలు అంటే నీకు పెద్దమ్మ అన్నమాట.. ఎవరికైనా ఒక్కరే ఉంటారు అమ్మ.. నీకైతే నాతో పాటుగా అమ్మమ్మ కూడా అమ్మయింది ఇంకా ఐదుగురు అమ్మలు ఉన్నారు. ఇంకా ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు, మొన్న పుట్టింది చూడు చెల్లి.. బుల్లి చెల్లి ఉన్నారు కదా ఇంకెవరు లేకుండా ఏంటి? అయినా ఇప్పటి వరకు వాళ్ళని ఎలా పిలిచావు?!” అని అడిగింది దుర్గ.
“వాళ్లందరూ ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరమ్మా అంటే అమ్మని పిలువని చెప్పావు కదా! అప్పటి నుంచి అమ్మ అనే పిలుస్తున్నాను. వారం కి ఒక అమ్మ వస్తది, ఒక్కోసారి నలుగురు కలిసి వస్తారు.. ఇంకోసారి ఇద్దరూ వస్తారు.. వచ్చినప్పుడు కూడా ఎవరో ఒక అన్నయ్య, తమ్ముడు కూడా వస్తారు అన్నయ్యలు అయితే నాకు డబ్బులు కూడా ఇస్తారు తెలుసా!” అంటూ చాలా అమాయకంగా చెప్పింది సీత.