New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
చిత్రగుప్త – 3

చిత్రగుప్త – 3

మూడవ భాగం :

 

ఉదయం చేపలు పట్టే వాళ్ళకు ఒక అమ్మాయి శవం చెరువు గట్టున కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫాం చేస్తారు!

 

చెరువు గట్టుకి వచ్చిన ఎస్. ఐ రత్నం ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకొమ్మని కానిస్టేబుల్ భద్రం కి చెప్పి స్టేషన్ కి బయలుదేరుతాడు!

 

చెరువు గట్టు నుండి జీబ్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ముప్పై నిమిషాలు పట్టింది!

 

ఆగిన జీబ్ నుండి క్రిందకు దిగాడు ఎస్. ఐ రత్నం! అతను దిగి లోపలకు వెళ్లేసరికి ఇద్దరు భార్యా భర్తలు ఎస్. ఐ చైర్ కి ముందు భాగం లో ఉన్న రెండు చైర్స్ లో కూర్చొని ఉన్నారు!

 

“ సర్! వాళ్ళ అమ్మాయి కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు! “ అంటూ లోపలకు వస్తూనే రత్నం తో అన్నాడు మరొక కానిస్టేబుల్!

 

ఆ మాటలు వినగానే హడావిడీ గా తన చైర్ దగ్గరకు వేగంగా నడుస్తూ వెళ్ళాడు రత్నం!

 

“ మీ అమ్మాయి కనబడడం లేదా ? “ వాళ్ళ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు రత్నం!

 

“ అవునండి! “ అంటూ చైర్ నుండి లేచాడు అతను!

 

“ ఎంత వయసు ఉంటుంది ? “

 

“ ఇరవై ఒక్క సంవత్సరాలు! ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది! “ అంటూ తన భార్య ని బాధగా చూసాడు అతను.

 

“ మీ అమ్మాయిని చివరి సారిగా ఎప్పుడు చూసారు ? “

 

“ నిన్న సాయంత్రం! ఇంట్లోనే! మేము అత్యవసర పరిస్థితులలో వేరే ఊరికి వెళ్లి, ఉదయం వచ్చేసరికి తన రూమ్ అంతా చిందరవందరగా ఉంది! ఇంటి బయట కొందరిని అడిగితే చూడలేదు అన్నారు! అందుకని భయంతో కంప్లేంట్ ఇవ్వడానికి వచ్చాము సర్! “

 

“ అయితే మీరు నాతో ఒక చోటుకి రావాలి! “ అంటూ రత్నం అనగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ఆ భార్యాభర్తలు!

 

ప్రభుత్వ ఆసుపత్రి ముందర ఒక జీబ్ ఆగింది! ఆ జీబ్ నుండి క్రిందకు దిగాడు రత్నం! ఆ జీబ్ పక్కనే ఒక సుజికీ బైక్ ఆగింది! ఆ బైక్ పై నుండి క్రిందకు దిగారు ఆ భార్యా భర్తలిద్దరు!

 

“ ఇక్కడకు తీసుకొచ్చారు ఏంటి సర్! “ భయంగా అంది ఆమె!

 

“ చెబుతాను పదండి! “ అంటూ వాళ్ళిద్దరిని మార్చురీ గది వైపుగా తీసుకెళ్ళాడు! ఆ గది బయట ఉన్న మార్చురీ బోర్డు చూడగానే వాళ్ల ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

 

“ సర్! ఏమైంది సర్! మార్చురీ దగ్గరకు తీసుకొచ్చారు! “ గుండె వేగాన్ని పెంచుకుని అన్నాడు అతను!

 

అప్పుడే ఆ మార్చురీ నుండి బయటకు వచ్చాడు భద్రం!

 

“ సర్! పోస్ట్ మార్టం ప్రాసెస్ ని స్టార్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది అంటున్నారు! “ అంటూ అక్కడ ఉన్న ఇద్దరిని చూసాడు భద్రం!

