New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
తొలిప్రేమ – 1

తొలిప్రేమ – 1

హైదరాబాద్ మహానగరం…

 

ఆకాశాన్ని తాకే భవంతులు, నిత్యం రద్దీగా కనిపించే రహదారులు, హడావుడిగా సాగిపోయే జనజీవనం… అలాంటి నగరంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కల్యాణ మండపం అది.

 

ఆ రోజు ఆ కల్యాణ మండపం పెళ్లి కళతో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పూల అలంకరణలు, మెరిసిపోయే విద్యుత్ దీపాలు, సంప్రదాయాన్ని ప్రతిబింబించే అందమైన మండపం… అడుగడుగునా వైభవం ఉట్టిపడుతోంది.

 

వేల సంఖ్యలో బంధువులు, ప్రముఖులు, పేరుమోసిన వ్యాపారవేత్తలు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు.

 

అంతటి వైభవంగా జరుగుతున్నది ఎవరి వివాహమో కాదు…

 

ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ వర్మ గారి ఏకైక కుమారుడు సిద్ధార్థ్ వర్మ వివాహం!

 

పెళ్లి మండపంలో వేదమంత్రాలు మారుమోగుతున్నాయి. హోమగుండం నుంచి వెలువడుతున్న పొగతో పాటు నెయ్యి పరిమళం పరిసరాలన్నింటినీ నింపేస్తోంది.

 

పెళ్లి కొడుకు సిద్ధార్థ్ వర్మ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. పంతులుగారు చెబుతున్న ప్రతి కార్యక్రమాన్ని యాంత్రికంగా చేస్తున్నాడే తప్ప, అతడి మనసు మాత్రం అక్కడ లేదు.

 

ముఖంలో ఎలాంటి ప్రత్యేకమైన ఆనందం లేదు. చుట్టూ జరుగుతున్న హడావుడి, బంధువుల సందడి, మంగళవాయిద్యాలు… ఏవీ అతడిని ఆకట్టుకోవడం లేదు.

 

అతడి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుగా అందరూ భావిస్తున్న ఆ రోజు, అతడికి మాత్రం ఒక సాధారణమైన రోజుగానే అనిపిస్తోంది.

 

ఆనంద్ వర్మ, జయరాం ఇద్దరూ కేవలం ప్రాణస్నేహితులు మాత్రమే కాదు. వ్యాపార రంగంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణిస్తున్న మంచి భాగస్వాములు.

 

వారి మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలపరచడంతో పాటు, వ్యాపార భాగస్వామ్యాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనే ఆలోచన జయరాం గారికి వచ్చింది.

 

జయరాం గారికి ఇద్దరు కొడుకులే. ఆడపిల్లలు లేకపోవడంతో తన తమ్ముడు శివరాం కుమార్తెను ఎంతో గారాబంగా చూసుకునేవారు. ఆ అమ్మాయిని తన ప్రాణస్నేహితుడు ఆనంద్ వర్మ కుమారుడు సిద్ధార్థ్‌కు ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనను ఆనంద్ గారి ముందు ఉంచారు.

 

ఆనంద్ వర్మకు కూడా ఆ సంబంధం కలుపుకోవడం ఇష్టమే కావడంతో వెంటనే అంగీకరించారు.

 

అలా రెండు కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం నిశ్చయమైంది.

 

ఇక పెళ్లి ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరిగాయి.

 

—

 

పెళ్లికి విచ్చేస్తున్న బంధువులను చిరునవ్వుతో పలకరిస్తూ, ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు వినయ్, అతని సతీమణి మిథున.

 

వినయ్, వివేక్ ఇద్దరూ జయరాం గారి కుమారులు. ఇద్దరూ తమ తమ భార్యలతో కలిసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

 

వినయ్ భార్య మిథున కాగా, వివేక్ భార్య ఆనంది.

 

“అక్కా… పెళ్లికూతుర్ని తీసుకురమ్మని పంతులుగారు చెబుతున్నారు.”

 

అంటూ అక్కడికి వచ్చింది ఆనంది.

 

“అవునా! పద మరి… ఇప్పటికే ఆలస్యం అయిపోయినట్టుంది.”

 

అంటూ మిథున చిరునవ్వుతో ముందుకు కదిలింది.

 

ఇద్దరూ కలిసి పెళ్లికూతురి గదివైపు బయలుదేరారు.

