పెళ్లి చూపులు -72
‘పెళ్లి ఇక అది ఒక్కటే తక్కువ నాకు’ అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్
“ఏంటి పెళ్లి గురించి మాట్లాడుతుంటే సైలెంట్ అయిపోయావ్. నువ్వు సిరి ఇద్దరు చాలా అడ్వాన్స్ అయిపోయారు కదా..! ఆరోజు నేను చూశానులే” అని నవ్వుతూ అన్నాడు రవి..
“ఆ రోజు చూశాడా…? ఏ రోజు” అని అయోమయంగా కళ్ళు చిన్నవి చేసే రవి వైపు చూసాడు వైష్ణవ్..
” పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని జరుగుతాయి అనుకుంటే, మీకు పెళ్లికి ముందే అన్ని జరిగిపోయేటట్టు ఉన్నాయి. ఇన్ని రోజులు మేము మీతో పాటు ఇంటిలోనే ఉండడంతో ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్నారు.. కానీ మేము ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన మరుక్షణం మీ పనిలో మీరు బిజీగా ఉన్నట్లున్నారు” అని ఆరోజు వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం చూసి గుర్తు తెచ్చుకొని అడిగాడు..
అయోమయంగా వింతగా రవి మాటలు అనిపించడంతో “నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా..! మీరు ఉన్నప్పుడు నేను సైలెంట్ గా ఉండటమేంటి ఆ తర్వాత అడ్వాన్స్ అవడం ఏంటి..! పిచ్చి గాని పట్టిందా నీకు ఇలా మాట్లాడుతున్నావ్.. లేకపోతే పెళ్లి చేసుకుంటున్నావ్ అన్న ఆనందంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావా..!” అని అడిగాడు వైష్ణవ్..