 

“ భద్రం! వీళ్ళను తీసుకెళ్ళి బాడీ ని చూయించు! “

 

“ అలాగే సర్! రండి! “ అంటూ భద్రం ఆ గది వైపుగా నడిచారు! రత్నం మాత్రం మార్చురీ బయట నిలబడి జేబులో నుండి సిగరెట్ ప్యాకెట్ తీసి, అందులో ఉన్న ఒకే ఒక్క సిగరెట్ ని నోటిలో ఉంచుకొని వెలిగించాడు!

 

అతని నోటి నుండి పొగ, ఆ గది నుండి వారిద్దరి ఏడుపులు ఒకేసారి బయటకు వచ్చాయి!

 

“ హారికా! అమ్మా హారికా! “ విలపిస్తున్న ఆ తల్లి కేకలు వింటూ చేతిలో ఉన్న సిగరెట్ ని క్రిందకు వేసి, షూ తో నలిపేసాడు రత్నం!

 

ఆ కేసుని ఆత్మహత్య గా నమోదు చేసిన రత్నం, ఆమె ఇంటికి వెళ్ళి తన గదిని చూసాడు!

 

చెల్లాచెదురుగా ఉన్న పేపర్స్, విరిగిన సెల్ ఫోన్, ఫోటో ఆల్బం మరియు అద్దం! ఆ గది చూస్తూనే అనుమానంగా ఆమె తల్లి దండ్రుల వైపుగా చూసాడు రత్నం!

 

“ ఏంటి ఇదంతా! మీ అమ్మాయి ఆత్మహత్య వెనక మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా ? “

 

“ లేవు సర్! మా అమ్మాయి మానసిక స్థితి కొన్ని రోజుల నుండి బాలేదు! మాకు కూడా కోపం తెప్పించే పనులు చేసింది! తిట్టాము కూడా! అవన్నీ మనసులో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది! ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు సర్! “ బాధగా అన్నాడు అతను.

 

“ మీ అమ్మాయి మానసిక స్థితి బాలేదు అంటున్నారు! అలాంటిది రాత్రి ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళారు ? “

 

“ మా అన్నయ్య కూతురు కి ఆక్సిడెంట్ అయింది సర్! హాస్పిటల్ లో ఉందని చూసి రావడానికి వెళ్ళాము! “ అంది అతని భార్య!

 

“ ఈ కేసుపై దర్యాప్తు చేయాలంటే మీరు కంప్లేంట్ ఇవ్వాలి! చేయమంటే చేస్తాను! “

 

“ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకునే మంచి విషయాలు మా కూతురు చేయలేదు సర్! ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి! “ అన్నాడు అతను.

 

వాళ్ళ మాటలు విని ఆ ఇంటి నుండి బయటకు వచ్చారు రత్నం మరియు కానిస్టేబుల్ భద్రం!

 

“ నాకెందుకో వీళ్ళ ప్రవర్తన అనుమానంగా ఉంది! కూతురు చనిపోయింది! కాని వీళ్ళు మాట వరసకు కూడా కంప్లేంట్ ఇస్తాము అని, ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలని కాని ప్రయత్నం చేయడం లేదు! “

 

“ ఆ బ్రిడ్జ్ నుండి వాళ్ళ కూతురుని వీళ్ళే తోసేసి ఉంటారు అనుకుంటున్నారా సర్! “ అనుమానంగా అడిగాడు భద్రం!

 

“ ఏమో భద్రం! వీళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో ముందు తెలియాలి! అదేదో ఆక్సిడెంట్ హాస్పిటల్ అన్నారు కదా! దాని సంగతి చూడు! నాకు వీళ్ళ గురించి, ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు కావాలి! “

 

“ అలాగే సర్! “

 

“ అక్కడ బ్రిడ్జ్ కి దూరం లో ఏమైనా సి సి కెమరాలు ఉన్నాయా ? “

 

“ కనుక్కుంటాను సర్! “

 

“ ఫూటేజ్ చూస్తే మనం కన్ఫర్మేషన్ వస్తుంది!  “ అంటూ రత్నం అనాగానే సరే అంటూ తలూపాడు భద్రం!

