ఆమె మనసులో.. సీత కథ – 3
సీత దేనికో బాధపడుతూ భర్త ను, పిల్లల్ని కన్నీళ్లతో చూసుకుని లోలోపల బాధ పడుతూ, ఏడుస్తూ, అక్కడి నుంచి బయటకు వెళ్లి.. ఆలోచనలతో అందరికీ దూరంగా.. ప్రపంచం నుంచే వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది..
***
రైలు సమీపిస్తోంది అనగా ఆమె భర్త రవి కళ్ళ ముందు కదలాడాడు. పిల్లలు, కుటుంబం ఏది గుర్తు రాలేదు. తన భర్తే తనకు ముఖ్యం అనుకుంది. వెంటనే అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది.
మళ్ళీ వెనుకకు వెళ్ళి అదే చోటులో కూర్చుంది. ఒక్కసారిగా చలి ఎక్కువైంది. శరీరం వణుకుతుంది కానీ లేచే ఆలోచన లేదు. ఆ రాత్రి ఆ చీకటి, ఆ ఒంటరితనం.. అన్నీ ఆమెను చుట్టుముట్టి, ఏదో భయంకరమైన నిశ్శబ్దంలో బంధించాయి.
ఆమె అక్కడే కూర్చుని ఉంది.. ఊరి చివర, ప్రపంచం చివర, తన ఆలోచనల చివర… ఒక నిర్ణయం తీసుకోవాలని తెలుసు. కానీ ఆ నిర్ణయం ఏదైనా సరే అది బాధాకరమైనదే అవుతుంది అని కూడా ఆమెకు తెలుసు..
‘ఇంత మంచి భర్త, పిల్లలు.. చక్కని కుటుంబం ఉన్నా కూడా నేను ఎందుకు ఈ రాత్రి వేళ ఇలా కూర్చుని బాధ పడుతున్నా.. నా పుట్టుక ఇంతేనేమో! అందరూ అన్నట్టు నా తండ్రి పోలికలతో పాటు, అతని బుద్ధులు కూడా వచ్చాయా? నా తండ్రి తో పాటు ఆమె తల్లి కూడా నాలనే ఉంటుంది అనేవారు. అంటే అతనిలానే, ఆమెలానే నేను కూడా నా.. నా.. అనుకుంటూ నా స్వార్థం నేను చూసుకుంటున్నానా!?’ అన్న ప్రశ్న తనలో కలుగగానే తన మీద తనకి అసహ్యం కలిగింది.
“ఎందుకంత అసహ్యం నిజమే కదా! నీకు నీ తండ్రి పోలికలు, నీ నానమ్మ పోలికలు రాక ఇంకెవరి బుద్ధులు, పోలికలు వస్తాయి. కనీ పెంచినంత మాత్రాన నీ అమ్మ తరపు వాళ్ళ అందరివి నీకు వస్తాయి అనుకుంటున్నావా?” అని చంప మీద చెల్లున కొట్టినట్టు మాట్లాడిన మాటలు వినిపించేసరికి ఈ టైంలో ఎవరు వచ్చారు ఇక్కడికి అని కంగారుగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది సీత.
“నువ్వు.. నువ్వు..” అని సీత తడబడుతుంటే..
“హ.. ఏంటి? నేనే.. నీ అంతరాత్మనే! కానీ నీ లాంటి కుళ్ళు బుద్ధి, స్వార్థ బుద్ధి నాకు ఏ మాత్రం అంటనివ్వలేదు. అందుకే నన్ను చూసి తడబడుతున్నావ్! ఎందుకే అంత భయం నీకు?
నీ రక్తంలోనే ఉంది కదా కుళ్ళు, స్వార్థం.. ఇంక నిన్ను ఎవరు, ఎలా పెంచినా రక్తంలో ఉన్న దాన్ని ఎవరూ మార్చలేరు కదా!?” అని అంది అంతరాత్మ.
