New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
యక్షిణి – 1

యక్షిణి – 1

నడిరేయి..

 

సమయం పదకొండు గంటలు..

 

కటిక అమావాస్య. ఆకాశంలో చంద్రుడి జాడ లేదు. నక్షత్రాలు సైతం మేఘాల వెనుక దాక్కున్నాయి. చుట్టూ అలుముకున్న చీకటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది..

 

ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. గాలికి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి తాకుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి..

 

స్మశానంలో వెలిగించిన కొన్ని చితి మంటలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. వాటి నుంచి వెలువడుతున్న పొగ గాలిలో కలుస్తూ ఉంది..

 

అలాంటి భయానక వాతావరణంలో..

 

స్మశానంలోని ఎముకల గుట్ట మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు విక్రమాదిత్య..

 

నల్లటి వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి రేఖలు, జుట్టు పూర్తిగా చిక్కులు పడి ఉంది. అతని చూపు మాత్రం ఎదురుగా ఉన్న ఒక నిర్జన ప్రదేశం మీద నిలిచిపోయింది..

 

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అతని ముఖంలో ఈరోజు ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. పెదవులు బిగుసుకుపోయాయి..

 

దాదాపు రెండు గంటలుగా అతను అక్కడే కదలకుండా కూర్చుని ఉన్నాడు..

 

అదే సమయంలో..

 

అయ్యా.. అంటూ మెల్లగా పిలిచాడు అక్కడి కాటికాపరి అంజన్న. విక్రమాదిత్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు..

 

అయ్యా…! అని ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు అంజన్న. అప్పటికీ అతని చూపులో ఎలాంటి మార్పు లేదు..

 

ఏమైంది అయ్యా? ఇన్నేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా మీ వదనంలో ఇలాంటి ఆందోళన, దిగులు ఎప్పుడూ చూడలేదు..

 

కానీ ఇవ్వాళ మీ ముఖంలో ఏదో తెలియని భయం కనిపిస్తోంది. ఏమైంది అయ్యా? అని అడిగాడు అంజన్న..

 

ఆ ప్రశ్నతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చిన విక్రమాదిత్య నెమ్మదిగా అతని వైపు చూశాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు..

 

తర్వాత ఎదురుగా ఉన్న చీకటిలోకి చూస్తూ..

 

“వస్తుంది.. తను వస్తుంది..” అన్నాడు గంభీరంగా.

 

ఎవరు అయ్యా? ఎవరు వస్తున్నారు అయ్యా?
అని అడిగాడు అంజన్న.

 

“యక్షిణి!” అన్నాడు విక్రమాదిత్య గంభీరమైన స్వరంతో. ఆ ఒక్క మాటతో అంజన్న శరీరం ఒక్కసారిగా వణికిపోయింది..

 

అతని గుండెలో ఏదో తెలియని భయం మొదలైంది. గొంతు పూర్తిగా పొడిబారిపోయింది. నోట్లో నుంచి మాట రావడం లేదు..

 

ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని…

“య… య… యక్షిణి ఆ…!”

అంటూ తడబడుతూ అడిగాడు..

అవును అంజన్నా… యక్షిణి! అన్నాడు విక్రమ్.

అయ్యా.. మీరు ఏమంటున్నారు? తను మళ్లీ వస్తుందా? అని అడిగాడు అంజన్న..

వస్తుంది. తను తప్పకుండా వస్తుంది అన్నాడు విక్రమ్. కానీ.. కానీ తను వెళ్లిపోయి ఇన్నేళ్లు అయింది కదా అయ్యా! అన్నాడు అంజన్న..

 

కాలం గడిచినంత మాత్రాన కర్మ చెరిగిపోదు అంజన్నా. కొన్ని శక్తులు కాలానికి అతీతమైనవి. వాటి ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే మళ్లీ మొదలవుతుంది అన్నాడు విక్రమాదిత్య..

 

అంజన్నకు గతంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.

అయ్యా.. తను వచ్చినప్పుడు గతంలో ఏం జరిగిందో ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి..

 

ఆ రాత్రి జరిగిన విధ్వంసం, ఆ అరుపులు, ఆ రక్తపాతం.. ఇప్పటికీ తలుచుకుంటే నా ఒళ్లు జలదరిస్తుంది అంటూ ఆగి విక్రమాదిత్య వైపు చూశాడు..

 

మీరు మీ సర్వస్వం కోల్పోయింది కూడా తన వల్లే కదా అయ్యా. ఒకప్పుడు యువరాజులా జీవించిన మీరు.. ఇప్పుడు ఈ స్మశానంలో నివసించే స్థితికి వచ్చారంటే అందుకు కారణం ఆ యక్షిణి కదా! అన్నాడు అంజన్న..

 

అంజన్న మాటలకు విక్రమాదిత్య ముఖంలో క్షణకాలం బాధ కనిపించింది. మరి ఇప్పుడు మళ్లీ తను వస్తే… ఈసారి ఏం జరుగుతుందో తలుచుకోవడానికే భయంగా ఉంది అయ్యా..

