ఎర్రబడిన తన కళ్లను ఇంద్ర వైపు తిప్పి నిస్సహాయంగా చూస్తూ.. నా బాధకి నేను బయటకొచ్చేసా కానీ ఆ బంధువుల దృష్టిలో ఈ సమాజం దృష్టిలో.. నేను ఒకరితో లేచిపోయి వచ్చాను అనే ముద్ర నా మీద ఎప్పుడో పడిపోయి ఉంటుంది మోసగత్తెనని నన్ను ఈసడించుకుంటూనే ఉంటారు ఇంకెక్కడ ఉంది సార్ నాకు ఇల్లు?? అని మోకాళ్లపై కూలబడి ఏడ్చేసింది….
స్వర్ణ అన్న ప్రతి మాట ఇంద్ర గుండెల్లో తూటాల్లా పేలాయి… స్వర్ణ మోకాళ్లపై కూలబడి రోదిస్తుంటే.. ఇంద్ర ప్రాణం విలవిల్లాడిపోయింది.. ఎందుకంటే ఆ రోజు తను చూపించిన ఆవేశం.. ఆ కఠినమైన కోపమే కదా స్వర్ణ ని ఆ ఇల్లు దాటేలా చేసింది! తన కోపానికి తట్టుకోలేక, ఆ ఇంట్లో ఉండలేక బయటికి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడిందో సన్నీ ద్వారా తెలిసాక తనేంత తప్పు చేసాడో అర్థం అయ్యి ఇంద్ర కళ్లల్లోంచి కన్నీళ్లు ముత్యాల్లా రాలాయి… పశ్చాత్తాపంతో ఇంద్ర గుండె చెరువైంది…
స్వర్ణ ముందు ఇంద్ర కూడా మోకాళ్లపై కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్న స్వర్ణ భుజాలను పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు…ఇంద్ర చేతుల స్పర్శ తగలగానే స్వర్ణ ఏడుస్తూనే తల పైకెత్తి చూసింది… నిప్పులు కురుస్తున్న ఆ కళ్లల్లో తనను దహించివేసే ఆవేదన కనిపించింది ఇంద్ర కి…
స్వర్ణ కోపాన్ని లెక్క జేయక ఒక్కసారిగా హత్తుకొని ఐయామ్ సారీ స్వర్ణ అన్నాడు.. ఆ కౌగిలిలో ఆమెను కోల్పోయానన్న బాధ మాత్రమే ఉంది..