❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 3
రిక్కీ దగ్గరికి వెళ్లి వరూధిని, “ఏమైంది రిక్కీ? ఈ దెబ్బలేంటి?” అని అడుగుతుండగా,
ప్రిన్సిపల్, “మీరు ఇలా కూర్చోండి మేడం. నేను చెప్తాను,” అంటుంది.
వరూధిని ప్రిన్సిపల్ ముందు కూర్చుని, “ఏమైంది మేడం? రిక్కీకి ఎందుకు అలా దెబ్బలు తగిలాయి?” అని కంగారుపడుతూ అడుగుతుంది.
“మీరు కేవలం రిక్కీని మాత్రమే చూస్తున్నారా వరూధిని గారు? పక్కనున్న అబ్బాయికి ఇంకా ఎన్ని దెబ్బలు తగిలాయో చూడండి,” అనగానే పక్కనే ఉన్న అబ్బాయిని చూస్తుంది వరూధిని.
ఆ అబ్బాయి చెంప మీద చేతి వేళ్ల గుర్తులు ఉన్నాయి. బట్టలన్నీ మాసిపోయి, అక్కడక్కడ గీరుకుపోయి, ఏడుస్తూ ఉంటాడు.
“ఏమైంది మేడం? అసలు ఎందుకు వీళ్లిద్దరికీ ఇలా దెబ్బలు తగిలాయి?”
“రిక్కీ ఆ అబ్బాయిని కొట్టాడు వరూధిని గారు.”
“ఎందుకు?” అని అడిగితే, “చెప్పట్లేదు. వచ్చిన దగ్గర నుంచి అలాగే కూర్చున్నాడు. మీరు వచ్చాక అడుగుదామని మేము కూడా ఏమీ అనలేదు, వరూధిని గారు” అంటుంది ప్రిన్సిపల్.
“మీరేం మాట్లాడుతున్నారు మేడం? రిక్కీ ఆ అబ్బాయిని కొట్టాడా? మా రిక్కీ అలా ఎప్పుడూ చేయడు.”
“లేదు మేడం. మీ రిక్కీ ఆ అబ్బాయిని కొట్టాడు. క్లాస్‌లో టీచర్ ఎంత ఆపినా అస్సలు ఆగట్లేదు.”
వరూధినికి కంగారుగా అనిపించింది. ఆ పిల్లాడి పేరెంట్స్ వస్తే ఏమని సమాధానం చెప్పాలో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
రిక్కీ వైపు కోపంగా చూస్తూ, ప్రిన్సిపల్‌తో, “రిక్కీ తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను మేడం. ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను,” అని చెప్తుంది వరూధిని.
వరూధిని సారీ చెప్పడం నచ్చని రిక్కీ, ఆమె దగ్గరికి వచ్చి, “నువ్వు సారీ చెప్పొద్దు మమ్మీ. నేనే ఏ తప్పు చేయలేదు. అంతా వాడే చేశాడు. నాకు కోపం వచ్చింది, అందుకనే కొట్టాను. దాంట్లో తప్పేముంది?” అంటాడు.
“రిక్కీ, నువ్వు నోరు మూసుకో,” అనగానే గప్‌చుప్‌గా నోరు మూసుకుని పక్కకు నిలబడతాడు.
“ప్లీజ్ మేడం! వాడికి తెలియదు. చిన్నపిల్లాడు. నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ,” అని వరూధిని ప్రిన్సిపల్‌ను రిక్వెస్ట్ చేస్తుంది.
“సరే వరూధిని గారు. ఈసారి నేను వాళ్ల పేరెంట్స్‌కి సర్దిచెప్తాను. కానీ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.”
“లేదు మేడం. ఇంకొకసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను,” అని చెప్పి వరూధిని రిక్కీని తీసుకుని ఇంటికి వస్తుంది.
స్కూటీని ఇంటి ముందు ఆపి, బ్యాగ్ తీసుకుని లోపలికి వస్తుంది వరూధిని . రిక్కీ తల కిందకు వేసుకుని వరూధిని వెనకాలే లోపలికి వస్తాడు.
వరూధిని కోపంగా బ్యాగ్‌ను సోఫాలో విసిరికొట్టి, “అసలు ఎందుకు కొట్టావు ఆ అబ్బాయిని?” అని అడుగుతుంది.
రిక్కీ వరూధిని ముందుకు వచ్చి, చేతులు కట్టుకుని, తలదించుకుని, కళ్లనిండా నీళ్లతో, “వాడు నన్ను ఏమన్నాడో తెలుసా మమ్మీ? నీకు డాడీ లేడు. నువ్వు మీ మమ్మీకి చెత్తకుండీలో దొరికావు అని అన్నాడు. నాకు కోపం వచ్చింది. అందుకే కొట్టాను,” అంటాడు.