 

గతంలో జరిగినట్టే మళ్లీ మొత్తం సర్వనాశనం అవుతుందని మీరే అన్నారు కదా! మరి తను తిరిగి రాకుండా ఏదో ఒకటి చేయవచ్చు కదా? అన్నాడు అంజన్న ఆందోళనగా..

 

అంతే..

 

ఇప్పటివరకు మౌనంగా ఉన్న విక్రమాదిత్య ఒక్కసారిగా స్వరం పెంచాడు. ఆపు అంజన్నా! అంటూ..

 

అతని గంభీరమైన స్వరానికి స్మశానంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..

 

ప్రారబ్ధాన్ని ఎవరు మార్చలేరు! మనిషి చేసిన కర్మకు ఫలితం అనుభవించి తీరాల్సిందే. దైవం రాసిన రాతను చెరిపేయడం ఎవరి వల్లా కాదు..

 

తను రావాలని నిర్ణయమైపోయింది. తన ఆగమనం తప్పదు! అంటూ నెమ్మదిగా ఎముకల గుట్ట మీద నుంచి కిందకు దిగాడు..

 

ఎంత దూరం పారిపోయినా కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఎంతటి శక్తివంతుడైనా తన విధిని తప్పించుకోలేడు..

 

ఈసారి జరగబోయేది కేవలం ఒక యక్షిణి తిరిగి రావడం మాత్రమే కాదు అంజన్నా.. ఎన్నో జీవితాలను మార్చబోయే ఒక కొత్త అధ్యాయం!అంటూ ఆకాశం వైపు చూశాడు..

 

ఆ సమయంలో ఒక్కసారిగా బలమైన గాలి వీచింది.

స్మశానంలో ఉన్న ఎండిపోయిన చెట్ల కొమ్మలు గట్టిగా ఊగసాగాయి..

 

విక్రమాదిత్య తన నల్లటి వస్త్రాన్ని సరిచేసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
అతను వెళ్లిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు అంజన్న..

***

 

కొద్దిసేపటి తర్వాత..

 

వాతావరణంలో ఏదో అసహజమైన మార్పు మొదలైంది. స్మశానంలోని చితి మంటలు ఒక్కసారిగా పెద్దవయ్యాయి..

 

ఆ తర్వాత అంతే వేగంగా ఆరిపోయాయి. చుట్టూ అలుముకున్న చీకటి మరింత దట్టంగా మారింది.

ఎక్కడో సమీపంలో ఎవరో గట్టిగా నవ్వినట్టుగా ఒక వింత శబ్దం వినిపించింది..

 

అంజన్న గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది.

వెంటనే స్మశానానికి బయట ఉన్న తన చిన్న గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. లోపలికి వెళ్లి తలుపులు మూసేశాడు..

 

తలుపుకు గడియ పెట్టి గోడకు ఆనుకుని కూర్చున్నాడు. అతని మనసులో గతంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా మెదలసాగాయి..

 

ఆమె మొదటిసారి కనిపించిన రాత్రి..

ఆమె నవ్వు..

ఆమె కళ్లలో కనిపించిన క్రూరత్వం..

ఆమె అడుగుపెట్టిన చోట జరిగిన విధ్వంసం..

 

అన్నీ గుర్తుకొస్తున్నాయి. దేవుడా.. మళ్లీ ఆ పీడకల మొదలవుతుందా? అంటూ చేతులు జోడించి ప్రార్థించడం మొదలుపెట్టాడు అంజన్న.

 

కానీ అతనికి తెలియదు..

 

ఆమె రాకకు ప్రకృతి ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టిందని!

***

 

అదే సమయంలో..

 

స్మశానం నుంచి బయలుదేరిన విక్రమాదిత్య తన ఆశ్రమానికి పశ్చిమ దిశగా ఉన్న అటవీ ప్రాంతం వైపు ప్రయాణిస్తున్నాడు..

 

ఆ అడవిలోకి వెళ్లే దారి చాలా భయానకంగా ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, వాటి మధ్య నుంచి వీస్తున్న చల్లటి గాలి, అప్పుడప్పుడు వినిపిస్తున్న జంతువుల అరుపులు..

 

కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పాడుబడిన కుటీరం కనిపించింది..

 

ఆ కుటీరం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, విరిగిపోయిన కిటికీలు, శిథిలావస్థకు చేరుకున్న గోడలు.. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఎవరూ నివసించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది..

 

విక్రమాదిత్య ఆ కుటీరం దగ్గరకు వెళ్లి ఆగాడు.

అక్కడే ఉన్న ఒక రాతి మీద కూర్చుని ఆ కుటీరం వైపు తదేకంగా చూడసాగాడు..

 

అతని కళ్లలో ఎన్నో జ్ఞాపకాలు కదలాడుతున్నాయి.

 

“ఇక్కడే.. ఆమె కథ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ తిరిగి ఊపిరి పోసుకుంది కూడా ఇక్కడే! ” అంటూ ఆ కుటీరం తలుపుల వైపు చూశాడు..

 

ఆమెతో తనకు జరిగిన చివరి సంభాషణ అతని మనసులో మళ్లీ మెదిలింది..