“హేయ్! ఏంటి నువ్వు మాట్లాడేది? నేనేం వాళ్ళలా కాదు. నేను మా అమ్మమ్మ, తాత పెంపకంలో పెరిగాను, మావయ్య క్రమశిక్షణలో పెరిగాను, ఒక తల్లికి మించి ఆరుగురు తల్లుల ముద్దు ముచ్చటలో పెరిగాను.
ఇంతమందిలో పెరిగిన నాకు వాళ్ల బుద్ధి వచ్చిందని నువ్వెలా చెప్పగలవు? అసలు నువ్వు ఎందుకు చెప్తావ్?” అంటూ అంతరాత్మ చెప్పిన మాటలకి బదులుగా కోపంతో, రోషంగా, ఆవేదనతో గట్టిగా మాట్లాడింది సీత.
సీత మాటలకు ఆ అంతరాత్మ.. “హో.. అవునా! నిజామా!?” అని చాలా వెటకారంగా అడుగుతూ..
“అంత మంచి పెంపకం, క్రమశిక్షణలో పెరిగిన సీత గారు ఏంటో ఈ వేళప్పుడు ఇలా ఈ రాత్రివేళ ఒంటరిగా ఇంత సంఘర్షణలో పడి కొట్టుకుంటున్నారు?” అని అడిగింది.
అప్పటి వరకు బాధతో ఉన్న ఆమె ఒక్కసారిగా అంతరాత్మ వచ్చి మాట్లాడేసరికి ధైర్యం కలిగింది, కానీ అంతలోనే ఆమె మాట్లాడిన మాటలకు కోపం వచ్చి రోషంతో ఎదురు మాట్లాడింది. కానీ అంతలోనే మళ్ళీ ఆమె అడిగిన ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్పలేక బాధతో, సిగ్గుతో తల వంచుకుని ఉండిపోయింది సీత..
“ఏ! ఇప్పుడు ఎందుకు తల వంచుకుని నిలబడ్డావ్? ఇప్పుడు ఏమైంది నీ రోషం, నీ కోపం? నీ నోరు పడిపోయిందా? మాట తడబడుతుందా? ఇప్పుడు నువ్వు చేసిన తప్పు తెలిసి వచ్చిందా? లేదా ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూస్తున్నావా? మీ రక్తంలో కలిసిన నీ కుటుంబం వాళ్ళలా..” అంటూ అడిగింది అంతరాత్మ.
“అలా ఏమీ లేదు, నేనేమీ వాళ్ళలా కాదు. ఎన్నన్నా, ఏం చేసినా, నేను.. సీత.. నేను నేనే.. అంతే. కాకపోతే అది.. అది..” అని ఆ ముందు మాటలు గట్టిగా మాట్లాడి చివరికి వచ్చేసరికి మళ్ళీ తడబడుతూ ఆగిపోయింది సీత.
“అవునా! నిన్నే నమ్ముకున్న ఒక కుటుంబాన్ని వదిలేసి వచ్చేసావ్.. నీ మీద ప్రాణం పెట్టుకున్న భర్త, నీ మీద ఆధారపడ్డ పిల్లలు, ఇంటి పెద్దవాళ్లు.. అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని? ఏం నిర్వాకం వెలగబెడదామని? చెప్పు?” అని గట్టిగా అడుగుతూ… మళ్ళీ,
“ఇవేవీ నీ తప్పులులా కనిపించడం లేదా? లేదా ఇంతకంటే పెద్ద తప్పు ఏమైనా చేసి వచ్చావా? లేదా చేసేందుకు తెగించి ఇలా వచ్చావా?!” అని సీత నే సూటిగా చూస్తూ అడిగింది అంతరాత్మ.
***
ఇపుడు సీత ఏమి చేయనుంది? అంతరాత్మ అడిగిన ప్రశ్నలకు తన దగ్గర సమాధానం ఉందా?
కొనసాగుతుంది..
sp ✍️… writes
Swipe left/right or tap the sides to turn pages