రిక్కీ అలా మాట్లాడగానే వరూధిని ఒక్కసారిగా రిక్కీని పట్టుకుని ఏడుస్తుంది.
“మమ్మీ, నువ్వు ఏడవద్దు. నేను వాడికి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చాను. ఇంకొకసారి వాడు ఎప్పుడూ ఇక నా గురించి మాట్లాడడు. నువ్విలా ఏడిస్తే అస్సలు బాగోలేదు. నాకు కూడా ఏడుపొస్తుంది,” అనగానే,
“అది కాదు రిక్కీ. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే టీచర్‌తో చెప్పాలి కానీ, నువ్వే కొట్టడం మంచి పద్ధతి కాదు. ఇలా ఇంకెప్పుడూ చేయొద్దు,” అని చెప్తుంది.
“లేదు మమ్మీ! ఎవరైనా తప్పు చేస్తే, మనల్ని ఎవరైనా అంటే మనం ఎందుకు ఊరుకోవాలి? కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి,” అంటాడు.
“మమ్మీ చెప్తుంది అర్థం చేసుకోరా! మనం అలా చేస్తే తప్పంతా మనదే అంటారు. నువ్వు ఈరోజు ఈ విషయం టీచర్‌కి చెప్పి ఉంటే, ఆ బాబుని పిలిపించి అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు చూడు, నిన్నే తప్పు పట్టారు . అలా ఎప్పుడూ చేయకూడదు రిక్కీ.”
“లేదు మమ్మీ! నేను కచ్చితంగా నన్ను ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకి పనిష్మెంట్ ఇస్తాను.”
“నేను చెప్తుంటే అర్థం కావడం లేదా? ఓ పక్క నేను అలా చేయకూడదు అని చెప్తూ ఉంటే కూడా అర్థం చేసుకోవా?” అని విసుక్కుంటుంది వరూధిని.
“నేను అలాగే చేస్తాను. నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను. నా మిస్టేక్ లేకుండా నేను ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు కదా!” అంటాడు.
“రిక్కీ, నాకు కోపం తెప్పించకు.”
రిక్కీ సోఫా మీదికి ఎక్కి, చేతులు కట్టుకుని కూర్చొని, మొహం పక్కకు తిప్పేసుకుంటాడు.
అశోక్ గారు లోపలికి వస్తూ, “రిక్కీ వచ్చేశావా కన్నా?” అంటూ తన మనవడి పక్కన కూర్చోగానే,
“డోంట్ టచ్ మీ తాత !” అంటాడు రిక్కీ.
“వరు, రిక్కీ కీ ఏమైంది? ఇలా ఉన్నాడు?” అనగానే వరూధిని,
“స్కూల్లో ఎవరో అబ్బాయిని కొట్టాడట నాన్న. కొట్టొద్దని చెప్తూ ఉంటే కూడా వినట్లేదు. మొండిగా నేను అలాగే చేస్తాను అంటున్నాడు,” అని చెప్తుంది.
అశోక్ గారు, “అలా చేయకూడదు రిక్కీ. ఏదైనా ఉంటే టీచర్‌కి చెప్పాలి కానీ, నువ్వే కొడితే అప్పుడు తప్పంతా నీదే అవుతుంది,” అంటారు.
“నేను ఎవరు చెప్పినా వినను. ఐ హేట్ యు!” అంటూ బుంగమూతి పెట్టుకుని కూర్చుంటాడు.
చిన్న కాలేజీ నుంచి ఇంటికి వస్తూ రిక్కీ కోసం చాక్లెట్లు తీసుకొస్తాడు.
చాక్లెట్లు రిక్కీ ముందు పెట్టి, “విక్కీ బంగారం! ఇవి నీకోసమే తీసుకొచ్చాను. తీసుకో,” అనగానే రిక్కీ వాటిని తీసుకుని పక్కకు విసిరేస్తాడు.
“ఏమైంది రిక్కీ? నీకు చాక్లెట్లు అంటే ఇష్టమే కదా! మరి ఎందుకు విసిరేస్తున్నావ్?” అని అడుగుతాడు చిన్న.
రిక్కీ రెండు పెదవులనూ ముందుకు పెట్టి, “ఐ హేట్ యు ఆల్! ఐ హేట్ యు!” అంటూ అరుస్తాడు.
వరూధినికి కోపం వచ్చి, “రిక్కీ, షట్ అప్! ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావ్? ఇంత లేవు, ఎందుకంత కోపం రా నీకు? ఇలాగే చేస్తే రెండు తగిలిస్తాను,” అంటుంది.