 

జయరాం గారికి ఒక తమ్ముడు. ఆయన పేరు శివరాం. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఇద్దరిలో పెద్దది కుమార్తె.

 

రెండు కుటుంబాల్లోనూ ఒక్కతే ఆడపిల్ల కావడంతో అందరికీ ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పటి నుంచి అందరి ప్రేమను పొందుతూ, అల్లారుముద్దుగా పెరిగింది.

 

జయరాం గారు తన స్నేహితుడి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనను తమ్ముడితో చెప్పినప్పుడు, శివరాం మొదట కాస్త ఆలోచనలో పడ్డారు.

 

తన కూతురి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి సహజంగానే కొంత సందేహం కలిగింది. అయితే తన అన్నయ్య తన కూతురికి మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ సంబంధం చూస్తున్నారని నమ్మి చివరికి పెళ్లికి అంగీకరించారు.

 

శివరాం మొదట ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత అన్నయ్య సహాయంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా మంచి స్థాయికి చేరుకున్నారు.

 

అలా రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతూ వచ్చింది.

 

మిథున, ఆనంది పెళ్లికూతురి గదిలోకి అడుగుపెట్టారు.

 

అప్పటికే పెళ్లికూతురిని అందంగా ముస్తాబు చేశారు. పట్టుచీరలో, ఒంటినిండా ఆభరణాలతో, తల నిండా పూలతో కళకళలాడిపోతోంది.

 

ఆమె పక్కనే ఒక అమ్మాయి నిలబడి ఉంది. బహుశా పెళ్లికూతురి స్నేహితురాలై ఉంటుంది. పెళ్లి కార్యక్రమాల్లో తన స్నేహితురాలికి తోడుగా ఉంటూ, ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటోంది.

 

“అమ్మా… పదండి. పంతులుగారు పిలుస్తున్నారు.”

 

అంటూ మిథున ఆప్యాయంగా చెప్పడంతో పెళ్లికూతురు మెల్లగా తల ఊపింది.

 

ఆనంది, మిథున ఇద్దరూ ఆమెకు తోడుగా నిలిచి మండపం వైపు తీసుకువెళ్లారు.

 

అప్పటికే పెళ్లి మండపం వద్ద అందరి చూపులూ పెళ్లికూతురి రాక కోసమే ఎదురుచూస్తున్నాయి.

 

మంగళవాయిద్యాల నడుమ పెళ్లికూతురు మండపంలోకి అడుగుపెట్టింది.

 

ఆమెను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టిన తర్వాత, సంప్రదాయం ప్రకారం పెళ్లికొడుకు, పెళ్లికూతురు మధ్య అడ్డుతెరను ఏర్పాటు చేశారు.

 

ఇద్దరి మధ్య ఆ తెర ఉన్నప్పటికీ, ఆ క్షణం నుంచి వారి జీవితాలు ఒక్కటవ్వబోతున్నాయనే విషయం అక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.

 

“బాబూ… అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి.”

 

పంతులుగారి మాటలు వినిపించడంతో ఏదో ఆలోచనలో ఉన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా తలెత్తాడు.

 

తన ముందు ఉన్న జీలకర్ర బెల్లాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

 

ఒక్క క్షణం తన తండ్రి ఆనంద్ వర్మ వైపు చూశాడు.

 

ఆయన ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసిన తర్వాత, తన మనసులోని అయిష్టతను మరోసారి అణచుకున్నాడు.

 

ఇష్టం లేకపోయినా, తండ్రి మాటకు ఎదురుచెప్పలేక పెళ్లికూతురి తల మీద జీలకర్ర బెల్లం పెట్టేశాడు.

 

“అమ్మా… మీరు కూడా అబ్బాయి తల మీద పెట్టండి.”

 

పంతులుగారు చెప్పడంతో పెళ్లికూతురు కొద్దిగా తల వంచి, బిడియంగా సిద్ధార్థ్ తల మీద జీలకర్ర బెల్లం పెట్టింది.

 

ఆమె చేతులు కాస్త వణికాయి.

 

ఆ వణుకులో భయం ఉందో, కొత్త జీవితాన్ని తలచుకున్న ఆందోళన ఉందో ఆమెకే తెలియదు.

 

నిజానికి పెళ్లికూతురు ఇప్పటివరకు తనకు కాబోయే భర్తను చూడలేదు.

