New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 4

అగ్నిసాక్షి 🔥 – 4

“వచ్చింది. కానీ ఇంకా ఏమీ చెప్పలేదు. తన కోసమే మేము ఎదురుచూస్తున్నాం.”

 

అంటూ సమాధానమిచ్చారు ఆయన.

 

“అవునా అన్నయ్యా! ఒకసారి దాన్ని చూడాలని ఉంది. బయట నుంచి చూడొచ్చు కదా!”

 

అంటూ ఆపరేషన్ థియేటర్ అద్దం దగ్గరకు వెళ్లింది విజయ. లోపలికి చూడటానికి ప్రయత్నిస్తూ అద్దానికి దగ్గరగా నిలబడింది.

 

అయితే లోపల జరుగుతున్నదంతా స్పష్టంగా కనిపించకపోవడంతో ఆమె మనసులో ఆందోళన మరింత పెరిగిపోయింది. చేతులు రెండూ జోడించుకుని, లోపల ఉన్న తనవారి క్షేమం కోసం మనసులోనే దేవుడిని వేడుకుంది.

 

“విజయా…”

 

అంటూ పక్కనే ఉన్న ఆమె భర్త పిలిచారు.

 

ఆ పిలుపుతో వెనక్కి తిరిగిన విజయ కళ్లలో అప్పటికే నీళ్లు నిండిపోయాయి.

 

“ఏంటి అండి ఇది? ఇలా చేస్తుంది! మన కోసమైనా పోరాడితే అయిపోతుంది కదా! మన కోసం కాకపోయినా… ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ కోసం అయినా పోరాడాలి కదా!”

 

అంటూ భర్త భుజంపై తల వాల్చింది విజయ. గొంతు వణుకుతుండగా, కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అయినా ఆమె చూపు మాత్రం ఆపరేషన్ థియేటర్ వైపు నుంచే కదలడం లేదు.

 

ఆమె పరిస్థితిని చూసిన రాధిక దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసింది.

 

“విజ్జీ… నువ్వే ఇలా అయిపోతే అన్నయ్య ఎలా ధైర్యంగా ఉంటాడు? నువ్వు ధైర్యంగా ఉంటూ అన్నయ్యకి భరోసా ఇస్తూ ఉండు.”

 

అంటూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది రాధిక.

 

“నాకు ధైర్యం చాలడం లేదు రాధీ… దాన్ని అలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను.”

 

అంటూ రాధికను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది విజయ.

 

విజయ బాధను చూసి రాధిక మనసు కూడా కలచివేసింది. ఆమెను ఓదార్చాలని ప్రయత్నించినా, తనకే మాటలు రావడం లేదు. మౌనంగా విజయను దగ్గరకు తీసుకుని వెన్నుపై నిమిరింది.

 

“కిషోర్… నువ్వైనా విజ్జీకి ధైర్యం చెప్పు.”

 

అంటూ రాధిక భర్త అరుణ్, కిషోర్ భుజంపై చేయి వేసి చెప్పారు.

 

అప్పటికే అక్కడి వాతావరణం అంతా ఆందోళనతో నిండిపోయింది. ఎవరి ముఖంలో చూసినా భయమే కనిపిస్తోంది.

 

ఇంతలోనే మరో ఇద్దరు దంపతులు అక్కడికి వచ్చారు.

 

“అసలు దానికి ఏమైంది? ఎలా ఉంది ఇప్పుడు?”

 

అంటూ ఆందోళనగా అడిగారు.

 

వాళ్లను చూడగానే విజయ కళ్లలో మళ్లీ ఆశ కనిపించింది. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లింది.

 

“అది క్రిటికల్ కండిషన్‌లో ఉందట. నర్స్ కూడా బయటకు వచ్చి ఏమీ చెప్పలేదు. మీరైనా వాళ్లని అడగండి అన్నయ్యా… అసలు లోపల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.”

 

అంటూ ఆందోళనగా చెప్పింది. ఆమె మాటల్లో భయం స్పష్టంగా వినిపిస్తోంది.

 

అప్పటికే అందరి చూపులూ ఆపరేషన్ థియేటర్ తలుపు వైపే ఉన్నాయి.

 

ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఎవరికీ అక్కడి నుంచి కదలాలని అనిపించడం లేదు.

 

వాళ్లంతా బయట నిలబడి మాట్లాడుకుంటుండగానే ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది.

 

నర్స్ బయటకు వచ్చింది.

 

ఆమెను చూడగానే అందరూ ఒక్కసారిగా అటువైపు తిరిగారు. కొందరు ఆత్రంగా ముందుకు అడుగు వేయగా, మరికొందరు ఏదో చెడు వార్త వినాల్సి వస్తుందేమోనన్న భయంతో అక్కడే నిలబడిపోయారు.

 

ఆమె ఏం చెప్తుందోనని అందరూ ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.

