తొలిప్రేమ – 1
అది హైదరాబాద్ మహానగరంలోని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కల్యాణ మండపం.
పెళ్లి వేడుక కోసం ఆ కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఎటు చూసినా రంగురంగుల పూల అలంకరణలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, ఖరీదైన పూలతో తీర్చిదిద్దిన వేదిక… ఆ ప్రాంగణమంతా పెళ్లి కళతో కళకళలాడిపోతోంది.
వేల సంఖ్యలో బంధుమిత్రులు, ప్రముఖులు, పేరుమోసిన వ్యాపారవేత్తలు ఒక్కొక్కరుగా వేడుకకు విచ్చేస్తున్నారు.
కారణం మరి!
అది సాధారణమైన పెళ్లి కాదు. నగరంలోనే పేరుపొందిన గొప్ప వ్యాపారవేత్త ఆనంద్ వర్మ గారి కుమారుడు సిద్ధార్థ్ వర్మ వివాహం.
ఆనంద్ వర్మ గారి ఒక్కగానొక్క కుమారుడి పెళ్లి కావడంతో ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వచ్చిన అతిథులకు ఎలాంటి లోటు కలగకుండా ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు.
పెళ్లి వేదికపై పెళ్లికొడుకు సిద్ధార్థ్ వర్మ పీటల మీద కూర్చుని ఉన్నాడు.
పంతులుగారు చెబుతున్న మంత్రాలు, చేయమంటున్న కార్యక్రమాలు అన్నీ నామమాత్రంగా చేస్తూ అక్కడ కూర్చున్నాడు. అతడి ముఖంలో పెళ్లికళ కన్నా ఏదో తెలియని గంభీరతే ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే ఆ విషయాన్ని గమనించే తీరిక ఎవరికీ లేదు. పెళ్లి హడావుడిలో అందరూ తలమునకలై ఉన్నారు.
ఆనంద్ వర్మ, జయరాం ఇద్దరూ కేవలం ప్రాణ స్నేహితులు మాత్రమే కాదు… వ్యాపార రంగంలోనూ మంచి భాగస్వాములు.
ఏళ్లుగా కొనసాగుతున్న వారి స్నేహాన్ని, వ్యాపార భాగస్వామ్యాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనే ఆలోచన జయరాం గారికి కలిగింది.
ఆయనకు ఇద్దరు కొడుకులే తప్ప ఆడపిల్లలు లేరు. దాంతో తన తమ్ముడు శివరాం కూతురిని ఆనంద్ వర్మ గారి కుమారుడైన సిద్ధార్థ్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.
తన ఆలోచనను ఆనంద్ వర్మ గారితో పంచుకోగా, ఆయనకు కూడా ఈ సంబంధం కలుపుకోవడం ఇష్టమే కావడంతో వెంటనే అంగీకరించారు.
అలా ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సిద్ధార్థ్, శివరాం కూతురి వివాహం నిశ్చయమైంది.
—
వచ్చిన బంధువులను చిరునవ్వుతో పలకరిస్తూ, వారికి మర్యాదలు చేస్తూ బిజీగా ఉన్నారు వినయ్, అతడి భార్య మిథున.
అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంది…
“అక్కా! పెళ్లికూతురిని తీసుకురమ్మని పంతులుగారు చెబుతున్నారు” అంటూ మిథున దగ్గరకు వచ్చింది.
“అలాగా… పదా! తీసుకొద్దాం” అంటూ మిథున ఆనందితో కలిసి పెళ్లికూతురి గది వైపు బయలుదేరింది.
జయరాం గారికి ఇద్దరు కొడుకులు.
పెద్దవాడు వినయ్. అతడి భార్య మిథున.
చిన్నవాడు వివేక్. అతడి భార్య ఆనంది.
ఇద్దరూ తమ తమ వ్యాపారాల్లో స్థిరపడి జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నారు.
ఇక జయరాం గారి తమ్ముడు శివరాం విషయానికి వస్తే, ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు. మొదట కూతురు జన్మించగా, ఆ తర్వాత కొడుకు పుట్టాడు.
రెండు కుటుంబాల్లోనూ ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె అందరికీ ఎంతో గారాలపట్టి. తాతయ్య, నానమ్మ, బాబాయిలు, పిన్నిలు… ఇలా ప్రతి ఒక్కరి ప్రేమను పుష్కలంగా పొందుతూ పెరిగింది.
జయరాం గారు తన తమ్ముడితో సిద్ధార్థ్‌కు ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన చెప్పినప్పుడు శివరాం గారు మొదట కాస్త ఆలోచనలో పడ్డారు.
అయితే తన అన్నయ్య తన కూతురి మంచి కోరుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని నమ్మి చివరకు పెళ్లికి అంగీకరించారు.
శివరాం గారు మొదట ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత అన్నయ్య జయరాం గారి సహాయంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా మంచి స్థాయికి ఎదిగారు.
—
మిథున, ఆనంది ఇద్దరూ పెళ్లికూతురి గదికి చేరుకున్నారు.
అక్కడ పెళ్లికూతురు అందంగా ముస్తాబై కూర్చుని ఉంది. ఆమె పక్కనే ఓ అమ్మాయి నిలబడి ఉంది. బహుశా ఆమె పెళ్లికూతురి స్నేహితురాలై ఉంటుంది.
“రా అమ్మా… పంతులుగారు పిలుస్తున్నారు” అంటూ మిథున ఆప్యాయంగా పెళ్లికూతురి దగ్గరకు వెళ్లింది.