 

చూడలేదు అనడం కన్నా, చూసే అవకాశం రాలేదనడం సరైనదేమో!

 

పెళ్లి నిశ్చయమైన తర్వాత కనీసం ఒక ఎంగేజ్‌మెంట్ అయినా జరిపిద్దామని పెద్దలు అనుకున్నారు. కానీ మంచి ముహూర్తం దగ్గర్లోనే ఉందని పంతులుగారు చెప్పడంతో, ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం లేకుండానే నేరుగా వివాహం జరిపించాలని నిర్ణయించారు.

 

అలా ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియకుండానే ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

 

“బాబూ… మాంగల్యధారణ చేయండి.”

 

పంతులుగారి మాటలు వినిపించగానే సిద్ధార్థ్ తన ముందున్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

 

మరోసారి తండ్రి వైపు చూశాడు.

 

ఆనంద్ వర్మ ముఖంలో కనిపిస్తున్న సంతోషం అతడికి మరోసారి గుర్తుచేసింది… తాను ఇప్పుడు చేస్తున్నది తన కోసం కాదని!

 

తండ్రి కోరికను కాదనలేక, మెల్లగా లేచి పెళ్లికూతురి మెడలో మాంగల్యం కట్టడానికి ముందుకు వంగాడు.

 

అప్పుడే పెళ్లికూతురి పక్కనే ఉన్న స్నేహితురాలు ఆమె అందమైన పూలజడను పైకి ఎత్తి పట్టుకుంది.

 

సిద్ధార్థ్ మాంగల్యాన్ని ఆమె మెడలో కడుతున్న సమయంలో అతడి చేతివేళ్లు అనుకోకుండా పెళ్లికూతురి మెడను తాకాయి.

 

ఆ చిన్న స్పర్శ…

 

ఆమెకు ఎందుకో తెలియని కొత్త అనుభూతిని కలిగించింది.

 

ఒక్కసారిగా మనసులో ఏదో అలజడి మొదలైంది. అప్పటివరకు తనలో ఉన్న బెరుకు మరింత పెరిగింది. చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.

 

తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక్కసారి తలెత్తి చూడాలనిపించినా, ఆ ధైర్యం మాత్రం రాలేదు.

 

అతడి ముఖం ఎలా ఉంటుందో? తనతో ఎలా మాట్లాడతాడో? తనను ఎలా చూసుకుంటాడో?

 

ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో మెదులుతున్నా, వాటన్నింటికీ సమాధానం తెలుసుకోవడానికి మరికొంత సమయం కావాలని ఆమెకు అనిపించింది.

 

అటు సిద్ధార్థ్ మాత్రం ఎలాంటి భావోద్వేగాలకూ తావివ్వకుండా మాంగల్యధారణ కార్యక్రమాన్ని పూర్తిచేశాడు.

 

పెళ్లికూతురి మెడలో మూడు ముళ్లు పడగానే మంగళవాయిద్యాలు ఒక్కసారిగా మిన్నంటాయి.

 

బంధువుల చప్పట్లు, పెద్దల ఆశీర్వాదాలు, పూల వర్షం… ఆ కల్యాణ మండపమంతా ఆనందంతో నిండిపోయింది.

 

ఆ రెండు కుటుంబాల పెద్దలకు తమ బాధ్యత తీరినంత సంతోషంగా ఉంది.

 

కానీ ఆ ఇద్దరి మనసుల్లో మాత్రం రెండు విభిన్నమైన భావాలు చోటుచేసుకున్నాయి.

 

ఒకరి మనసులో కొత్త జీవితంపై చిన్నచిన్న ఆశలు చిగురిస్తుంటే…

 

మరొకరి మనసులో మాత్రం ఇష్టం లేని నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చిందనే అసంతృప్తి అలాగే ఉండిపోయింది.

 

పెళ్లిలో చేయవలసిన ఒక్కొక్క కార్యక్రమాన్ని పంతులుగారు నవదంపతుల చేత సంప్రదాయబద్ధంగా చేయిస్తున్నారు.

 

అలా ఆడంబరంగా సాగుతున్న ఆ వివాహ వేడుకలో, రెండు జీవితాలు ఒకటయ్యాయి.

 

కానీ ఆ బంధం వెనుక ఎలాంటి కథ దాగి ఉందో… కాలమే సమాధానం చెప్పాలి!

 

ఇంకా ఉంది….

 

మీ నందు ❤️