ప్రేమలో పడితే -22
అనసూయ మాటలు సావిత్రికి నచ్చలేదు కానీ ఏదో చెప్పి మాట మాట పెరిగి గొడవ అవుతుంది అని ఒక్కక్షణం అసహనంగా అనసూయ వైపు చూసి రూములోనికి వెళ్ళిపోయింది సావిత్రి.
శ్రీరామ్ మాత్రం కోపంగా తన పిన్ని వైపు చూసి పిన్ని అని సాగదీస్తూ పిలిచి “బలవంతంగా పెళ్లి చేయడానికి భయపెట్టి పెళ్లి చేయడానికి అక్కడ ఉన్నది ఏమీ నా శత్రువు కాదు. నా చెల్లి తను ఎప్పటికీ నాకు చిన్న పిల్ల అనుకో, జీవితంలో తనకి ఇష్టం లేనిది నేను ఏదీ చేయలేదు. కానీ ప్రేమ అనేది నాకు, మన ఫ్యామిలీకి కరెక్ట్ కాదు కాబట్టి తనకి ఆ ప్రేమ వద్దు అంటున్నాం. అంతేకానీ తనని కష్టంగా వదిలించుకోవాలి, పెళ్లి చేసుకోకుండా ఇంట్లోనే ఉంటే మాకు భారం అవుతుంది అన్న ఫీలింగ్ ఇంట్లో ఎవ్వరికి లేదు. ఇంకొక్కసారి ఇలా మాట్లాడితే నేను కాదు నెక్స్ట్ స్టెప్పు బాబాయ్ వేస్తాడు” అని కోపంగా చెప్పి తన రూములోనికి వెళ్ళిపోయాడు.
“నేనేం మాట్లాడానని వీడు ఇలా మాట్లాడి కోపంగా రూమ్ లోనే వెళ్ళిపోతున్నాడు” అని తన భర్త వైపు తిరిగి అన్నది అనసూయ..
“మన పిల్లలు మనకు దగ్గరగా ఫ్యామిలీ సపోర్టుతో ఫారన్ లో చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాధ ఏంటి అనేది నీకు అర్థం కావడం లేదు. ఒకవేళ రమ్య నీ కన్న కూతురు అయితే నువ్వు ఇలానే మాట్లాడతావా..? సిచువేషన్ ఏంటో తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్..?” అని అసహనంగా అన్నారు హర్షవర్ధన్..
“ఇది మరీ బాగుంది నా కూతురుతో రమ్యని పోలుస్తారు ఏంటండీ, రమ్య చెప్పిన మాట వినకుండా ఇంటి బయట ఉంది మన పిల్లలు చెప్పిన మాట వింటూ హ్యాపీగా ఫారెన్ లో చదువుకుంటున్నారు” అని అన్నది అనసూయ.