 

ఆ సమయంలో వాళ్ల ముఖాల్లో సంతోషం కనిపించాలా? లేక భయం కనిపించాలా? అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

 

నర్స్ వాళ్ల దగ్గరకు వచ్చి విజయను చూసింది.

 

“అమ్మా… మీ అమ్మాయికి బాబు పుట్టాడు.”

 

అంటూ అప్పుడే పుట్టిన పసికందును విజయ చేతుల్లో పెట్టింది.

 

ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం కనిపించింది. ఇంతసేపు గుండెల్లో గూడు కట్టుకున్న భయం కాస్త తగ్గినట్టుగా అనిపించింది.

 

ఎంతో ఆందోళనగా ఎదురుచూస్తున్న సమయంలో పసిబిడ్డను చూడగానే విజయ కళ్లలో ఆనందభాష్పాలు తిరిగాయి. వణుకుతున్న చేతులతో బాబును జాగ్రత్తగా అందుకుని, అతని ముఖాన్ని ఆప్యాయంగా చూస్తూ…

 

“అచ్చం దానిలానే ఉన్నాడు కదా అండి!”

 

అంటూ తన భర్త వైపు చూసింది.

 

ఆమె మాటలకు ఆయన కూడా బాబు వైపు చూస్తూ చిన్నగా నవ్వారు.

 

చిట్టి కళ్లు ఇంకా మూసుకునే ఉండటంతో మరోసారి బాబు ముఖాన్ని పరిశీలిస్తూ,

 

“వీడు ఇంకా కళ్ళు తెరవడం లేదేంటి అండి?”

 

అంటూ అమాయకంగా అడిగింది.

 

ఆమె మాటలకు రాధిక చిన్నగా నవ్వింది.

 

“విజ్జీ… వాడు ఇప్పుడే పుట్టిన బేబీ. బయట లైట్స్‌కి అంత త్వరగా ఎలా కళ్ళు తెరుస్తాడు?”

 

అంటూ విజయ చేతుల్లో ఉన్న బాబును తన చేతుల్లోకి తీసుకుంది రాధిక.

 

ఆమె చేతుల్లోకి వెళ్లిన ఆ బుడ్డోడు తన చిట్టి చేతిని కదిలించి రాధిక వేలును గట్టిగా పట్టుకున్నాడు.

 

ఆ చిన్నారి స్పర్శకు రాధిక ముఖంలో తెలియకుండానే చిరునవ్వు విరిసింది. అక్కడున్న వాళ్లందరూ ఆ బుజ్జి చేతిని చూసి మురిసిపోయారు.

 

అందరూ ఆ బాబునే చూస్తూ ఆనందంగా నవ్వుకుంటున్నారు.

 

ఇంతలో ఆ పసిబిడ్డ ఒక్కసారిగా ఏడుపు అందుకున్నాడు.

 

“అయ్యో! ఆకలేస్తున్నట్టుంది. పాల కోసం ఏడుస్తున్నాడేమో!”

 

అంటూ అక్కడున్న వాళ్లంతా బాబు వైపు చూస్తున్నారు.

 

ఆ చిన్నారి ఏడుపుతో అప్పటివరకు ఉన్న ఆందోళన కాస్త ఆనందంగా మారింది. ఇంతలోనే వాళ్లందరి చూపులు మరోసారి ఆపరేషన్ థియేటర్ తలుపు వైపు మళ్లాయి.

 

కానీ…

 

ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

 

అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ వాళ్ల దగ్గరకు వచ్చారు.

 

ఆయన ముఖంలో కనిపిస్తున్న గంభీరతను చూసి అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. కాసేపటి క్రితం నవ్విన ముఖాల్లో మళ్లీ భయం చోటుచేసుకుంది.

 

డాక్టర్ ఒక్క క్షణం ఆగి వాళ్ల వైపు చూస్తూ…

 

“I’m sorry… She is no more.”

 

అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

ఆ ఒక్క మాట…

 

అప్పటివరకు అక్కడ వినిపించిన బాబు ఏడుపును కూడా మించి వాళ్లందరి గుండెల్లో మారుమోగింది.

 

ఏం జరిగిందో అర్థం కానట్టు విజయ అక్కడే నిలబడిపోయింది. చేతుల్లో ఉన్న బాబును చూస్తూ, డాక్టర్ వెళ్లిన వైపు చూస్తూ ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు జారిపోయాయి.

 

రాధిక ముఖంలోని చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది. కాసేపటి క్రితం ఆనందంగా పట్టుకున్న బాబు చేతిని చూస్తూ ఆమె కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.

 

చేతుల్లో పసిబిడ్డ…

 

కళ్ల ముందు కన్నీళ్లు…

 

ఒకవైపు కొత్త ప్రాణం ఈ లోకంలోకి వస్తే, మరోవైపు ఓ ప్రాణం ఈ లోకాన్ని విడిచిపోయింది.

 

ఇంకా ఉంది… ❤️‍🩹