New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె మనసులో.. సీత కథ – 2

ఆమె మనసులో.. సీత కథ – 2

అప్పటివరకు ప్రపంచాన్ని మరిచి తమదైన లోకంలో సంతోషంలో తేలుతున్న ఆ జంట… ఆమెలో సడన్‌ గా వచ్చిన మార్పుకి ఏమి చేయాలో అర్థం కానీ అతను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియక ఆలోచనలో పడతాడు..

 

***

 

ఆమెను అలా చూసి.. ‘ఇప్పటి వరకు నాతో గడిపింది నువ్వేనా? ఇప్పుడు చూడు ఏమి తెలియని పసి పాపల ఎలా నిద్ర పోతుందో.. నా బుజ్జి బంగారం నువ్వు’ అని అనుకుంటూనే ఆమెను చూసి నవ్వుకున్నాడు.

 

అలా ఆమెను చూసి మురిసిపోతూ కాసేపటికి రవి కూడా నిద్రలోకి జారుకున్నాడు.

 

రవి నిద్రపోయాక, సీత మెల్లగా లేచింది. నిద్రపోతున్న భర్తను చూసింది. ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.

 

‘ఇంత మంచి వ్యక్తి ను ఎలా మోసం చేస్తున్నాను నేను!’ అని తనను తానే చీదరించుకుంటూ.. రవి నుదిటి మీద మెల్లగా ముద్దు పెట్టీ,

‘నన్ను క్షమించు రవి! నిన్ను చాలా మోసం చేస్తున్నాను.. నిన్ను తాకే హక్కు కూడా లేదు నాకు, అంత పాపం చేశాను, పాపిష్టిదాన్ని నేను..’ అని అనుకుంటూ తన తలను కొట్టుకుంటూ ఏడ్చింది సీత.

 

కాసేపటికి చీరను సరి చేసుకుని, ఆ గది నుంచి బైటికి వచ్చి, పక్క గదిలో ఉన్న పిల్లలను దూరం నుంచే చూసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ.. ఇంటి నుంచి మెల్లగా, ఎటువంటి శబ్దం చేయకుండా జాగ్రత్తగా బయటికి బయలు దేరింది.

 

అప్పటి వరకు ఉన్న వెన్నెల రాత్రి ఉన్నట్టుండి కాల రాత్రిగా మారిపోయింది. ఆ చీకటి రోడ్డు మీద నడుస్తూ, ఆమె మనసు ఒక నిర్ణయానికి వచ్చింది..

 

‘ఈ మోసం ఇక ఆగాలి… కానీ ఎలా? రవిని వదిలేయాలా? లేక ఈ రహస్యాన్ని ఎప్పటికీ దాచేయాలా?’ అని ఆలోచిస్తూనే తనకే తెలియకుండా కారు చీకటిలోకి నడుచుకుంటూ వచ్చేసింది సీత.

 

చీకటి గాఢంగా, దట్టంగా చుట్టుముట్టింది. విజయవాడ ఊరి రోడ్లు ఆ రాత్రి ఎంతో నిశ్శబ్దంగా, భయానకంగా మారిపోయాయి. దూరంగా ఎక్కడో కుక్క అరుపు వినిపించింది. ఒక్కసారి, రెండు సార్లు… తర్వాత మళ్లీ నిశ్శబ్దం. గాలి చల్లగా, తడిగా వీస్తూ సీత చీరను గట్టిగా చుట్టుకునేలా చేసింది. కానీ ఆ చలి శరీరానికి కాదు.. ఆమె గుండెలోకి చొచ్చుకుంటోంది.

 

ఆమె అడుగులు రోడ్డు మీద పడుతున్నప్పుడు, ఆ శబ్దం కూడా భయంకరంగా అనిపించింది. టప్… టప్… టప్… ఎవరో ఆమె వెనకాలే వస్తున్నట్టు, ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించి ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది.. కానీ అక్కడ ఏమీ లేదు. కేవలం దూరంగా ఒక స్ట్రీట్ లైట్ మాత్రమే ఉంది. అది కూడా ఒక్క వెలుగు వెలిగి, అంతలోనే ఆరిపోయింది. ఆ లైట్ కాంతిలో ఆమె నీడ పొడవుగా, వికారంగా సాగిపోతోంది.. ఒక అపరిచితురాలి నీడలా.

 

మనసులో ఆలోచనలు తుఫానులా తిరిగాయి.

‘నేను ఏం చేస్తున్నాను? రవి నన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసు. అతని కళ్లలో, అతని మనసులో, ఆ ఇంటిలో నేను దేవతను. కానీ నా మనసు… నా మనసు ఎందుకు ఇంత ద్రోహంగా ఉంది? ఆ రహస్యం… ఆ ఆలోచన… ఎందుకు నన్ను వదలడం లేదు? నేను బలహీనురాలినా? లేక పాపాత్మురాలినా?’

 

ఒక్కో అడుగు వేసినప్పుడూ ఆ ఆలోచనలు మరింత బరువెక్కాయి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి, కానీ ఏడవలేదు. ఏడవడానికి కూడా ధైర్యం లేదు. అలా ఆలోచిస్తూ ఊరి చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ముందుకి వెళుతున్న కొద్ది ఇక చుట్టూ ఇళ్లు తక్కువ, పొలాలు మొదలయ్యాయి. దూరంగా కృష్ణా నది.. తడి మట్టి, చెమ్మని గాలి వాసన వచ్చింది. ఏదో దూరంగా ఒక పడవ గంటలు కొట్టినట్టు శబ్దం.

 

ఆమె ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంది. చుట్టూ చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు కూడా మసకగా, దూరంగా కనిపిస్తున్నాయి.. ఆమెకు సహాయం చేయలేనంత దూరంలో. గాలి ఒక్కసారి బలంగా వీచి, ఆమె జుట్టును చెదరగొట్టింది. ఆమె చేతులు మోకాళ్ల మీద ఉంచుకుని, తల వంచుకుని కూర్చుంది.

 

‘ఇక ఏం చేయాలి? ఇంటికి తిరిగి వెళ్లాలా? రవి ముందు మళ్లీ అదే నవ్వుతో, అదే ప్రేమతో మాట్లాడాలా? ప్రతి క్షణం నటించాలా? కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదే.

 

ఆ రహస్యం నన్ను తినేస్తోంది. ఒకవేళ అతనికి తెలిస్తే… అతని కళ్లలో నేను దేవత కాదు… ఒక మోసగత్తేని అవుతాను. అది సహించలేను. కానీ వదిలేయడమూ సాధ్యం కాదు. ఒక వైపు ఈ బంధం… మరో వైపు ఈ పాపం… రెండూ నన్ను చంపేస్తున్నాయి.’

 

ఇంతలో దూరంగా ఒక రైలు కూత మోగింది. ఆ శబ్దం దీర్ఘంగా ఆమె గుండెలోకి ప్రతిధ్వనించింది. ఆమె కళ్లు మూసుకుని, ఒక్కసారి గట్టిగా పీల్చుకుంది. ‘పోనీ ఆత్మ హత్య చేసుకుంటే??’ ఆ ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా వెంటనే లేచి ఆ రైలు శబ్దం వస్తున్న వైపుకు కదిలింది.

 

***

 

అసలు సీత ఎందుకు అంతటి నిర్ణయానికి వచ్చింది…

 

కొనసాగుతుంది…

 

              sp ✍️… writes