అమ్మాయి సిగ్గుతో చిన్నగా తల ఊపింది.
ఆ తర్వాత మిథున, ఆనంది కలిసి ఆమెను తీసుకుని పెళ్లి మండపం వైపు బయలుదేరారు. పెళ్లికూతురి స్నేహితురాలు కూడా ఆమె వెంటే వచ్చింది.
మండపం దగ్గరకు చేరుకున్నాక పెళ్లికొడుకు, పెళ్లికూతురి మధ్యలో అడ్డు తెర ఏర్పాటు చేశారు.
“బాబూ… అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి” అంటూ పంతులుగారు చెప్పడంతో, ఏదో ఆలోచనలో ఉన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా తల ఎత్తాడు.
తండ్రి వైపు ఒక్కసారి చూశాడు.
ఆ చూపులో ఏదో చెప్పలేని భావం ఉంది. అయినా ఎదురు చెప్పలేక, తన మనసుకు ఇష్టం లేకపోయినా తండ్రి మాట కోసం అమ్మాయి తలపై జీలకర్ర బెల్లం పెట్టాడు.
“అమ్మా… మీరు కూడా అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి” అని పంతులుగారు చెప్పడంతో, పెళ్లికూతురు బిడియంగా ముందుకు వంగి పెళ్లికొడుకు తలపై జీలకర్ర బెల్లం పెట్టింది.
ఆమె చేతులు స్వల్పంగా వణికాయి.
అప్పటివరకు పెళ్లికొడుకును ఆమె చూడలేదు.
చూడలేదు అనడం కన్నా, చూసే అవకాశం రాలేదనడం సమంజసం.
పెళ్లి సంబంధం ఖాయమైన తర్వాత కనీసం నిశ్చితార్థమైనా జరిపిద్దామని పెద్దలు అనుకున్నారు. కానీ పంతులుగారు మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో, నిశ్చితార్థం కార్యక్రమం లేకుండానే నేరుగా పెళ్లి జరిపించడానికి నిర్ణయించారు.
దాంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఒకరినొకరు చూసుకునే అవకాశం కూడా రాలేదు.
ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదికపై కూర్చున్నా మధ్యలో ఉన్న తెర వల్ల ఒకరి ముఖం మరొకరికి కనిపించడం లేదు.
“బాబూ… మాంగల్యధారణ చేయండి” అంటూ పంతులుగారు చెప్పడంతో సిద్ధార్థ్ లేచి నిలబడ్డాడు.
పక్కనే ఉన్న మంగళసూత్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
మరోసారి తండ్రి వైపు చూశాడు. ఆనంద్ వర్మ గారు కొడుకును చూసి చిన్నగా తల ఊపారు.
ఇక చేసేదేమీ లేదన్నట్టుగా సిద్ధార్థ్ మాంగల్యధారణ కోసం పెళ్లికూతురి వైపు వంగాడు.
అతడు ముందుకు వంగగానే పెళ్లికూతురి పక్కనే ఉన్న స్నేహితురాలు ఆమె పొడవైన, అందమైన పూలజడను చేత్తో పైకి ఎత్తి పట్టుకుంది.
సిద్ధార్థ్ ఆమె మెడలో మంగళసూత్రాన్ని వేస్తూ ఉండగా, అతడి చేతివేళ్లు అనుకోకుండా పెళ్లికూతురి మెడను తాకాయి.
ఆ స్పర్శ…
ఆమెకు అప్పటివరకు తెలియని ఓ కొత్త అనుభూతిని పరిచయం చేసింది.
మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
సిగ్గు, బిడియం రెండూ ఒకేసారి ఆమెను చుట్టుముట్టాయి.
తన మెడను తాకిన ఆ చేతుల స్పర్శకు ఆమె ఒంట్లో చిన్నపాటి వణుకు పుట్టింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక్కసారి చూడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తల ఎత్తి చూసే ధైర్యం మాత్రం చేయలేకపోయింది.
అంతలోనే మంగళసూత్రం ఆమె మెడలో పడింది.
మంగళసూత్రం పడగానే పంతులుగారు మంత్రాలు చదువుతూ తదుపరి కార్యక్రమానికి సిద్ధమయ్యారు.
ఒక్కొక్కటిగా వివాహంలో జరగాల్సిన సంప్రదాయాలన్నింటినీ నవదంపతులతో చేయిస్తున్నారు.
చుట్టూ ఉన్నవారి ముఖాల్లో ఆనందం, పెద్దల కళ్లలో సంతృప్తి కనిపిస్తుంటే… పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ ఇద్దరి మనసుల్లో మాత్రం ఎవరికీ తెలియని భావాలు మౌనంగా కదలాడుతున్నాయి.
ఆ క్షణం నుంచి వారి జీవితాలు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయన్న విషయం అక్కడున్నవారిలో ఎవరికీ తెలియదు.
కొనసాగుతుంది….
కొత్త కథ ఎలా అనిపించింది బడ్డీస్?
ఈ కొత్త ప్రయాణంలో మీ అభిప్రాయాలు కూడా నాకు చాలా ముఖ్యం. కథ నచ్చితే మీ కామెంట్స్ రూపంలో మీ ప్రేమను తెలియజేయండి.
మీ కామెంట్స్ మస్ట్ బడ్డీస్…
మీ నందు ❤️
Swipe left/right or tap the sides to turn pages