లక్ష్మీ పురిటి నొప్పులతో బాధ పడుతుంటే.. ఆమెకు కొంచెం సీరియస్ గా ఉందని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆమెను కంగారుగా తీసుకుని వెళ్ళారు. వాళ్ళు అక్కడికి చేరుకున్న కాసేపటికి ఆ పెద్దాయన సంతానం అంతా కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నారు.
***
అక్కడికి చేరుకున్న రాము వాళ్ళ అమ్మ ను చూసి అందరి కంటే లక్ష్మీ వాళ్ళ అమ్మ నే ఎక్కువగా కంగారు పడిపోతుంది. అది ఎందుకు అని తెలియాలి అంటే రాము వాళ్ళ అమ్మ గురించి కొద్దిగా తెలుసుకుందాం..
రాము తండ్రి అతనికి బాబు పుట్టిన కొద్ది రోజులకు చనిపోయాడు. రాము తల్లికి ముందు నుంచి దైవ భక్తి తప్ప కుటుంబం, ప్రేమలు, బంధాలు ఇలాంటివేమీ ఆమెకు తెలియదు.. అందుచేతనే భర్త దూరంగా ఉండేవాడు. కాదు కాదు ఆవిడే దూరం పెట్టింది.. భర్త ఉన్నంతసేపు కలిసి ఒక ఇంట్లో ఉన్నట్టుగానే ఉండేవారు, కానీ ఎవరికి వారే జీవించేవారు.
భర్త మరణానంతరం ఆమెకు దగ్గరలో ఉన్న శ్రీకూర్మం లోనే కాలం గడుపుతూ ఉంటుంది. తన దగ్గర ఉన్న డబ్బును అంతా ఒక్కొక్క గుడిలో చందాలు, గో దానాలు అంటూ గుడులకే ఖర్చు పెట్టేది. ఇలా అప్పుడప్పుడు పిల్లలను చూసుకోవడానికి వస్తూ ఉండేది. కానీ వచ్చిన ఒక్క పూటలోనే తిరిగి వెళ్ళిపోయేది. అందుకు కారణం ఆవిడకి శుచి శుభ్రం.. బాగా ఎక్కువ.
ఉప్పులు, కారాలు చాలా అంటే చాలా తక్కువగా తింటుంది. ఇవతలి వారు ఎంత శుచిగా చేసినా సరే ఆమెకు నచ్చేది కాదు, ఏదోకటి అంటూ ఉండేది.