వైల్డ్ బిస్ట్ – 1
సమయం; 10/7/2020.. రాత్రి 12;25 నిమిషాలు..
వర్షం పడబోతుంది అన్న దానికి సూచనగా ఈదురుగాలులు, అక్కడక్కడ ఉరుములు మెరుపులు.. కన్ను పొడుచుకున్న ఎక్కడ కనిపించని వెలుతురు.. గుడ్లగూబలు వాటి ఆవాసం నుంచి అరుస్తూ ఉన్నాయి.
కలకత్తా నగరం కారుమబ్బుల్లో మునిగిపోయి ఉంది.. ప్రతి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఎందుకంటే..! బయట వాతావరణం సూచన వల్ల.
ఒక ఇంట్లో శ్రీమంతం చేసిన దానికి గుర్తుగా అలంకరించబడి ఉంది.. ఒక దీపపు వెలుగులో అలంకరణ అంతా నిండుగా కనిపిస్తూ ఉంది.
శ్రీమంతం చేసుకున్న నిండు గర్భిణి పసుపు రంగు చీరలో నిండు ముత్తయిదువుగా నుదుటినా కుంకుమ, కంఠానికి గంధము, చేతులకి ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులు.. అన్నిటికీ మించి ఎద మీద మంగళసూత్రం, నల్లపూసలు..
చామంతి,కనకాంబరాల,మల్లెలు అల్లిన పూలతో పొడవాటి జడకి అలంకరించబడి ఉంది..
శ్రీమంతం చేసుకున్న స్త్రీ పక్కన ఆమె తల్లి కాబోలు ధైర్యం చెబుతూ ఉంది.. ఉరుముల శబ్దానికి.
కడుపు మీద చెయ్యి వేసుకుని కడుపులో ఉన్న బిడ్డకి ధైర్యం చెబుతూ ఉంది..”ఏం కాదు.. ఏం కాదు..” అని ఆ స్త్రీ.
ఆ శ్రీమంతం చేసుకున్న స్త్రీ పక్కన ఆమె తండ్రి వచ్చి కూర్చొని..” జాను నేను ఉన్నాను కదమ్మ నిశ్చింతగా పడుకో..” అని అన్నాడు ఆమె తల నిమురుతూ.
“బయట వెలుతురు లేదు ఇంత పౌర్ణమి రోజు కూడా,కారు మబ్బులు కమ్మేసాయి నాన్న.. ఇంత చీకట్లో అన్నయ్య ఎలా వస్తాడు ఇప్పుడు ఇంటికి..!” అని అంది వాళ్ళ నాన్నని భయంగా చూస్తూ జాను. (శ్రీమంతం జరిగిన స్త్రీ జాహ్నవి)
“వాడి గురించి భయపడి నువ్వు బీపీ పెంచుకోకు,నీ కడుపులో ఉన్న బిడ్డకి అది మంచిది కాదు.
ముందే ఇప్పుడు హాస్పటల్ కి పరిగెత్తడానికి బయట వాతావరణం సరిగ్గా లేదు.. వాడు ఎలాగోలా వస్తాడు నువ్వు టెన్షన్ పడకు.” అని అంటూ ఆయన ఫోన్ చేస్తూ ఉన్నాడు అర్జున్ అనే నెంబర్ కి.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా..” కవరేజ్ ఏరియా లో లేరు..”అని వస్తుంది అర్జున్ ఫోన్.
ఒకపక్క కూతురు టెన్షన్ పడుతుంది అని భయపడుతూనే ఇంకోపక్క కొడుకు ఇంకా ఇంటికి రాలేదు,బయట వాతావరణం సరిగ్గా లేదు అనే భయం పట్టుకుంది ఆ సగటు తండ్రికి.
బెరుకుగా ఇంటి ద్వారం వైపు చూస్తూ.. “నువ్వు నిద్రపో జాను,అన్నయ్య వస్తాడు కానీ..!” అని లేని ధైర్యాన్ని నటిస్తూ ఉంది ఆ తల్లి కూతురికి నచ్చచేబుతూ.
తల్లి తండ్రి అంతగా చెప్పేసరికి నడుము వాల్చింది జాను.. కళ్ళని తలుపు వైపు నిలుపుతూనే.
రాత్రి 12:45 నిమిషాలకి జాను వాళ్ళ తలుపు తడుతూ ఉన్నారు ఎవరో.
అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు.. జాను వాళ్ళ నాన్నని చూస్తూ..” అన్నయ్య వచ్చాడానుకుంటా నాన్న..” అని అంది.
ఆయన కూడా “అదే అనుకుంటా..” అన్నట్టుగా చూస్తూ ఒక అడుగు ముందుకు వేశాడు.
ఎవరో ఆడ వ్యక్తి..”అయ్యా ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టండయ్య నా బిడ్డ ఆకలితో ఏడుస్తుంది..” అనే పిలుపు వినిపించింది తలుపు శబ్దం దగ్గర నుంచి.
ఒక్క అడుగు ముందుకు పడిన ఆయన దగ్గర నుంచి ఆయనకి తెలియకుండానే రెండవా అడుగు పడకుండా మొరాయించింది.
ఆయన చెయ్యి పట్టుకొని..”ఎవరో పాపం బిడ్డ కోసం అన్నం అడగడానికి వచ్చినట్టుంది తలుపు తీయండి..” అని అంది ఆయన భార్య.
“కలకత్తాలో తెలుగులో అన్నం అడిగే వాళ్ళు ఎవరు..? అందులో ఇలాంటి వాతావరణం లో అన్నం కోసం మన తలుపు తట్టారు అంటే నాకెందుకో బ్యాడ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి..” అని అన్నాడు నెలలో నిండిన తన కూతురిని చూసుకుంటూ ఆ తండ్రి.
“తెలుగు వాళ్ళం మనం కలకత్తాలో ఉండట్లేదా..! అలాగే ఉండొచ్చు.
అయినా ఆకలికి భాషతో సంబంధమేంటండి..! పాపం ఎంత ఆకలి వేస్తే ఇలా అడగడానికి వచ్చుంటుంది..” అని అంది ఆ సగటు భార్య..బయట తలుపు కొడుతూ ఆకలి అమ్మ అన్నం పెట్టు అని అడుగుతున్నా ఆడ గొంతుకి కరిగిపోతూ.
కడుపులో ఉన్న తన బిడ్డని తడుముతూ.. “తలుపు తీయండి నాన్న ఎలాగో శ్రీమంతమైన తర్వాత మిగిలిపోయిన అన్నం,కూరలు ఉన్నాయి కదా..!
అవి ఒక్కరి కడుపు నింపిన మంచిదేగా రేపొద్దున వేస్ట్ గా పడేయకుండా..” అని అంది తల్లి కాబోతున్న జాహ్నవి.
భార్య,బిడ్డ అంతలా చెబుతుంటే తన ఆలోచనని పక్కనపెట్టి తలుపు తీయడానికి వెళ్ళాడు ఆయన.
ఆ తలుపు తీసే క్షణం వరకు ఆయన ఊహించి ఉండడు.. ఎందరికో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పాఠాలు నేర్పించిన ఆయన జీవితంలో గుణపాఠలు నేర్చుకోబోతున్నాను అని.
‘తలుపు తీయండి నాన్న..’ అని చెప్పిన జాహ్నవి ఒక తల్లి,బిడ్డ కడుపు నింపుతున్నాను అని అనుకుంది కానీ..! తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంది అని ఆ క్షణం ఊహించలేదు.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages