New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
చిత్రలేఖ – 2

చిత్రలేఖ – 2

అంతేకాదు బామ్మ… చివర్లో ఒక అడ్రస్ కూడా చెప్పింది. ఆ తర్వాత నేను ఏదో అడగాలని తనని పిలుస్తుంటే… ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.”

 

అంటూ చెప్పడం ముగించి బామ్మ వైపు చూసింది చిత్ర.

 

ఆమె మాటలు విన్న బామ్మ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. చేతిలో ఉన్న ఉత్తరాన్ని మరోసారి చూసి, ఆ తర్వాత చిత్ర వైపు చూసింది.

 

“సరే… నువ్వు రాసిన ఈ ఉత్తరాన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించు. తర్వాత వాళ్ళ నుంచి వచ్చే స్పందనను బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం” అంది బామ్మ.

 

బామ్మ మాటలకు చిత్ర కాసేపు ఆలోచనలో పడింది.

 

“అలాగే బామ్మా… రేపు ఉదయమే ఈ లెటర్ పోస్ట్ చేస్తాను” అంటూ చిన్నగా నవ్వి బెడ్ వైపు నడిచింది.

 

అప్పటికే నిద్ర కళ్ళను కమ్మేస్తోంది. బెడ్‌పై పడుకున్న చిత్ర, జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది.

 

కానీ బామ్మకు మాత్రం నిద్ర రావడం లేదు.

 

చిత్ర ముఖంలో కనిపించిన ఆందోళన, ఆమె రాసిన ఉత్తరంలోని మాటలు… అన్నీ గుర్తొస్తున్నాయి.

 

చేతిలో ఉన్న పేపర్‌ను మడిచి పక్కన పెట్టింది.

 

మనవరాలి వైపు చూస్తూ గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది.

 

అది సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం…

 

ఒక్కరోజు రోజు…

 

విజయేంద్ర గారి ఇంటికి ఒక స్వామీజీ వారు వచ్చారు.

 

ఎప్పటినుంచో ఆ కుటుంబానికి సంబంధించిన మంచి చెడులను చూస్తూ, కుటుంబ సభ్యులకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవారు ఆయన.

 

అలాంటి వ్యక్తి ఎలాంటి సమాచారం లేకుండా, అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు.

 

ఇంటి పెద్దలైన విజయేంద్ర, రుక్మిణి దంపతులతో పాటు సులోచన, రాజీవ్ కూడా ఆయన రాకకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచనలో పడ్డారు.

 

సాధారణంగా ఏదైనా విషయం ఉంటే ముందుగానే కబురు పంపించే స్వామీజీ వారు, ఈసారి మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా రావడం అందరిలోనూ కొంత ఆందోళన కలిగించింది.

 

ఆయన వచ్చిన కాసేపటికే ఇంటి పెద్దలంతా కలిసి ఆ ఇంట్లోని ఒక ప్రత్యేకమైన గదిలోకి వెళ్లారు. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి ఎప్పుడూ ఆ గదినే ఉపయోగించేవారు.

 

స్వామీజీ వారు ఆసీనులైన తర్వాత మిగతావారంతా ఆయన ఎదురుగా కూర్చున్నారు.

 

అయితే అక్కడున్న ఎవరికీ ఆయన ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు.

 

ఆయన ముఖంలో కనిపిస్తున్న గంభీరత చూస్తుంటే ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది.

 

అందరిలోనూ ఒకటే ఆలోచన…

 

అసలు స్వామీజీ వారు ఇంత హడావుడిగా రావడానికి కారణం ఏమిటి?

 

కొద్దిసేపు గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

 

చివరికి ఆ మౌనాన్ని ఛేదిస్తూ విజయేంద్ర గారే ముందుగా మాట్లాడారు.

 

“స్వామీజీ… మీరు ఇలా ఉన్నపళంగా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా?” అని అడిగారు.

 

ఆయన ప్రశ్నకు స్వామీజీ వారు ఒక్కసారి అందరి ముఖాల వైపు చూశారు.

 

“మీ అమ్మాయి చిత్ర గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయడానికి వచ్చాను” అన్నారు.

 

చిత్ర పేరు వినగానే అక్కడున్న వారందరి ముఖాల్లోనూ ఒక్కసారిగా మార్పు వచ్చింది.

 

సులోచన అయితే కంగారుగా ముందుకు జరిగి,

 

“చిత్ర గురించా స్వామీజీ? తనకేమైనా ప్రమాదమా?” అని ఆందోళనగా అడిగింది.

 

ఆమె మాటలకు స్వామీజీ వారు చిన్నగా నవ్వారు.

 

“అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మా. మీ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ తన జాతకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలి.”

 

అంటూ కాసేపు ఆగారు.

 

అక్కడున్న వారందరూ ఆయన చెప్పబోయే విషయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

“మీ అమ్మాయికి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు. తన ఇరవై ఒకటవ పుట్టినరోజు తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.”

 

ఆ మాటలకు అందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

 

“అదేంటి స్వామీజీ?” అని రాజీవ్ అడిగాడు.

 

“ఆ పౌర్ణమి నుంచి చిత్రకు తన కలల్లో ఆత్మలు కనిపించడం మొదలవుతుంది. చనిపోయిన కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులకు తెలియజేయలేకపోయిన రహస్యాలను, వారు తెలుసుకోవాల్సిన నిజాలను చిత్ర ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తారు.”

 

ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.

 

స్వామీజీ వారు మాత్రం తన మాటలను కొనసాగించారు.

 

“ఆ ఆత్మలు చెప్పే విషయాలను చిత్ర శ్రద్ధగా వినాలి. వారు చెప్పే సందేశాలను ఉత్తరాల రూపంలో రాసి, సంబంధిత వ్యక్తుల కుటుంబాలకు పంపించాలి.

 

అలా ఒక్కో ఉత్తరం ద్వారా కొన్ని కుటుంబాలకు తెలియని నిజాలు తెలుస్తాయి. కొన్ని జీవితాల్లో ఎదురుచూస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.

 

ఇది తనకు అప్పగించబడిన ఒక బాధ్యత.

 

కానీ ఈ విషయం గురించి మీరెవ్వరూ చిత్రను భయపెట్టకూడదు. తనకు ఆ సమయం వచ్చినప్పుడు తనకే అర్థమవుతుంది.”

 

అంటూ చెప్పడం ముగించారు.

 

ఆయన మాటలు విన్న కుటుంబ సభ్యులంతా ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

 

వారి మనసుల్లో ఎన్నో ప్రశ్నలు…

 

అసలు చనిపోయిన వ్యక్తులు చిత్రకే ఎందుకు కనిపించాలి?

 

వాళ్ళు చెప్పాలనుకునే రహస్యాలు ఏమిటి?

 

ఆ ఉత్తరాలు అందుకున్న కుటుంబాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి?

 

అన్నింటికంటే ముఖ్యంగా…

 

ఇదంతా చిత్ర జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్లబోతోంది?

 

ఇంకా ఉంది….

 

మీ నందు ❤️