రిక్కీ వరూధిని వైపు చూస్తూ, “ఐ హేట్ యు మమ్మీ! ఐ హేట్ యు!” అని చెప్పి వాళ్ల బెడ్రూమ్కి వెళ్లి, స్కూల్ డ్రెస్ చిందరవందరగా విప్పేసి వాష్‌రూమ్‌లోకి వెళ్లిపోతాడు.
“అక్కా! ఎందుకలా అరుస్తున్నావ్? పాపం రిక్కీ ఎంత ఫీల్ అవుతున్నాడో చూడు,” అంటూ చిన్న రిక్కీ వెంటే వెళ్లి, వాడికి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి బయటికి తీసుకొస్తాడు.
“అక్కా, నేను కొద్దిసేపు రిక్కీని బయటికి తీసుకెళ్తాను. బెడ్రూమ్లో బట్టలన్నీ చిందరవందరగా పడేశాడు. అవన్నీ తీసేయ్. కొద్దిసేపు అయితే మామూలు అయిపోతాడు,” అని చిన్న రిక్కీని తీసుకుని బయటికి వెళ్లిపోతాడు.
అశోక్ గారు వరూధిని దగ్గరికి వచ్చి, “అసలు ఏమైంది వరు? రిక్కీకి ఎందుకంత కోపం వస్తుంది?” అనగానే వరూధిని కళ్లలో నీళ్లతో వాళ్ల నాన్నను పట్టుకుని ఏడుస్తుంది.
అశోక్ గారు కంగారుపడుతూ వరూధినిని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి, “అసలు ఏమైందిరా? ఎందుకు ఇంతగా బాధపడుతున్నావ్?” అని అడుగుతారు.
“స్కూల్లో ఒక బాబు, ‘నీకు డాడీ లేడు. నువ్వు చెత్తకుండీలో దొరికావు’ అని అన్నాడట నాన్న. దానికి కోపం వచ్చి రిక్కీ ఆ బాబుని కొట్టాడు. అది చెప్తున్నప్పుడు వాడి మొహం చూడాలి నాన్న. నాకు మొదటిసారి చచ్చిపోవాలనిపించింది,” అంటూ బాధపడుతుంది.
“అమ్మా వరు! ఏం మాట్లాడుతున్నావ్ రా? ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నావు. ఈరోజు ఇంత చిన్నదానికి నువ్వు ఇలా బాధపడటం ఏంటి రా? నువ్వు ఇది కాదు. ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు నడిచే నా బంగారు తల్లివి. ఇంత చిన్నదానికి ఇలా మాట్లాడటం ఏంటి రా?”
“నా వరు ఎప్పుడూ బయటివాళ్లు అన్న మాటలు పట్టించుకోదు. అలాంటిది నువ్విలా బాధపడితే, నిన్ను, రిక్కీని చూసుకుంటూ బ్రతికే నాకు ఎలా ఉంటుంది చెప్పు?” అంటూ తన కూతురిని ఓదార్చి, వాటర్ తీసుకువచ్చి తాగిస్తారు.
వరూధిని, “అసలు నేనేం పాపం చేశాను నాన్న? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నేను తెలిసి ఏ పొరపాటూ చేయలేదు. నా జీవితంలో జరిగిన ఆ సంఘటనను నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అసలు అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేదో అని ఎన్నిసార్లు అనుకున్నానో.
ఎవడో చేసిన తప్పుకి ప్రతిఫలం నేను అనుభవిస్తున్నాను,”నాన్న అంటూ బాధపడుతుంది వరూధిని.
“బాధపడకు రా. దేవుడు అన్నీ చూస్తున్నాడు . నీకు మంచి రోజులు వస్తాయి. నువ్వు సంతోషంగా బ్రతికే రోజు రావాలని ప్రతిరోజూ ఆ దేవుడిని కోరుకుంటున్నాను,” అంటారు అశోక్ గారు.
వరూధిని ఇంకా అలాగే ఉంటే అశోక్ గారు బాధపడతారని, తన కన్నీళ్లు తుడుచుకుని, “నాన్న, మీ కోసం ఏమైనా చేస్తాను,” అంటూ కిచెన్‌లోకి వెళ్లిపోతుంది.
అశోక్ గారు వరూధిని బాధను చూసి, ఆయన మనసు కూడా బాధతో నిండిపోతుంది.
To be connected
అసలు వరూధిని జీవితంలో ఏం జరిగింది?
రుద్రవీర్ సింహ కు వరూధినికి ఏంటి సంబంధం?
Swipe left/right or tap the sides to turn pages