 

సరిగ్గా ఇరవై గంటల తరువాత ఒక పేపర్ పట్టుకొని వచ్చాడు భద్రం! ఆ సమయంలో తన చైర్ లో కూర్చొని ఫైల్ చూస్తున్నాడు ఎస్. ఐ రత్నం!

 

“ సర్! ఇదిగోండి పోస్ట్ మార్టం రిపోర్ట్! “ అంటూ ఇచ్చాడు భద్రం! ఆ పేపర్ తీసుకొని చూసాడు రత్నం!

 

“ టైం ఆఫ్ డెత్ పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు! నీటిలో మునిగిపోవడం వలన చనిపోయింది! చనిపోయే ముందు చాలా స్ట్రెస్ కి లోన్ అయినట్టుగా ఉంది! గాయపడినట్టుగా ఎలాంటి గుర్తులు లేవు! సో, చావుకు కారణం నీటిలో దూకడమే! “

 

“ అవును సర్! “

 

“ ఆమె పేరెంట్స్ గురించి కనుక్కొమ్మని చెప్పాను కదా! “

 

“ కనుక్కున్నాను సర్! వాళ్ళు చెప్పింది నిజమే! వాళ్ళు హాస్పిటల్ కి ఈవెనింగ్ వెళ్లి, నిన్న మనకు బాడీ దొరికిన సమయానికి వచ్చారు! ఇంట్లో జరిగిన సిచువేషన్స్ చూసి భయంతో స్టేషన్ కి వచ్చారు! “

 

“ సో! వాళ్లకు ఈ కేసు కి సంబంధం లేదు! కాని నీటిలోకి ఆమెనే దూకిందా లేక ఎవరైనా తోసారా అన్నది కన్ఫాం అవ్వాలి ? “ ఆలోచిస్తున్నాడు రత్నం!

 

“ ఆ కన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చాను సర్! “ అంటూ ఒక మెమొరీ కార్డ్ ని ఇచ్చాడు భద్రం!

 

“ ఏంటి ఇది ? “

 

“ ఆ బ్రిడ్జ్ కి కొద్ది దూరంలో ఒక డిష్ కేబుల్ నెట్వర్క్ షాప్ ముందు ఉన్న సి సి టీవి ఫూటేజ్! “ అంటూ భద్రం అనగానే ఆ మెమొరీ కార్డ్ ని తన ఫోన్ లో వేసి ప్లే చేసాడు రత్నం!

 

చీకటిగా ఉన్న ప్రాంతంలో వర్షం వేగంగా పడుతుంది! బ్రిడ్జ్ కి అమర్చబడి ఉన్న లైట్ వెలుగులలో పరిగెత్తుకుంటూ వచ్చి ఆగింది హారిక!

 

అయిదు నిమిషాలు బ్రిడ్జ్ నుండి క్రిందకు చూస్తూ, ఆ నీటిలో దూకేసింది!

 

ఆ ఫూటేజ్ చూసిన తరువాత తన ఫోన్ ని టేబుల్ పైన పెట్టాడు రత్నం!

 

“ భద్రం! “ నెమ్మదిగా అన్నాడు రత్నం!

 

“ చెప్పండి సర్! “

 

“ ఇట్స్ ఏ నీట్ సూసైడ్! ఎలాంటి అనుమానాలు లేవు! మిస్సింగ్ కంప్లేంట్ లో సూసైడ్ అని ఫైల్ క్లోస్ చేసి రిపోర్ట్ ని సబ్మిట్ చేసేద్దాం! “ అంటూ అన్నాడు రత్నం!

 

ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి చావుకు గల కారణం ఏంటి ?

తరువాయి భాగం లో చదవండి!

 

“ చిత్రగుప్త! “ అనే ధారావాహిక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రాస్తున్నాను! ఈ కథ చదివిన తరువాత మీ అభిప్రాయాలను సమీక్షల రూపం లో తెలియజెయ్యండి! ధన్యవాదాలు!

– మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹‘