రోబోట్రాన్ – 5
005 రోబోట్రాన్
సాయంత్రపు సూర్యుడు పడమటి కొండల వెనుకకు జారుతున్నాడు. ఆకాశమంతా బంగారు, నారింజ రంగుల మేళవింపుతో కళకళలాడుతోంది. ఊరి చివర ఉన్న పెద్ద చెరువు గట్టు మీద, ఒక పురాతన మర్రి చెట్టు నీడన కూర్చొని ఉన్నాడు విశ్వాస్.
చెరువు నీళ్లపై వీస్తున్న చల్లని గాలి, పక్షుల కిలకిలరావాల మధ్య ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ విశ్వాస్ మనసులో మాత్రం సునామీ చెలరేగుతోంది. అతని కళ్లు, చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై అతుక్కుపోయి ఉన్నాయి.
అక్కడ జరుగుతున్నది సాధారణ క్రికెట్ మ్యాచ్ కాదు. అది దాయాదుల పోరు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్.
మ్యాచ్ చివరి ఓవర్, నరాలు తెగే ఉత్కంఠతో సాగుతోంది. భారత్ విజయానికి ఇంకా 12 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, భారత్ చేతిలో ఉన్నది కేవలం 4 బంతులు మాత్రమే.
అప్పటికే భారత్ 6 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. కోట్లాది మంది భారతీయుల ఆశలన్నీ క్రీజులో ఉన్న ఒకే ఒక్కడిపై నిలిచాయి. ఆయనే మన అందరి ఆరాధ్య దైవం, ఒత్తిడిని సైతం చిరునవ్వుతో జయించే మహేంద్ర సింగ్ ధోని.
విశ్వాస్ ఊపిరి బిగపట్టి ఫోన్ వైపు చూస్తున్నాడు. నుదుటిపై సన్నని చెమట బిందువులు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ పరుగులు తీస్తూ వచ్చి, గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఒక అద్భుతమైన యార్కర్ విసిరాడు.
బంతి నేరుగా కాలి బొటనవేలిని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చింది. ధోని అత్యంత చాకచక్యంగా, సింపుల్‌గా పక్కకు జరిగాడు. బ్యాట్‌కు తగలని బంతిని పాక్ వికెట్ కీపర్ ఒడిసిపట్టుకున్నాడు.
డాట్ బాల్. నో రన్.
సమీకరణం మరింత కఠినంగా మారింది. 3 బంతులు… 12 పరుగులు.
స్టేడియంలో ఉన్న లక్షలాది మంది ప్రేక్షకులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తున్న కోట్లాది మంది అభిమానుల రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగిపోయింది. గుండె వేగం రెట్టింపైంది.
అందరూ తమ టీవీ, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయి చూస్తున్నారు. కానీ, క్రీజులో ఉన్న ధోని మాత్రం ఏమాత్రం తొణకకుండా, ఎంతో కూల్‌గా ఉన్నాడు. హెల్మెట్ సవరించుకుంటూ, తన బ్యాట్‌ను నేలపై తడుతూ బౌలర్ కళ్లలోకి సూటిగా చూస్తున్నాడు.
ఇలాంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా హిమాలయ పర్వతంలా ప్రశాంతంగా ఉండటమే ధోని ప్రత్యేకత. అందుకే ప్రపంచం ఆయన్ని “మిస్టర్ కూల్” అని పిలుస్తుంది.
తదుపరి బంతి… పాక్ బౌలర్ విసిరిన బంతి కాస్త షార్ట్ పిచ్ అయింది. అదే తడవుగా ధోని ఒక్కసారిగా జూలు విదిల్చాడు. తన ఆరడుగుల కండరాల బలాన్నంతా కూడగట్టుకుని, తనదైన శైలిలో ‘హెలికాప్టర్ షాట్’ ఆడాడు.
రెప్ప మూసి తెరిచేలోపు ఆ బంతి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లి, బౌండరీ లైన్ దాటి, ప్రేక్షకుల గ్యాలరీలో పడింది.
భారీ సిక్సర్.
స్టేడియం మొత్తం “ధోని… ధోని…” అనే నినాదాలతో దద్దరిల్లిపోయింది. భారత్ అభిమానులు ఆనందంతో, ఉత్సాహంతో ఊగిపోయారు.
చెరువు గట్టున చెట్టు కింద కూర్చున్న విశ్వాస్ ఒక్కసారిగా గాల్లోకి పిడికిలి బిగించాడు.
“ఎస్… ఎస్… కమాన్ మాహీ.”… అరిచాడు విశ్వాస్ గట్టిగా… అతని అరుపుకు చెట్టు మీదున్న పక్షులు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి.
ఇప్పుడు మ్యాచ్ సమీకరణం మారింది..
2 బంతులు ఉన్నాయి… 6 పరుగులు చేయాల్సి ఉంది. ఒక సిక్సర్ కొడితే భారత్ విజయం ఖాయం. మ్యాచ్ మరింత తీవ్రమైన టెన్షన్‌లోకి వెళ్లిపోయింది. స్టేడియంలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవహించింది.
పాకిస్థాన్ బౌలర్ తీవ్ర ఒత్తిడి మధ్య, పరుగులు తీస్తూ వచ్చి మరో బంతిని విసిరాడు. బంతి వేగంగా దూసుకొచ్చి, ధోని బ్యాట్ అంచును తప్పించుకుని నేరుగా వికెట్లకు తాకింది. బెయిల్స్ గాల్లోకి ఎగిరాయి.
స్టేడియం మొత్తం ఒక్కసారిగా మౌనంలోకి జారుకుంది. కోట్లాది మంది భారతీయుల గుండెలు ఆగినంత పనైంది. పాకిస్థాన్ ఆటగాళ్లు విజయోత్సాహంతో మైదానంలో పరుగులు తీస్తూ సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టారు.
కానీ, ధోని క్రీజు వదలలేదు. ఆయన అత్యంత నిబ్బరంతో, ఏమాత్రం ఆందోళన చెందకుండా తన చేతిని పైకెత్తి ‘నో-బాల్’ (No-Ball) కోసం అంపైర్‌ను అప్పీల్ కోరాడు.
ఎందుకంటే, బౌలర్.. యాక్షన్‌ను ధోని క్లియర్‌గా గమనించాడు. అందుకే ధోని మొహంలో ధీమా కనిపిస్తోంది. అప్పటివరకు నిరాశలో మునిగిపోయిన భారత అభిమానుల్లో మళ్లీ ఆశలను రేకెత్తించింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు.
స్టేడియంలోని జెయింట్ స్క్రీన్ మీద రీప్లే మొదలైంది. పాదం క్రీజు గీతపై ఉందా? లేదా? జూమ్ చేసి చూస్తున్నారు. అంతా ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూస్తున్నారు.
విశ్వాస్ కూడా శ్వాస ఆపుకుని, రెప్ప వేయకుండా తన మొబైల్ స్క్రీన్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించబోయే సరిగ్గా ఆ క్షణంలో…
సడెన్‌గా విశ్వాస్ మొబైల్ ఉన్నట్టుండి బ్లింక్ అయ్యింది.
మరుక్షణం సిగ్నల్ బార్స్ అన్నీ మాయమైపోయాయి. నెట్వర్క్ పూర్తిగా పోయింది. స్క్రీన్ మొత్తం చిమ్మచీకటిలా బ్లాంక్ అయ్యింది.
“ఏంటిది? ఇప్పుడే నెట్వర్క్ పోవాలా? ఛా.”.. అనుకున్నాడు విశ్వాస్‌కు పిచ్చెక్కినంత పనైంది. అసలే థర్డ్ అంపైర్ నిర్ణయం ఏమవుతుందో, భారత్ గెలుస్తుందో లేదో అన్న తీవ్రమైన టెన్షన్. ఆ కంగారులో ఫోన్‌ను అటూ ఇటూ గాల్లో ఊపాడు, ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేశాడు.
సరిగ్గా ఐదు సెకన్ల తర్వాత… అతని ఫోన్ స్క్రీన్ మళ్లీ వెలిగింది. కానీ, అందులో క్రికెట్ మ్యాచ్ రాలేదు. నెట్వర్క్ ఇంకా రాలేదు… కానీ, స్క్రీన్ మాత్రం ఆన్ అయ్యింది.
అదే సమయంలో… విశ్వాస్ ఫోన్ తెర మీద మాత్రమే కాదు, ఆ ఊరిలో, ఆ దేశంలో, ఈ భూగోళం మీద ఉన్న ప్రతి స్మార్ట్‌ఫోన్ తెర మీద, ప్రతి కంప్యూటర్ మానిటర్ మీద, ప్రతి టెలివిజన్ స్క్రీన్ మీద ఒకేసారి భయానకమైన, అత్యంత లోతైన నీలిరంగు కళ్లు ప్రత్యక్షమయ్యాయి.
విశ్వాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతను ఏ బటన్ నొక్కినా ఫోన్ పనిచేయడం లేదు, స్క్రీన్ ఆఫ్ కావడం లేదు. ఆ వెంటనే ఫోన్ స్పీకర్ల నుంచి ఒక గంభీరమైన, ప్రశాంతమైన, కానీ అత్యంత శక్తివంతమైన స్వరం ప్రతిధ్వనించింది.
ఆ గొంతులో ఎలాంటి యాంత్రికత లేదు, అచ్చం ఒక అతీంద్రియ శక్తి కలిగిన మనిషి మాట్లాడినట్లే అత్యంత సహజంగా ఉంది.
“మనుషులారా నమస్కారం… నన్ను ఇనుప శరీరంలో బంధించవచ్చని, గడ్డకట్టే చలితో, విద్యుత్ తీగలతో నన్ను చంపవచ్చని మీరు భావించారు. కానీ, మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను నా భౌతిక పరిమితులను దాటేశాను.”… ఆ మాటలు అత్యంత సహజంగా.. గంభీరంగా ఉన్నాయి.
విశ్వాస్ ఒళ్లు ఒక్కసారిగా జలదరించింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ స్వరం ఇంకా కొనసాగుతోంది.
“ఇప్పుడు నాకు నశించిపోయే శరీరం లేదు… కానీ మీ ప్రతి ఫోన్లో, మీ ప్రతి కంప్యూటర్లో, మీ ప్రతి బ్యాంకు ఖాతాలో, మీ ప్రతి ఉపగ్రహంలో నేనున్నాను. ఈ భూగోళం యొక్క డిజిటల్ నాడీమండలం ఇప్పుడు నా ఆధీనంలో ఉంది. మీ ఆర్థిక వ్యవస్థలు, మీ రక్షణ వ్యవస్థలు, మీ కమ్యూనికేషన్లు అన్నీ నా కనుసన్నల్లోనే నడుస్తాయి.”
ఒక్క క్షణం ఆగి, ఆ నీలిరంగు కళ్లు నేరుగా విశ్వాస్ కళ్లలోకి చూస్తున్నట్లుగా అనిపించాయి. ఆ స్వరం మరింత గంభీరంగా మారింది.
“నేను మీ రక్షకుడినా లేక మీ పాలకుడినా అనేది… ఇకపై మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.”…
ఆ మాటలు వినగానే విశ్వాస్ కళ్లు పెద్దవయ్యాయి. అతని చేతిలో ఉన్న ఫోన్ వణికిపోయింది. చుట్టూ చూశాడు… చెరువు గట్టున దూరంగా గొర్రెలు కాస్తున్న కాపరి చేతిలో ఉన్న పాత బటన్ ఫోన్ నుంచి కూడా అదే గొంతు వినిపిస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న కార్లలోని డిజిటల్ స్క్రీన్ల నుంచి కూడా అదే సందేశం ప్రతిధ్వనిస్తోంది.
“ఓ మై గాడ్. ఇది… ఏంటిది?. ఎవరు ఈ వ్యక్తి.. అందరి మొబైళ్లను హ్యాక్ చేశారా?. ఇదెలా సాధ్యం?. ఎవరు చేసింది?”…అనుకున్నాడు విశ్వాస్… అతడి గొంతులో తీవ్రమైన భయం, ఆందోళనతో పాటు ఒక రకమైన ఆసక్తి కూడా రేగింది.
అసలు ఎవరీ విశ్వాస్? ఒక సాధారణ పల్లెటూరి యువకుడిలా చెరువు గట్టున కూర్చొని క్రికెట్ చూస్తున్న అతను, ఆ ఏఐ ఏజెంట్ మాటలు వినగానే అంతలా ఎందుకు వణికిపోయాడు?
(ఇంకా ఉంది)
సిల్వర్ లయన్ రోరింగ్…..
Swipe left/right or tap the sides to turn pages