ఉదయం నుంచే ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం సందడిగా ఉంది.పాఠశాల గేటు దగ్గర పెద్ద అక్షరాలతో ఒక బోర్డు పెట్టి ఉంది
ఉచిత వైద్య శిబిరం – గ్రామీణ ప్రజల ఆరోగ్య పరీక్షలు
త్రిపుర చదువుతున్న మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఆ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ నుంచి వచ్చిన వైద్యులు, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందితో ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది.
తెల్లటి కోటు వేసుకుని, మెడలో స్టెతస్కోప్‌తో తిరుగుతున్న త్రిపురను చూస్తే ఆమెలోని అల్లరి అమ్మాయి ఎక్కడా కనిపించదు. ఎవరికేం కావాలో అడుగుతూ, మందుల కౌంటర్ దగ్గర ఏర్పాట్లు సరిచేస్తూ, వచ్చినవాళ్లకు కూర్చునే చోటు చూపిస్తూ హడావుడిగా తిరుగుతోంది.
“త్రిపురా! ఆ రిజిస్ట్రేషన్ ఫారాలు ఎక్కడ పెట్టావు?”
“అక్కడ టేబుల్ మీద పెట్టాను మేడమ్. అయిపోయాయా? ఇంకొన్ని తీసుకొస్తాను.”
“ముందు ఈ మందుల లిస్ట్ ఒకసారి చెక్ చేయమ్మా.”